2022 సంవత్సరం టాలీవుడ్‌కు కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఏడాది. తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని శోకాన్ని మిగిల్చింది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు చాలామంది తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేనిల తర్వాత టాప్ హీరోలుగా రాణించిన కృష్ణ, కృష్ణంరాజుతో పాటు విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ, చలపతిరావు, దర్శకుడు శరత్, హీరో రమేష్ బాబు సహా అనేక మంది కన్నుముశారు. అద్భుతమైన నటనతో వెండితెరపై వెలుగులు పంచిన ఆ తారలు ఇక సెలవు అంటూ దివికెగిసారు. భౌతికంగా దూరమైనా వారు నటించిన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.
ఈ యేడాది సూపర్ స్టార్, రెబల్ స్టార్ సహా కన్నుమూసిన సినీ ప్రముఖులు ఎవరంటే.
జనవరి 3న తెలుగు చలన చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్య సమస్యల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు. జనవరి 8న సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. జనవరిలోనే 19న అనారోగ్య కారణంగా కొంచాడ శ్రీనివాస్ కూడా తుదిశ్వాస విడిచారు. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన మృతి చెందడం తోటి కళాకారులని శోక సముద్రంలో ముంచెత్తింది. మార్చి 12న రచయిత కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ సాహిత్యంలో నయాట్రెండ్ సెట్ చేసిన రచయిత కందికొండ. అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూసారు. ఏప్రిల్ 1న డైరక్టర్ శరత్ కూడా అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. దాదాపు 20 సినిమాల దాకా చేసిన ఆయన బాలకృష్ణ, సుమన్ లతో టాలీవుడ్ కి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు.
ఇదే ఏడాది ఏప్రిల్ 9న సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. 1958 లో ఆయన నటుడిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి 2013 వరకు ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా కూడా బాలయ్య తన ప్రతిభని చూపించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. పరిశ్రమలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఏప్రిల్ 20న ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఆయన సినిమాలను డైరెక్ట్ చేశారు. నిర్మాతగా కూడా ఈయన సుపరిచితులు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా మొదలు పెట్టి విలన్ గా మారి ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాధే శ్యాం ఈవెంట్ టైం లోనే ఆయన హెల్త్ సరిగా లేదని అనిపించింది. అదే ఆయన చివరి ఫ్యాన్ మీట్. కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమకు తీరని నష్టం. ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులంతా కూడా నివాళి అర్పించారు.
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్ కృష్ణ నవంబర్ 15న కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక చెరిగని ముద్ర వేసుకున్నారు. కృష్ణ ప్రేక్షకుల హృదయాల్లో అల్లూరి సీతారామరాజు గా ఎప్పటికీ నిలిచి ఉంటారు. తెలుగు ఫస్ట్ కౌబాయ్ గా ఆయన నటన మరువరానిది. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చారు కృష్ణ. ఈయన మృతితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందనే చెప్పాలి. కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కూడా ఈ యేడాది సెప్టెంబర్ 28న కన్నుమూసారు. ఈమె చనిపోయిన నెలన్నర వ్యవధిలో భర్త సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడం విచారకరం. మహేష్ బాబు ఒకే ఏడాదిలో తల్లిదండ్రులతో పాటు అన్నను పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో మునిగిపోయారు.
2022 ఎండింగ్లో దిగ్గజ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావులని సినీ పరిశ్రమ కోల్పోయింది. కొన్నాళ్లుగా వయసు రీత్యా వస్తున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ, డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు. తెలుగుతెరపై ఒకదానితో ఒకటి సంబంధంలేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్నారు సత్యనారాయణ. మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు. ఆ షాక్‌లో ఉండగానే డిసెంబర్ 25న మరో ప్రసిద్ధ నటుడు చలపతిరావు గుండెపోటుతో చనిపోయారు. 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు.