41వ ఆవిర్బావ వేడుకలు ఏపీలో ఎందుకు చేయలేదు

By KTV Telugu On 30 March, 2023
image

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని  తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరగనున్న ఎన్నికలు టిడిపికి అగ్ని పరీక్ష లాంటివి ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే పార్టీ మనుగడకే ప్రమాదం. అయినా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణాలో నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్ణయించారన్నది ఆసక్తిగా మారింది. ఇపుడు తెలంగాణా లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మంచి ఓటు బ్యాంకే ఉండేది. ఎన్టీయార్ హాయంలో తెలంగాణా నుంచే ఎందరో కీలక నేతలను రాజకీయాల్లోకి తెచ్చారు ఎన్టీయార్. అందుకే తెలంగాణాలో టిడిపికి మంచి పట్టు ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సమీకరణలు మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో తెలంగాణాలో 14 స్థానాలు సాధించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత  తెలంగాణాలో పార్టీ బలం తగ్గుతూ వచ్చింది. టిడిపి ఎమ్మెల్యేలు కూడా  ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బి.ఆర్.ఎస్. లో చేరిపోయారు. దీంతో టిడిపి పూర్తిగా బలహీన పడిపోయింది.

నాలుగేళ్ల తర్వాత 2018లో తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టారు బి.ఆర్.ఎస్. నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తమ ఆగర్భ శత్రుపక్షమైన కాంగ్రెస్ తో జట్టు కట్టారు చిత్రంగా. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఆయనతో చేతులు కలిపి కౌగలించుకుని చాలా ఎక్కువగా ప్రేమ ఒలకబోశారు. ఆ స్నేహం కాస్తా రెండు పార్టీల మధ్య పొత్తుకు దారి తీసింది. 2018 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్-టిడిపి-కమ్యూనిస్టు పార్టీలు కలిసి కూటమిగా అవతరించాయి. అయితే ఆ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఘన విజయం సాధించింది. కేసీయార్ నాయకత్వంలోని బి.ఆర్.ఎస్. పార్టీ ఏకంగా 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బి.ఆర్.ఎస్. 2018లో మరో 25 స్థానాలు అదనంగా గెలిచింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో టిడిపి గౌరవ ప్రదమైన స్థానాలు గెలుచుకుంటుందని చంద్రబాబు నాయుడు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తన హయాంలోనే హైదరాబాద్ ను ప్రపంచ పటంపై పెట్టామని ఐటీ విప్లవానికి తానే ఆది పరుషుణ్నని చంద్రబాబు చాటి చెప్పుకున్నారు. విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకునే వారంతా తనకు రాయల్టీ చెల్లించాలని కూడా అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తన పాలనలోనే జరిగిందని చెప్పుకున్నారు. అయినా జనం చంద్రబాబు నాయుణ్ని నమ్మలేదు. బి.ఆర్.ఎస్. కే పట్టం కట్టారు. టిడిపి ఓటు బ్యాంకు పూర్తిగా  బలహీన పడిపోయింది.

ఆతర్వాత తెలంగాణాను పట్టించుకోవడం మానేశారు చంద్రబాబు నాయుడు. తెలంగాణా ఎన్నికలు జరిగిన ఏడాదికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక అప్పట్నుంచీ చంద్రబాబు నాయుడు కేవలం ఏపీలోనే అప్పుడప్పుడు జూమ్ లో హడావిడి చేస్తూ వచ్చారు. కానీ తెలంగాణాను మాత్రం ఇంచుమించు వదిలేశారు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా తెలంగాణాపై దృష్టి సారించారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది తెలంగాణా టిడిపి. తెలంగాణా టిడిపి అధ్యక్షుడి కాసాని జ్ఞానేశ్వర్ ని నియమించిన తర్వాత తెలంగాణాలో టిడిపిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పచ్చు. అయితే పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా బి.ఆర్.ఎస్. వైపు మళ్లిపోయిందని రాజకీయ పండితులు అంటున్నారు.
ఖమ్మం సభలోనూ తెలంగాణా తన హయాంలోనే అభివృద్ధి చెందిందని చెప్పిన చంద్రబాబు తాజాగా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. నిజానికి ఈ సభ ఏపీలో నిర్వహించి ఉంటే ఆయన పార్టీకి ఎంతో కొంత మేలు జరిగేది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా తెలంగాణాలో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అదే ఏపీలో అయితే వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి అన్ని వనరులూ శక్తి యుక్తులూ ఏపీలోనే వెచ్చించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చిత్రంగా తెలంగాణాను వేదికగా ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు.

ఈ సభను ఏపీలో పెట్టకపోవడం అంటే ఏపీని పూర్తిగా వదిలేసుకుంటున్నారా లేక తెలంగాణాలో బలహీన పడ్డ పార్టీకి జవసత్వాలు తెచ్చిపెట్టాలని పట్టుదలగా ఉన్నారా అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. బిజెపి పెద్దలను ఆకర్షించడానికే చంద్రబాబు నాయుడు తెలంగాణాలో కొత్త ఆపరేషన్ కు సిద్ధమయ్యారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. తెలంగాణాలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేస్తే తమకి ఎంతో కొంత బలం ఉందని నిరూపించుకుంటే తెలంగాణాలో అధికారంలోకి రావాలని పంతంగా ఉన్న బిజెపి తమతో పొత్తుకు ముందుకు రావచ్చునని చంద్రబాబు నాయుడి ప్లాన్ గా ఉందని అంటున్నారు. తెలంగాణాలో టిడిపి ఓటు బ్యాంకును బిజెపికి అప్పచెప్పడం ద్వారా బిజెపి నాయకత్వం దృష్టిలో మంచి మార్కులు సంపాదించుకుంటే 2024 లో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి తమతో పొత్తుకు ఒప్పుకోవచ్చునని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారు చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా తమతో జట్టు కడితే అది ఎన్నికల్లో తమకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు నాయుడి వ్యూహానికి బిజెపి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి. ఇక తెలంగాణాలో ఇప్పటికే కీలక నేతలంతా పార్టీకి దూరమైపోయి ఉన్నారు. వారిలో కొందరు కాంగ్రెస్ లో చేరగా ఎక్కువ మంది బి.ఆర్.ఎస్. లో చేరారు. ఇప్పుటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు టిడిపిలో చంద్రబాబు నాయుడికి కుడిభుజమే కూడా. చంద్రబాబు సూచనల మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారని అంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు వర్కవుట్ కాలేదు కాబట్టి వచ్చే తెలంగాణా ఎన్నికలనాటికి బి.ఆర్.ఎస్. లో ఉన్న మాజీ టిడిపి నేతలను ఆకర్షించి టిడిపిలోకి లాగేయాలని చంద్రబాబు చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనుకునే నేతలను టిడిపిలోకి ఆహ్వానించి పెద్ద ఎత్తున హడావిడి చేస్తే బిజెపి తమతో చేతులు కలపడానికి సిద్దపడుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు.ఆ ప్రయత్నంలో భాగంగానే టిడిపి సభను తెలంగాణాలో నిర్వహించారని అంటున్నారు. నిజానికి ఈ కార్యక్రమం రెండు రాష్ట్రాల్లోనూ జరగాలి. అపుడు రెండు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల నేతలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిఉండి తెలంగాణాలో పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో పాల్గొనడం విశేషం. దీని వెనుక ఆయన మనసులో పకడ్బందీ వ్యూహం ఉండే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.