వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే 2024 లో సాధ్యం కాదని కేంద్ర లా కమిషన్ తేల్చి చెప్పేసింది. కొద్ది రోజుల క్రితం వరకు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరిగింది. జమిలి ఎన్నికల బిల్లు కోసమే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చినట్లు కూడా చెప్పుకున్నారు. అయితే ఆ సమావేశాల్లో కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే ఆమోదించింది పార్లమెంటు. జమిలి ఎన్నికల ఊసే సభలో రాలేదు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే.
2024 లో లోక్ సభ ఎన్నికలతో పాటే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయ పడుతోన్నట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కోసం అందరినీ ఒప్పించడంతో పాటు కొన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా ఇపుడు 2024 ఎన్నికల లోపు సమయం సరిపోదని లా కమిషన్ భావనగా చెబుతున్నారు. అందుకే 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందుకోసం లా కమిషన్ ఒక ఫార్ములాను రూపొందిస్తోన్నట్లు సమాచారం. మరో పక్క రామ్ నాత్ కోవింద్ కమిటీ కూడా జమిలి ఎన్నికల నిర్వహణ పై కసరత్తులు చేస్తోంది.
లా కమిషన్ అభిప్రాయం నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఉన్న అయోమయానికి తెరపడినట్లయ్యింది. 2029 వరకు వివిధ రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయన్న క్లారిటీ కూడా వచ్చినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. జమిలి ఎన్నికల కసరత్తులను దృష్టిలో పెట్టుకునే తెలంగానా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణా ఎన్నికలు 2024 ఏప్రిల్ మే నెలలకు వాయిదా పడే అవకాశం ఉందని మీడియా సమక్షంలోనే అన్నారు. తాజాగా ఈ విషయంలో స్పష్టత రావడంతో తెలంగాణా ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులోనే జరిగడం ఖాయమంటున్నారు.
షెడ్యూలు ప్రకారం ఈ డిసెంబరులో తెలంగాణా తో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథుల బృందం తెలంగాణాలో రెండు సార్లు పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది, కేంద్ర బలగాలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపైనా చర్చించారు. అక్టోబరు మూడున మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ రానుందని చెబుతున్నారు. అక్టోబరులో ఈ బృందం రాష్ట్రంలో పరిస్థితులపై అవగాహనకు రావడంతోనే ఎన్నికల నగారా మోగించడానికి సిద్ధమవుతారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాలకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలనూ నాలుగు నెలలు ముందుకు జరిపి తెలంగాణా తో సహా ఇతర అయిదు రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు నిర్వహిస్తారని మొన్నటి దాకా బాగా ప్రచారం జరిగింది. లా కమిషన్ జమిలికి ఇప్పుడు అవకాశం లేదని తేల్చేయడంతో వచ్చే ఏడు జరగాల్సి ఉన్న ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొద్ది వారాల క్రితం వరకు టిడిపి , జనసేన పార్టీలు బాగా ప్రచారం చేశాయి.
ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదాన్ని వినిపించిన బిజెపి వాదన ఏంటంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే సారి ఎన్నికలు జరిగితే.. తర్వాతి ఎన్నికల వరకు అందరూ కూడా అభివృద్ధిపైనే దృష్టి సారించవచ్చునన్నది వారి వాదన. ప్రస్తుతం మన దేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తూ ఉంటుంది. కోడ్ కారణంగా కొన్ని అభివృద్ధి పథకాల అమలుపై ఆంక్షలు ఉండే అవకాశాలుంటాయి. అందుఏక అందరూ అమెరికా తరహాలో ఒకేసారి ఎన్నికల తంతు ముగించేసుకోవాలన్నది బిజెపి ఆలోచన. అయితే విపక్షాలు ఈ ఐడియాను వ్యతిరేకిస్తున్నాయి. మరి 2029 నాటికైనా జమిలి సాధ్యం అవుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…