నోట్ల రద్దు.. నోట్ల ఉపసంహరణ. కారణం ఏదైనా ప్రజలకు ఈ పేరు వినిపస్తే ముచ్చెమటలు పడతాయి. ప్రస్తుతం రూ. రెండు వేల నోట్ల ఉపసంహరణ జరుగుతోంది. రూ. రెండు వేల నోటు ఉపసంహరణ ప్రభావం తక్కువగానే ఉంది. ఆ నోట్లు ఉన్న వారు తక్కువే. కానీ ఆ తక్కువ మంది కూడా మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఇప్పుడు రూ. ఐదు వందల నోటు విషయంలోనూ ఆర్బీఐ చేసిన ఓ ప్రకటన ఆ నోటూ రద్దు చేస్తారేమోనన్న అభిప్రాయం కల్పించేలా చేస్తోంది. రూ.2000 నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్‌కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా సర్క్యులేషన్‌లో ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2022-23 సీజన్‌లో రూ.500 డినామినేషన్‌కు చెందిన 14.4 శాతం నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్లను గుర్తించినట్లు ఒక నివేదికలో పేర్కొంది.
అర్బీఐ ప్రకటన ప్రకారం చూస్తే రూ. ఐదు వందల నోట్ల నకిలీలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పక తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దొంగ నోట్లు ఏవో మంచి నోట్లు ఏవో గుర్తు పట్టలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్లను కూడా యాజిటీజ్ దించేసి మరీ ఫేక్ నోట్స్ తయారు చేస్తున్నారని వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. ఆ వెబ్ సీరిస్‌లలో వచ్చేది నిజమేనని ఆర్బీఐ నివేదికను బట్టి వెల్లడవుతోందని అంటున్నారు. గతంలోలా నోట్లను రద్దు చేస్తే గందరగోళం ఏర్పడుతుందని కేంద్రం వ్యూహాత్మకంగా ముందుగా రెండు వేల నోటును ఉపసంహరించుకున్నారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యహాల్ని అంచనా వేయడం కష్టం. అయితే నకిలీ నోట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతూంటే కేంద్రం అయినా చూస్తూ ఊరుకోదు. అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. దేశంలో అరాచకం ఏర్పడుతుంది. ఆర్థిక అస్థిరత్వం ఏర్పడుతుంది. నిజానికి ఆర్బీఐ ప్రకటించిన దానికన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఎక్కువగానేఉంది.
దేశంలో చలామణీ అవుతున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన కచ్చితమైన లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలీవు. దేశంలో నకిలీ కరెన్సీ కనిపించకుండా చేస్తానని మోదీ అధికారంలోకి వచ్చిాక ప్రకటించారు. నకిలీ కరెన్సీని చలామణీ నుంచి మాయం చేయడానికేనంటూ 2016 నవంబర్ 8న ఉన్నపళాన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. నకిలీ కరెన్సీ ప్రపంచవ్యాప్త సమస్య. నకిలీ కరెన్సీ బెడదను అరికట్టడానికి ప్రతిదేశం తను అధికారికంగా ముద్రించే కరెన్సీలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఉంటుంది. అయినా నకిలీ నిపుణులు వాటికి దీటుగా నకిలీ కరెన్సీని చాపకింద నీరులా చలామణీలోకి తెస్తూనే ఉంటారు. ప్రపంచంలో విరివిగా నకిలీలకు గురయ్యే కరెన్సీ అమెరికన్ డాలర్. ఆ తర్వాత ఇదే వరుసలోకి బ్రిటన్ పౌండ్, యూరోప్ దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో వస్తాయి. అత్యధిక శాతం నకిలీలకు లోనయ్యే ఘనత మెక్సికన్ పెసోకు దక్కుతుంది. 9.91 కోట్ల మెక్సికన్ పెసో నోట్లలో కనీసం 3 లక్షల నకిలీ నోట్లు ఉంటాయంటే మెక్సికోలో నకిలీ కరెన్సీ బెడద ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, జాంబియా, కొలంబియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ నకిలీ కరెన్సీ బెడద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడే వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ కట్టుదిట్టమైన చట్టాలను దాదాపు అన్ని దేశాలూ చట్టాలను రూపొందించుకున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడితే గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు పడే అవకాశాలు ఉంటాయి. చట్టాల్లో ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా నకిలీ కరెన్సీ బెడద మాత్రం తగ్గడమే లేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఐదు వందల నోట్లను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అత్యధిక రాజకీయ అవినీతి నోట్ల ద్వారానే జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం నోట్లు దాచి పెడుతున్నారు. అలాంటి వారికి షాకిచ్చేందుకు బీజేపీ ప్రభుత్వ రెడీగా చెబుతున్నారు. దేశంలో అత్యధిక అవినీతి రాజకీయ అవినీతే. తిరుగులేని అధికారం చెలాయించే రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు, నేతలు తర్వాత కూడా అధికారం చేపట్టే లక్ష్యంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించకుంటారు. ఈ అవినతి అంతా ఎక్కునగా నోట్లరూపంలో ఉండేలా చూసుకుంటారు. కొంత మంది రాజకీయ నేతలు వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటారు. అలాంటి వారు ఈజీగా దొరికిపోతారు. కానీ రాజకీయ అవినీతి చేసి రాజకీయంగా ఖర్చు పెట్టేవారు దొరకడం కష్టం. ఎందుకంటే నోట్లలోనే వారి లావాదేవీలు ఉంటాయి. ఖర్చు కూడా ఎన్నికల కేసమే చేస్తారు. ఇలాంటివి కట్టడి చేయడానికి బీజేపీ ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయవచ్చన్న ఉహాగానం వినిపిస్తుంది. మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది.. అనేక రాష్ట్రాల్లో ఉంది మరి బీజేపీకి ఇబ్బంది కాదా అనే వాదన వినిపించవచ్చు నిర్ణయం తీసుకునేది బీజేపీనే కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కారణం ఏదైనా నోట్ల రద్దు అనేది సామాన్యుడికి పీడకల. దాన్ని పదేపదే అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకూ ముప్పు వస్తుంది. కేంద్రం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ రాజకీయంగానే ఆలోచిస్తే మొదటికే మోసం వస్తుంది. దేశాన్ని ఇబ్బంది పెట్టినట్లవుతుంది.