శిధిలాల కింద శిశువులు నెత్తుటి గాయాలో రోదిస్తున్నారు. అయిన వాళ్లందరినీ కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మిగిలారు. భవిష్యత్ అన్నదే లేని విషాదంలో కూరుకుపోయారు. పాలబుగ్గల ప్రాయంలో అంతులేని క్షోభలో కూరుకుపోయి మానసికంగా చితికిపోతున్నారు. టర్కీ భూకంపంలోనే కాదు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ వచ్చినా బాల్యం గాయపడుతోంది. ఒక తరం మానసికంగా కృంగిపోతోంది. వారి జీవితాలు శిధిలమవుతున్నాయి. కాళ్లకింద నేల ఒక్కసారిగా కంపించింది. ఆకాశాన్ని తాకే భవంతులు ఒక్కపెట్టున కుప్పకూలాయి. గాఢనిద్రలో ఉన్న వారంతా నిద్రట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలు ఒకేసారి సమాధి అయిపోయాయి. ఒక్కో కుటుంబంలో ఒక్కో విషాదం. ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ.
కొందరు తల్లులయితే పై నుంచి కుప్పకూలుతోన్న ఇళ్ల పైభాగాలు తమ పొత్తిళ్లల్లోని బిడ్డలను ఎక్కడ పొట్టన పెట్టుకుంటాయోనన్న భయానికి పిల్లలకు రక్షణగా వారిపై తాము ఆని శిధిలాలు తమపై పడేలా ఉండిపోయారు. శిధిలాల కింద పడి అమ్మలు చనిపోయారు. చనిపోయే ముందు కూడా కన్నబిడ్డలను ప్రాణాలతో కాపాడుకుని మరీ చనిపోయారు. అమ్మల కింద శిధిలాల్లో శిధిలమై ఉండిపోయిన పసికందులు సహాయక చర్యల్లో బయట పడ్డారు. వారిని అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి అసుపత్రులకు తరలించిన సహాయక సిబ్బంది వారి ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు.
ఈచిన్నారులు బతికేశారు. సంతోషం. ఇంతపెద్ద విపత్తును కూడా వీళ్లు జయించారు ఆనందం. కానీ వీళ్ల భవిష్యత్తు ఏంటి. శిధిలాల కింద ఒంటరిగా భయం భయంగా గడిపిన క్షణాలు చిన్నారుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతాయంటున్నారు నిపుణులు.
ప్రాణాలతో అయితే మిగిలారు కానీ శారీరకంగా గాయపడ్డారు. మానసికంగా గాయపడ్డారు. తెలీని భయం గుండెల్లో అలానే ఉండిపోయింది. అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇలా పెను విపత్తుల్లో ఏటా ప్రపచం వ్యాప్తంగా 18 కోట్లమందికి పైగా చిన్నారులు అనాథలైపోతున్నారు. అమ్మానాన్నలు ఏమయ్యారో తెలీకుండానే ఒంటరి అయిపోతున్నారు. ఇక అప్పటి నుండి సహాయ శిబిరాల్లో పెరగాలి. మానసిక కృంగుబాటులను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. టర్కీ, సిరియాల్లో భూకంప విలయంలో చిక్కుకున్న ప్రాంతాలన్నీ ఇలాంటి విషాదాలతో నిండి ఉన్నాయి. లక్షలాది మంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శిధిలాలు తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఒక అంచనా ప్రకారం లక్షమందికి పైనే తలలు వాల్చేసి ఉండచ్చని అంటున్నారు.
యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల్లో అయిన వాళ్లని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన చిన్నారులు అందరు పిల్లల్లా ఆరోగ్యంగా పెరగలేరు. ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మృతుల్లో 18 శాతంమంది చిన్నారులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎవరూ లేని ఒంటరులుగా మిగిలిపోతారు. ఇటువంటి దుర్ఘటనల నుండి బయటపడ్డ పిల్లల్లో 50 శాతానికి పైగా పిల్లల్లో మానసిక రుగ్మతలు తీవ్రంగా ఉంటాయంటున్నారు వైద్యం రంగ నిపుణులు. ప్రపంచంలో తుపానులు, వరదలు, భూకంపాలు ఇతరత్రా పెను విపత్తుల కారణంగా 20 కోట్ల మందికి పైగా చిన్నారులు బాల కార్మికులుగా మారిపోతున్నారని యునెస్కో లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్న ప్రాంతంలో ఉంది టర్కీ దేశం. ఒక్క ఏడాదిలోనే 33వేలకు పైగా భూకంపాలు నమోదైన చరిత్ర ఉంది టర్కీకి. అయితే వీటిలో భూకంప తీవ్రత 4కు మించిన భూకంపాలు 322 మాత్రమే.
అయితే భారీ భూకంపం ఎప్పుడైనా రావచ్చు. అది పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉంది. ఈ విషయం టర్కీ ప్రభుత్వానికి తెలుసు. అంత భయంకర జోన్ లో ఉన్నప్పుడు టర్కీ ప్రభుత్వ ఏం చేయాలి భూకంపాలను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణానికి చట్టాలు చేయాలి. అయితే టర్కీ ప్రభుత్వం ఏ మాత్రం ముందు చూపు లేకుండా దారుణ నిర్లక్ష్యంతో వ్యవహారాలు నడుపుకొచ్చింది. టర్కీలో 2012 నుండి కూడా రియల్ ఎస్టేట్ బూమ్ తారాస్థాయికి చేరింది. బహుళ అంతస్థుల ఆకాశహర్మ్యాలు లెక్కకు మించి నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. దేశమే ఓ కాంక్రీట్ జంగిల్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో అయితే ఇళ్ల నిర్మాణాలన్నీకూడా భూకంపాలను తట్టుకునేలా కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చట్టాలు చేశారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడి హాయంలో ఆ చట్టాలను నిబంధనలను పక్కన పెట్టేశారు. ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు అనుమతులు ఇస్తూ పోయారు.
నిబంధనలే కాదు నాణ్యతనూ ఎవరూ పట్టించుకోలేదు. ఎంత సేపూ కాంట్రాక్టర్లు ముడుపులు ఇచ్చారా లేదా తమ ఖజానాలోకి ఆదాయం వచ్చి పడిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్లు టర్కీ పాలకులు వ్యవహరించారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవంతులను కూడా క్రమబద్ధీకరణ ముసుగులో అక్రమ ఆదాయానికి వనరుగా మార్చేసుకున్నారు. పాలకులు అధికారులు కలసి అడ్డగోలుగా సాగించిన వ్యవహారాలే ఇపుడు టర్కీ కొంపలు కూల్చాయి. మొన్న భూకంపం వచ్చిన రోజున వేలాది అపార్ట్ మెంట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కళ్లముందే భారీ భవంతులు కూలిపోతూ ఉంటే జనం భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. నిబంధనలకు పాతరేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు నాసిరకం నిర్మాణాలతో చేతులు దులిపేసుకున్నారు. భూకంపాన్ని ఆ నిర్మాణాలు ఏ మాత్రం తట్టుకోలేక కూలిపోయాయి.
నిజానికి టర్కీ కన్నా ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం జపాన్. జపాన్ లో రోజూ ఏదో ఒక తీవ్రతతో ఎన్నో కొన్ని భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఎంత భారీ భూకంపం వచ్చినా సరే అక్కడ ఆస్తి , ప్రాణ నష్టాలు రెండూ కూడా చాలా తక్కువగా ఉంటాయి. భూకంపాలతో పాటు సునామీలూ జపాన్ ను పలకరించిపోతూ ఉంటాయి. జల ప్రళయాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి. కాకపోతే జపాన్ ప్రభుత్వం ఏళ్ల క్రితం నుంచే పకడ్బందీగా అమలు చేస్తోన్న విధానాల వల్లనే జపాన్ లో ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉంటోందని నిపుణులు అంటున్నారు. జపాన్ లో 80 అంతస్థుల భవనం కూడా ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూలే ప్రసక్తి ఉండదు. ఆ విధంగా దాని పునాది నుండే ప్రత్యేక మైన నిర్మాణ సామగ్రితో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మిస్తారు జపాన్ లో. ఈ విషయంలో ప్రభుత్వం కూడా నిబంధనలను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తుంది.
ఎవరు గీత దాటినా నిర్మాణాలకు అనుమతులే ఉండవు. అంత కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే జపాన్ ఇళ్లు భూకంపాల్లోనూ విలాసంగా నిలబడి ఉంటాయి. అందులో ఉండేవాళ్లు కూడా భూకంపం వచ్చినా ఏ గాలివానో వచ్చినట్లు చూస్తూ ఉండిపోతారు తప్ పెద్దగా కంగారు పడరు. జపాన్ అనుసరిస్తోన్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మాణ సంస్కృతినీ భూకంప తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంది పుచ్చుకోవాలి. ఇళ్లను తేలికైన ఉత్పత్తులతో నిర్మిస్తారు. భవనాలకూ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. భూమి ఎంతగా కంపించినలో భవనం లోపల ఉన్నవారికి తెలీను కూడా తెలీదు. అంత ఆధునిక పద్ధతిలో నిర్మాణాలు చేస్తుంటారు జపాన్ లో. కానీ టర్కీలో మాత్రం పాలకుల్లో అవినీతి పుణ్యమా అని నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం దానిపై వచ్చే ఆదాయమే ముఖ్యమన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టే ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
టర్కీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత భూకంపం విషయంలో పాలకుల వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాన్ని గమనించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొన్ని కంపెనీల అధిపతులకూ వారికి అనుమతులు ఇచ్చిన అధికారులకూ నోటీసులు ఇచ్చి దర్యాప్తు జరుపుతున్నారు. అందులో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే శిక్షలు తప్పవని పాలకులు హెచ్చరిస్తున్నారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సినపుడు ఉండకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన పాలకుల విధానాలపై మండిపడుతున్నారు ప్రజలు. ఇపుడు టర్కీని చూసి భూకంప పీడిత దేశాలు పాఠాలు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. భవిష్యత్ లో ఎంతటి భూకంపం వచ్చినా ప్రాణ నష్టం తక్కువగా ఉండేలా విధానాలను రూపొందించుకోవాలని వారు సూచిస్తున్నారు.