తమిళ సినీ రంగంలో తిరుగులేని నాయకుడిగా ఒకప్పుడు వెలిగిన విజయ్ కాంత్ ఇక లేరు, దీర్ఘకాల అనారోగ్యం, కొవిడ్ సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు.దాదాపు 150 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కాంత్ … రాజకీయాల్లో కూడా పరిమితంగా రాణించారు. ఆయన అభిమానులు ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు..
మంచితనానికి ఆయన ఎంత పెట్టింది పేరో.. దూకుడుకు ఆయన అంతే నొటోరియస్ అని చెబుతారు. అందరినీ గౌరవించినట్లే ఉంటారు.. ఎవరినీ లెక్కచేయరు. ద్రోహులంటే ఆయనకు పరమ అసహ్యం.మిత్రులకు సాయం చేసేందుకు ఎంతటికైనా ఆయన వెనుకాడరు. ఆయనే నటుడు విజయకాంత్.. తమిళ సినీ రంగంలో కేప్టెన్ గా పిలిచే విజయ్ కాంత్ కు మూడో సారి కొవిడ్ వచ్చిన కొన్ని గంటల్లోనే 71 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. చెన్నై మియాట్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. రజనీకాంత్, కమల్ హాసన్ మంచి ఊపు మీదున్న రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్న నటుడిగా విజయ్ కాంత్ కు మంచి పేరుంది. ఆయనలో ఒక యాంగ్రీ యంగ్ మేన్ కనిపిస్తారు. ఐనా ఎప్పుడూ పదిమందికి సాయం చేయాలన్న కోరిక తప్పితే ఆయన ఎప్పుడు తప్పటడుగులు వేయలేదు.
విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు.తల్లిదండ్రులు కె.ఎన్. అళగర్స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ రీత్యా విజయకాంత్ కుటుంబం నాయుళ్లు. ఖచితంగా చెప్పాలంటే 15 నుంచి 16 తరాల క్రితం తమిళనాడు వెళ్లి స్థిరపడిన తెలుగు కుటుంబం వారిది. ఐనా తమిళనాడు సంస్కృతీసంప్రదాయాలు, తమిళ భాషను వంటబట్టించుకుని.. పచ్చి తమిళులుగా మారిన కుటుంబం వారిది..
ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’ 1979లో విడుదలైంది. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఒకే ఏడాది ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. దానితో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు.ప్రతిపక్ష నేతగా కూడా సేవలందించారు. విజయకాంత్ నిరాడంబరజీవి అన్న పేరు ఉంది. ఎంత సంపాదించినా ఏవీఎం స్టూడియోకు మోటార్ సైకిల్ పై వచ్చేవారని చెబుతారు. చాలా రోజుల తర్వాతే అభిమానుల తాకిడిని తట్టుకోలేక కారు కొనుక్కున్నారని చెబుతారు. బాగా చదువు వచ్చి చదువుకోవడానికి ఆర్థిక స్థితి లేని విద్యార్థులకు ఆయన ఫీజులు కట్టి, ఖర్చులకు డబ్బులు ఇచ్చేవారు. విజయకాంత్ ఒక ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్. కళైంజర్ కరుణానిధి చనిపోయినప్పుడు కేప్టెన్ వెక్క వెక్కి ఏడ్చారు. రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి ఓపెనింగే వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తర్వాతి కాలంలో ఘోరంగా ఓడిపోయారు.
రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీ ధైర్యం చేయలేకపోయారు. విజయకాంత్ ధైర్యంగా వచ్చారు. జనంలో ఉండేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో ఆయన జనాన్ని దూరం చేసుకున్నారు. మద్యానికి బాగా అలవాటు పడి జనాన్ని తిట్టేవారని పేరుంది. పైగా ఆయన తర్వాతి కాలంలో ఆయన వాగ్ధాటి దెబ్బతిన్నది. పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఐనా సరే విజయ్ కాంత్ ఒక స్పెషల్ పోలిటీషియన్, స్పెషల్ యాక్టర్. ఆయనో యాక్షన్ హీరో. తనకంటూ ఓ ఫాలోయింగ్, ఒక ఇమేజ్ ను సృష్టించుకున్న నటుడు. అందుకే విజయ్ కాంత్ గ్రేట్ అని చెప్పక తప్పదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…