అదానీ బాధితుల ఆత్మహత్యలు చూడాలేమో!

By KTV Telugu On 13 February, 2023
image

మార్కెట్‌ ఓపెన్‌ కావడం ఆలస్యం. అదానీషేర్లను పోటీలుపడి అమ్మేస్తున్నారు. ఈ స్థాయిలో పతనమైనా కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక వచ్చి ఇన్ని రోజులైనా మదుపరుల్లో అదానీ భరోసా నింపలేకపోయారు. సంపన్నుల జాబితాలో ఆయన అట్టుడుగుకు పడిపోయినా ఎవరికేం నష్టంలేదుగానీ ఆయన్ని నమ్మిన పాపానికి లక్షలమంది వేలకోట్లు పోగొట్టుకున్నారు. పార్లమెంట్‌లో విపక్షాలు ఎంత గోలపెట్టినా అదానీ గ్రూప్‌పై కేంద్రం నోరిప్పలేదు. మదుపరులను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాత్రం సూచన చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్‌ దాఖలుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని, మార్కెట్‌ని నియంత్రించే సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అదానీ గ్రూప్‌పై షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కుట్ర పన్నిందంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అదానీ స్టాక్స్‌ను హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్ చేయడం వల్లే మదపరులకు భారీ నష్టం వాటిల్లిందని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అసలే సున్నితమైన అంశం కావటంతో సుప్రీం ఈ పిటిషన్లపై ఆచితూచి వ్యాఖ్యానించింది. మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితం అవుతుందంటూ ప్రభుత్వానికి, సెబీకి ఆదేశాలిచ్చింది. సెక్యూరిటీ మార్కెట్లకు వర్తించే చట్టాలు, నియంత్రణ చట్టాల్లో తగిన సవరణల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. మధ్యతరగతి వర్గం కూడా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు పెట్టుబడిదారులను కాపాడటానికి పటిష్టమైన యంత్రాంగం అవసరమని అభిప్రాయపడింది.

తన కొంప కొల్లేరు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌పై లీగల్‌ ఫైట్‌కి సిద్ధమైంది అదానీ గ్రూప్‌. పాపులర్‌ వాచ్‌టెల్‌ని సంప్రదించి ఆ సంస్థలో అనుభవజ్ఞులైన లిప్టన్, రోజెన్, కట్జ్‌లను ఎంచుకుంది. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ఈ లీగల్‌ ఆర్గనైజేషన్‌కి కార్పొరేట్ వ్యవహారాలపై గట్టి పట్టుంది. హిండెన్‌బర్గ్ నివేదిక పూర్తిగా అబద్ధమని వాదిస్తోంది అదానీ గ్రూప్‌. తమ వ్యాపార సామ్రాజ్యానికి బలమైన పునాదులు ఉన్నాయని ఎలాంటి ఆందోళనా అవసరం లేదని మదుపరులకు భరోసా ఇస్తోంది. కానీ మదుపరుల్లో నమ్మకం కలిగేలోపు అదానీ గ్రూప్‌ విలువ పాతాళానికి పడిపోయేలా ఉంది.