హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ విలవిలలాడిపోతోంది. అదానీ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. మదుపర్ల సంపద మరింత తరిగిపోతోంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ లోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తమ సస్టైనబిలిటీ ఇండిసెస్ నుంచి తొలగిస్తున్నట్లు డోజోన్స్ ఎస్అండ్పీ తెలిపింది. ఇప్పటికే అదానీ ఎంటర్ప్రైజెస్ సహా అదానీ పోర్ట్, అంబుజా సిమెంట్ షేర్లను ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తెచ్చినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. అదానీ గ్రూప్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న వారంతా ఒక్కోక్కరుగా తప్పుకుంటున్నారు.
మరోవైపు హిండెన్ బర్గ్ ఆరోపణల సెగ పార్లమెంట్‌ను తాకింది. అదానీ గ్రూప్‌లో అవకతవకలపై దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ 25 ఏళ్ల కుమారుడికి అహ్మదాబాద్‌లోని అదానీలతో కొంత సంబంధం ఉందని కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని లేదా జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అటు లోక్ సభ స్పీకర్ ఇటు రాజ్యసభలో చైర్మన్ విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్ అదానీ సామ్రాజ్యం నుంచి తప్పుకున్నారు. ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో రాజీనామా చేశారు. భారతీయ కార్పొరేట్ల కోసం నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థ ఎలారా క్యాపిటల్. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఎలారా క్యాపిటల్ కూడా ఒకటి. లార్డ్ జాన్సన్ గత ఏడాది జూన్‌లో లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ పిఎల్సికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
కళ్లముందు సంపదంతా కరిగిపోతుండడంతో కుదేలవుతున్నారు గౌతం అదానీ. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు పలు చర్యలకు ఉపక్రమించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఈ మేరకు రుణదాతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రుణ చెల్లింపులను ముందుగానే చేసేసి తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షేర్లు భారీగా పతనమైనప్పుడు రుణదాతలు హెచ్చరికగా మార్జిన్ కాల్స్ జారీ చేస్తుంటారు. అంటే అదనంగా నగదుగానీ సెక్యూరిటీలనుగానీ డిపాజిట్ చేయమని కోరతారు. ఇప్పటి వరకు ఏ రుణసంస్థ కూడా అదానీ గ్రూప్ కంపెనీలకు మార్జిన్ కాల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అదానీ పవర్‌తో 2017లో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో సవరణలు కోరినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యుత్ ధర చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిపారు.