అక్కినేని వర్సెస్ కాంగ్రెస్ – ముదురుతున్న వివాదం

By KTV Telugu On 10 October, 2024
image

KTV TELUGU :-

అక్కినేని నాగార్జున కుటుంబమూ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం రోజురోజుకు ముదురు పాకాన పడుతోంది. ఇష్టానుసారం మాట్లాడిన మంత్రి సురేఖ..తర్వాత సమంతకు సారీ చెప్పారు తప్ప.. నాగార్జున కుటుంబం పట్ల చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేయలేదు. దానితో ఆమె వ్యాఖ్యల్లో ఏదో మర్మం ఉందన్న చర్చ నడుమ తన కుటుంబ ప్రతిష్టకు భంగం వాటిల్లిందన్న ఆలోచనతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. నాగార్జున పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించడంతో ఆయన తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఆయనతో పాటు నాగచైతన్య, అమల కూడా కోర్టుకు వెళ్లారు.నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి స్పెషల్ కోర్టు రికార్డు చేసింది. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా అక్కినేని కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని వాంగ్మూలంలో నాగార్జున చెప్పారు.జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని తన వాంగ్మూలంలో నాగార్జున చెప్పారు. అలా మాట్లాడం వలన తమ పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో నాగార్జున కోరారు.

దీనిపై సురేఖ కోర్టుకు హాజరై వాగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అంతలోనే సురేఖ తరపు న్యాయవాది ఒకరు.. నాగార్జునపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అంతు చూస్తామన్నట్లుగా న్యాయవాది మాట్లాడారు. నాగార్జుల లెక్క‌లు స‌రిచేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్-క‌న్వెన్ష‌న్ ను ఆక్ర‌మిత ప్రాంతంలో నిర్మించార‌ని.. అందుకే ప్ర‌భుత్వం కూల్చి వేసింద‌ని చెప్పారు. కానీ, దీనిని మ‌నసులో పెట్టుకుని స‌ర్కారును బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. నాగార్జున‌పై తాము పరువునష్టం దావా వేస్తామని అన్నారు. అంతేకాదు.. నాగార్జున‌ అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. వారి ఫోన్ సంభాష‌ణ‌లు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. అంతేకాదు.. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద తీస్తున్నామ‌న్నారు.

అక్కినేని నాగార్జునపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేఖ నోరు జారి మాట్లాడినదీ నిజమే అయినా.. ఆ విషయాన్ని ఆమె అంతటితో వదిలేశారని.. నాగార్జున కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా నానా యాగీ చేస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం చెందుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రభుత్వం శతమతమవుతుంటే.. నాగార్జున ఫ్యామిలీ కావాలనే సాగదీస్తోందని వారు అనుమానిస్తున్నారు. కేసు వేయడం సొంత నిర్ణయం కాదని.. నాగార్జున చర్యల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. అందుకే తాము కూడా కార్యాచరణ మొదలు పెట్టాల్సిందేనని పార్టీ వర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో కేసు సీక్వెన్స్ ను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి….ఆయన ఆదేశాల మేరకు నాగార్జునకు గట్టిగా సమాధానం చెబుతామని వారంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి