బ్రో పై అంబటి ఫైర్

By KTV Telugu On 4 August, 2023
image

KTV Telugu ;-

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జనసేనాని తన తాజా సినిమాలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై సెటైరికల్ సీన్ ఒకటి పెట్టారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తూర్పారబట్టిన అంబటి రాంబాబు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేనానికి బ్రో సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ ద్వారా ప్యాకేజీ ఇచ్చారని అంబటి ఆరోపించారు. అంతే కాదు త్వరలో తాను కూడా ఓ సినిమా తీయబోతున్నానన్న అంబటి రాంబాబు దానికి ఏ టైటిల్ పెట్టాలా? అన్నది పరిశీలిస్తున్నాం అంటూ పవన్ పై పంచ్ లు వేశారు.

పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రో లో వైసీపీ నేత అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యాంబాబు పేరిట ఓ సీన్ పెట్టారు. ఇటీవల సంక్రాంతి పండగ సమయంలో అంబటి రాంబాబు తన నియోజక వర్గంలో డ్యాన్ చేసిన దృశ్యాన్ని పోలిన సీన్ ను సినిమాలో పెట్టడమే కాకుండా అంబటిని కించపరిచేలా డైలాగులు పెట్టారు. ఇది ఏ మాత్రం సంస్కారం లేని పని అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తన రాజకీయ ప్రత్యర్ధులను తిట్టడినికి సినిమాని వాడుకోవడం ఏం పద్ధతి అని అంబటి నిలదీశారు. పనిలో పనిగా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా కలెక్షన్ల రూపంలో వెనక్కి వచ్చేలా కనపడ్డం లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ నుండి ప్యాకేజీలకు అలవాటు పడ్డ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు కొత్త మార్గంలో ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తున్నారని అంబటి ఆరోపించారు. బ్రో సినిమా నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ టిడిపికి చెందిన ఒక ఎన్నారై అంటున్నారు అంబటి రాంబాబు. అమెరికాలో టిడిపి నేతల నుండి వసూలు చేసిన డబ్బులను పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికే సినిమా తీశారని అంబటి ఆరోపించారు. నల్లడబ్బును తెల్లగా మార్చుకోడానికి ఈ నయా ప్యాకేజీ పద్ధతిని మొదలు పెట్టారంటున్నారు అంబటి రాంబాబు.సినిమాలో తనని తిట్టడం కోసమే ఒక సీన్ ను కల్పించి పెట్టారని అంబటి ఆరోపించారు.

రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహింరంగంగానే చెప్పారు. దాన్ని ప్రస్తావించిన అంబటి రాంబాబు బ్రో సినిమా షూటింగ్ 40 రోజుల పాటు జరిగిందని తనకు సమాచారం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అనుచరులు మాత్రం 23రోజులు షూటింగ్ జరిగిందంటున్నారన్న అంబటి ఆయన ఎన్నిరోజులు షూటింగ్ లో పాల్గొన్నారో? ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారో? దానిపై ఏ మేరకు ఆదాయపు పన్ను చెల్లించారో లెక్కలు చెప్పాలంటున్నారు అంబటి రాంబాబు. ఒక లెక్క ప్రకారం 46 కోట్లు..మరో లెక్క ప్రకారం 80 కోట్లు తీసుకున్నట్లు అర్ధం అవుతోందన్నారు అంబటి

80కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక్క పవన్ కళ్యాణ్ కే ఇస్తే బ్రో సినిమా నిర్మాత నిండా మునిగినట్లే అంటున్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కు చెల్లించిన సొమ్ము కూడా గిట్టుబాటు అయ్యేలా కనిపించడం లేదని ఆయన సెటైర్ వేశారు. తాను నిజాయితీ పరుణ్నని నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ కు నిజాయితీగా కచ్చితమైన ఆదాయపు పన్ను చెల్లించాలని అంబటి సూచిస్తున్నారు. త్వరలోనే తాను కూడా ఓ సినిమా నిర్మించబోతున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. పెళ్లిళ్లలపై పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి కథే తమ సినిమాకి ఇతివృత్తం అన్నారు.

ఓ మధ్యతరగతి కుటుంబంలో అన్న కష్టపడి ఓ రంగంలో పైకి వస్తే తమ్ముడు మాత్రం చదువు అబ్బక ఆవారాగా తిరుగుతూ ఉంటాడని .. తల్లి అతన్ని చూడలేక అన్న దగ్గర ఉండమని పంపిస్తుందని..అక్కడ కూడా హీరో పిచ్చివేషాలు వేస్తూ ఎందుకూ పనికిరాకుండా పోతోంటే తాను ఉన్న రంగంలోనే తమ్ముణ్ని తీసుకు వచ్చి సెటిల్ చేస్తాడంటూ అంబటి తాను తీయబోయే సినిమా స్టోరీ లైన్ చెప్పారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కథానాయకుడికి సినిమా చివర్లో నలుగురు పెళ్లాలూ..వారి పిల్లలూకలిసి గుణపాటం నేర్పడం ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నామన్నారు అంబటి రాంబాబు. ఇది పవన్ కళ్యాణ్‌ ను ఉద్దేశించి^తీస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా మీకు అలా అనిపించిందా? అయితే అలాగే అనుకోండి అని పంచ్ వేశారు. మొత్తానికి అంబటి వర్సెస్ పవన్ కళ్యాణ్ మాటల వార్ కొనసాగుతూనే ఉంది

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..