ఎంతసేపూ పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడమే చైనా పని. తన సొంత ఇంట్లో పరిస్థితులేవీ బాగా లేనపుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూసుకోకుండా ఇతర దేశాల్లో ఏమేమి జరుగుతోందో ఆరా తీస్తూ ఉంటుంది. డ్రాగన్ కంట్రీకి ఇది ఒక వ్యసనంగా మారిందంటున్నారు నిపుణులు. కొద్ది రోజుల క్రితం మూడు బస్సుల పరిమాణంలో ఉండే ఓ పెద్ద బెలూన్ తమ గగన తలంపై గాల్లో వెళ్తూ ఉండడాన్ని అమెరికా గమనించింది. ఈ బెలూన్ ఎక్కడిదా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ బెలూన్ కెనడా మీదుగా మోంటానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ బెలూన్ కూడా ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు గాల్లో తచ్చాడుతూ ఉండడాన్ని గుర్తించిన పెంటగాన్ ఇదేదో నిఘా కుట్రే కావచ్చుననుకుంది.
ఎందుకంటే అగ్రరాజ్యానికి సంబంధించిన మూడు కీలక అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ క్షేత్రాల్లో ఒకటి మౌంటానాలోనే ఉంది. అందుకే అమెరికా అంత కంగారు పడింది. అంత వేగంగా అప్రమత్తం అయ్యింది. అలెర్ట్ అయిన వెంటనే దాన్ని చాలా జాగ్రత్తగా తమ ప్రాదేశిక సాగర జలాల్లో కుప్పకూలేలా పేల్చివేసింది.
చైనా నిఘా బెలూన్ గురించిన సమాచారాన్ని పెంటగాన్ అధ్యక్షుడు జో బైడెన్ కు అందించగానే ఆయన మరో ఆలోచనే లేకుండా తక్షణమే దాన్ని పేల్చివేయండి అని ఆదేశాలు జారీ చేశారు. చైనా ఇలా అమెరికాపై నిఘా బెలూన్లను పంపడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో ట్రంప్ అద్యక్షుడిగా ఉన్న సమయంలోనూ చైనా బెలూన్లు అమెరికా గగన తలంపై షికార్లు చేశాయి. అయితే అప్పట్లో ట్రంప్ వాటిని పేల్చివేయమని చెప్పడానికి జంకారు. ఇపుడు బైడెన్ ప్రభుత్వంపై బోలెడు ఒత్తిడి ఉండడంతో రాకెట్ వేగంతో బైడెన్ నిర్ణయం తీసేసుకున్నారు. బెలూన్ పేల్చి వేసిన వెంటనే చైనా స్పందించలేదు. కాకపోతే అది తమ బెలూనే అని అమెరికాకి సాక్ష్యాధారాలు దొరికిపోయాయి కాబట్టి స్పందించక తప్పలేదు. అమెరికా తమ బెలూన్ ను పేల్చివేయడాన్ని తప్పుబట్టింది చైనా. తమని మాటమాత్రంగా సంప్రదించకుండా బెలూన్ పేల్చివేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఆరోపిస్తున్నట్లుగా అది నిఘా బెలూన్ కాదని చైనా చెప్పుకొచ్చింది.
వాతావరణ పరిశోధన కోసమే తాము ఆ బెలూన్ ను ప్రయోగించామని అటువంటి బెలూన్ ను పేల్చివేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించింది. తమ బుడగను పేల్చినందుకు ఇంతకు ఇంత అనుభవించక తప్పదంటూ శాపనార్ధాలు పెట్టింది చైనా. తమ బెలూన్ ను కూల్చివేసిన వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఇటువంటి వైఖరి ఒక్క చైనాకే చెల్లుతుందంటున్నారు మేథావులు. మొదటగా చైనా తాను చేసిన తప్పును ఒప్పుకుని ఉండాలి. దానికి సారీ చెప్పి ఉండాలి. ఒక వేళ అది పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ అయిఉంటే పరిసర దేశాలకు ఆ సమాచారాన్ని ముందస్తుగా ఇచ్చి ఉండాలి. ఇవేవీ చేయకుండా చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా అమెరికాయే తప్పు చేసినట్లు రాద్దాంతం చేయడం క్షమించరాని నేరమే అంటున్నారు నిపుణులు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇది దౌత్యపరంగా చైనా ప్రతిష్ఠను మసకబార్చేదే అంటున్నారు మేథావులు.
నిఘా కోసం ప్రయోగించే ఇటువంటి బెలూన్లు గగన తలంలో 80 వేల నుండి లక్షా 20వేల అడుగుల ఎత్తున నిఘా సామగ్రితో విహరిస్తాయి. సైనిక స్థావరాలు, రక్షణ రంగానికి చెందిన కీలక స్థావరాలు ఇతరత్రా రహస్య సమాచారాలను సేకరించడం వీటి లక్ష్యం. గాలి వేగం దిశల ఆధారంగా ఇవి ఎంత ఎత్తులో వెళ్లాలి ఎటు వైపు వెళ్లాలన్నది బెలూన్లను ప్రయోగించిన వారు మానిటర్ చేస్తూ ఉంటారు. సోలార్ పవర్ తో పనిచేసే రాడార్లు, హెచ్.డి కెమేరాలు బెలూన్ కు అమర్చి ఉంటాయి. ఈ కెమెరాలు అత్యంత నాణ్యమైన ఫోటోలను తీసి తమని ప్రయోగించిన వారికి అందిస్తాయి.
రక్షణ విభాగానికి చెందిన కీలక సమాచారాన్ని ఇవి సేకరిస్తాయి. చైనా బెలూన్ ను అమెరికా పేల్చివేయడాన్ని ప్రపంచంలో ఏ దేశమూ తప్పు బట్టడం లేదు. ఎందుకంటే అమెరికా స్థానంలో ఏ దేశం ఉన్నా చేయాల్సిందీ చేసేదీ కూడా ఆ బెలూన్ ను పేల్చివేయడమే. బెలూన్ పేల్చివేతతో చైనా అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే యుద్ధమంత సీన్ లేదు కానీ రెండు దేశాల మధ్య ఎప్పట్నుంచో కొనసాగుతోన్న ఆధిపత్య పోరు మాత్రం అలానే ఉంది. దీని ప్రభావం రెండు దేశాల సంబంధాలపై ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా అమెరికా అధ్యక్షుడు అలాంటిదేమీ ఉండదన్నారు. చైనా ఇప్పటికే కష్టాల్లో ఉందని దాన్నుంచి ఎలా బయటపడాలో ఆ దేశ అధ్యక్షుడు జింగ్ పింగ్ కు తెలుసునన్నారు బైడెన్. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న చైనా పొరుగుదేశాలతో గొడవలు పెంచుకుని మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు బైడెన్. బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎన్నో అర్ధాలు ఉన్నాయి. చైనా ఎంత బలహీనంగా ఉందో ఆయన ఒక్క వ్యాఖ్యతోనే చాటి చెప్పారు. ఏ దేశంతోనూ నమ్మకంగా ఉండకపోవడం నమ్మిన వారినే మోసం చేయడం తెరచాటు కుట్రలు కుయుక్తులతో పనులు చక్కబెట్టుకోవాలనుకోవడం చైనాకు అలవాటే అంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క స్నేహ హస్తం అందిస్తూనే మరో చేత్తో కత్తి పట్టుకుని పొడిచేయడానికి సిద్ధంగా ఉంటుంది చైనా. బాలీలో జరిగిన జీ 20 దేశాల సదస్సులో జింగ్ పింగ్-జో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఆ భేటీపై రెండు దేశాల్లోనూ చర్చ జరిగింది. ఇరువు నేతలు చేతులు కలిపితే అది రెండు దేశాలకూ మంచిదేనని అందరూ అనుకున్నారు.
రెండు దేశాలకే కాదు ప్రపంచానికి కూడా మంచిదని వారనుకున్నారు. అయితే అప్పుడు స్నేహానికి తహ తహ లాడిన చైనా ఇపుడు అదే అమెరికాపై నిఘా పెట్టిందంటే దాన్ని ఏమనుకోవాలి డ్రాగన్ ను ఎలా అర్ధం చేసుకోవాలి. తాజా ఘటనతో చైనా అమెరికాల మధ్య దూరం మరింతగా పెరిగినట్లే చెప్పాలి. బెలూన్ పేల్చివేసినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించింది. హెచ్చరిక అయితే చేసింది కానీ అమెరికాని ఏం చేయగలదు. అసలు చైనాయే కొంత కాలంగా సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంచుమించు రెండేళ్లుగా ఆర్ధిక సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఢమాల్ మంది. చైనా జీడీపీలో కీలక పాత్రపోషించే రియల్ ఎస్టేట్ పతనంతో చైనాకి కాళ్లూ చేతులు ఆడ్డం లేదు. ఆ తర్వాత కరోనా సంక్షోభం ప్రపంచాన్ని నమిలేసిన వేళ చైనా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. దాంతో ఆర్ధిక వ్యవస్థ తల్లకిందులైంది. అది చాలదన్నట్లు రెండేళ్ల పాటు భారీ వర్షాలు, వరదలతో చైనా అల్లకల్లోలమే అయ్యింది. ఆహార ధాన్యాల ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. ఒక్క అమెరికాతోనే కాదు చైనా ఏ దేశంతోనైనా ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాన్ని మిస్టీరియస్ చైనా అంటారు.
భారత దేశంతోనూ చైనా ఇలాంటి తొండాటే ఆడుతోంది. ఒక పక్క ఇరు దేశాల సైన్యాలు శాంతి చర్చలు జరుపుతూ ఉంటే మరో పక్క చైనా భారత సరిహద్దుల్లో చిచ్చురేపేలా చిల్లర వేషాలు వేస్తోంది. అందుకోసం ఎంతకైనా తెగించడం దానికి రివాజు. ఆక్రమంలో భాగంగానే తైవాన్ కూడా తనదే అంటోంది చైనా. ఒకటి మాత్రం నిజం. చైనా అంచనాలు తప్పుతున్నాయి. దాని లెక్కలూ తప్పుతున్నాయి. చైనా పాలకులు అనుకున్నది ఏదీ కూడా సవ్యంగా జరగడం లేదు.
ఏ దేశంతోనైనా కయ్యానికి కాలు దువ్వుదాం ఎవరిపైనైనా నిఘా పెట్టేద్దాం పొరుగుదేశాల భూములు కబ్జాలు చేసేద్దాం అడ్డొస్తే ఆర్మీని రంగంలోకి దింపి ఉద్రిక్తలు రాజేద్దాం అన్న డ్రాగన్ ధోరణే మంచిది కాదంటున్నారు నిపుణులు.
చైనా ఏమో అమెరికాను సవాల్ చేయాలనుకుంటోంది. అమెరికా ఏమో అతి పెద్ద మార్కెట్ గా అవతరించిన భారత్ ను కలుపుకుపోవాలని చూస్తోంది. భారత్ ఏమో సూపర్ పవర్ గా ఎదగడానికి నిజాయితీగా నిక్కచ్చిగా అడుగులు వేస్తోంది.
భారత్ అమెరికాల మధ్య స్నేహమే చైనాను ఎక్కువ భయపెడుతోంది. తానేమో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి ఉగ్రదేశాలను పక్కన పెట్టుకోవచ్చుకానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలున్న భారత్-అమెరికాలు చేతులు కలపడం అన్యాయం అన్నట్లు చైనా వ్యవహరిస్తోంది.
జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక దేశాల సైనిక ఆస్తుల సమాచారాన్ని చైనా సేకరించినట్లు ద వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది. కొన్నేళ్లుగా చైనా నిఘా బెలూన్ అనేక సంవత్సరాల పాటు హైనన్ ప్రావిన్స్‌లో ఆపరేషన్ నిర్వహిస్తోంది. అనేక దేశాల సైనిక సమాచారాన్ని ఆ బెలూన్లు సేకరించినట్లు అమెరికా తెలిపింది నిఘా వ్యవహారాల కోసం ఇలాంటి బెలూన్లను చైనా తయారు చేసిందని ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు ఓ సినియర్ రక్షణాధికారి తెలిపారు. ఇటీవల హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్‌లపై నాలుగు బెలూన్లు కనిపించినట్లు ఆ కథనంలో వెల్లడించారు. ట్రంప్ హయాంలో మూడు నాలుగు సందర్భాల్లో ఇలాంటివే జరిగినా ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్‌షిప్‌లుగా గుర్తించినట్లు ప్రకటించింది. ఇటీవల తమ గగనతలంలో తిరిగిన చైనా నిఘా బెలూన్‌ల శిథిలాల చిత్రాలను అమెరికా నేవీ విడుదల చేసింది.