పెను సంక్షోభంలో అమెరికా

By KTV Telugu On 19 May, 2023
image

రుణపరిమితి పెంపు దల విషయంలో ప్రతిపక్ష రిపబ్లికన్లు కలసి రాకపోవడంతో డెమోక్రాట్లు కంగారు పడుతున్నారు. దేశాన్ని ఎలా గట్టెక్కించాలో అర్ధం కాక అధ్యక్షుడు జో బైడెన్ తల పట్టుకుంటున్నాడు. కొత్త అప్పులు చేయడానికి ఆస్కారం లేకపోవడంతో వచ్చే నెలలో ఖజానా ఖాళీ కానుంది. రక రకాల చెల్లింపులు ఎలా చేయాలో తెలీని పరిస్థితి. ఇంతటి దారుణ పరిస్థితి అమెరికా చరిత్రలోనే ఎన్నడూ రాలేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా వెలిగిపోతోన్న అమెరికా చాలా కష్టాల్లో ఉందిపుడు. ఈ కష్టాల నుండి గట్టెక్కడం కోసం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏవీ కలిసి రావడం లేదు. ప్రస్తుతం అమెరికా కున్న సమస్య ఒక్కటే. వివిధ అవసరాల కోసం అమెరికా ప్రభుత్వం చేసే అప్పుల పరిమితి పై ఉన్న సీలింగ్ మార్క్ ను ఎప్పుడో చేరుకుంది అమెరికా. కొత్తగా అప్పులు చేయాలంటే రుణపరిమితిపై ఉన్న సీలింగ్ ను పెంచుకోవలసి ఉంటుంది.

గతంలో విధించుకున్న సీలింగ్ ప్రకారం అమెరికా ప్రభుత్వం 31.4 ట్రిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేయచ్చు. అయితే ఆ పరిమితిని అమెరికా ఈ జనవరిలోనే చేరుకుంది. ఇపుడిక కొత్తగా అప్పులు చేయాలంటే ఈ సీలింగ్ పరిమితిని పెంచాలి. దీన్ని 32.4 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని జో బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అమెరికన్ కాంగ్రెస్ లో పాలక పక్షమైన డెమోక్రాట్లకు పూర్తి మెజారిటీ లేదు. డెమోక్రాట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించాలంటే ప్రతిపక్ష రిపబ్లికన్లు దానికి మద్దతు ఇవ్వాలి. అయితే రిపబ్లికన్ పార్టీ సభ్యులు దానికి సహకరించడం లేదు. కావాలంటే మీరు ఖర్చులు తగ్గించుకోండి తప్ప అప్పులు పెంచుకుంటామంటే ఎలాగ అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు రిపబ్లికన్ పార్టీ నేత అయితే మీ పిల్లాడి చేతిలో క్రెడిట్ కార్డు పెట్టారు. అతను ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడేస్తే ఏం చేస్తారు వాడిని పిలిచి ఇంతకు మించి ఖర్చులు చేయకూడదని అర్ధమయ్యేలా చెప్పాలి. ఇపుడు కూడా మీరు అదే చేయండి అంటూ ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. రిపబ్లికన్లు మొత్తానికే ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోతే మాత్రం వచ్చే జూన్ 1 నాటికి అమెరికా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అప్పటికి ఖజానా ఖాళీ అయిపోతుంది.

ఏ పనిచేయాలన్నా దేనికి ఖర్చు పెట్టాలన్నా చిల్లిగవ్వ చేతిలో ఉండదపుడు. కొత్తగా అప్పులు చేయడానికి లేదు కాబట్టి పెను సంక్షోభంలో అగ్రరాజ్యం కూరుకుపోవడం ఖాయం అని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. అదే జరిగితే రక్షణ రంగంపై పెట్టే ఖర్చులకు డబ్బులు ఉండవు. జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. దేశ వ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా ఉద్యోగాలో కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావం ఒక్క అమెరికాపైనే కాదు ప్రపంచ దేశాలపైనా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అమెరికాకి జలుబు చేస్తే ఇండియా తుమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాపై అంతగా ఆధార పడి నడుస్తోంది మన ఆర్ధిక వ్యవస్థ. అత్యధిక దిగుమతులు అమెరికా నుంచే ఉంటాయి భారత్ కి. ఇక అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీ ఉద్యోగులు భారతీయులే. అంచేత అమెరికా ఆర్ధిక వ్యవస్థకు సుస్తీ చేస్తే అది భారత ఆర్ధిక రంగం ఆరోగ్యానికీ దెబ్బే అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. ఎంత చెట్టుకు అంత గాలి అని అగ్రరాజ్యం అయితేనేం అవసరాలు పెరిగినపుడు అప్పులు చేయక తప్పదు. అవి తాత్కాలిక సమస్యలే కూడా. పరిస్థితులు దారికి వచ్చినపుడు అన్నీ సద్దుకుంటాయి. కానీ ఈ సంధి కాలంలోనే సమస్య జటిలం కాకుండా చూసుకోవాలంటున్నారు ఆర్ధిక వేత్తలు. అసలు రుణ పరిమితిపై సీలింగ్ ఏంటి అన్నది తెలుసుకోవాలి.

అమెరికాలో ఇరవయ్యవ శతాబ్ధం ఆరంభంలోనే డెట్ సీలింగ్ విధానం అమల్లోకి వచ్చింది.1917 లో మొదటి సారి దీనికి శ్రీకారం చుట్టింది నాటి అమెరికన్ ప్రభుత్వం. దీని అర్ధం ఏంటంటే అమెరికా ప్రభుత్వం చేసే అప్పులు ఎంత వరకు ఉండాలన్న పరిమితి అన్నమాట. ఆ పరిమితి దాటి అప్పులు చేయకుండా ఆంక్షలు విధించడమే సీలింగ్. ఆ సీలింగ్ పరిమితి దాటితో కొత్తగా అప్పులు చేయడానికి వీలుండదు. సీలింగ్ స్థాయికి అప్పులు పేరుకు పోతే అమెరికన్ కాంగ్రెస్ లో పాలక ప్రతిపక్షాలు సమావేశమై సీలింగ్ ను పెంచుకోవాలి. అంటే రుణపరిమితి పెంచుకోడానికి మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ లో ఆమోదం తెలపాలి. అలా కాల క్రమంలో అవసరాలను బట్టి ఈ సీలింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. గతంలో పెంచుకున్న సీలింగ్ ప్రకారం 31.4 ట్రిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేసుకునే వీలు ఉండగా ఆ మార్క్ ను దాటేయడంతో ఇపుడు సీలింగ్ ను మళ్లీ సవరించాల్సిన అవసరం వచ్చింది. 2001 నుండి ప్రతీ ఏటా అమెరికాలో సగటున ఒక ట్రిలియన్ డాలర్ల మేరకు రుణపరిమితి పెరుగుతూ వస్తోంది. అంటే ఏటా లక్ష కోట్ల డాలర్లన్నమాట.

ఇలా పెంచుకోవడం నిజానికి ఆనవాయితీగా వస్తున్నదే ఇదేమీ కొత్త కాదు. ఆ మాటకొస్తే ఇలా రుణపరిమితి పెంచుకోవడంలో ఎక్కువ చొరవ చూపేది రిపబ్లికన్లే కావడం మరో విశేషం. 1960 నుండి 2021 వరకు అమెరికాలో ఏకంగా 78 సార్లు రుణపరిమితి పెంచితే అందులో 49 సార్లు రిపబ్లికన్ల పాలనలోనే కావడం గమనార్హం. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నప్పుడు రుణపరిమితి పెంచుకుంటామంటే డెమొక్రాట్లు మరో మాటే లేకుండా దానికి సహకరించారు. కానీ ఇపుడు డెమోక్రాట్లు అధికారంలో ఉండి రుణపరిమితి పెంచాలని యోచిస్తే రిపబ్లికన్లు మోకాలడ్డుతున్నారు. ఏ మాత్రం సహకరించడం లేదు. రిపబ్లికన్ల వ్యవహారంతో అధ్యక్షుడు జో బైడెన్ చికాగ్గా ఉన్నారు. కావాలనే రిపబ్లికన్లు రాజకీయం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఏదో ఒక విధంగా వారిని ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జూన్ ఒకటో తేదీ లోపుగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అది అమెరికాను పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఆ ప్రమాదం రాకూడదనే బైడెన్ ప్రయత్నిస్తున్నారు. రుణపరిమితి పెంచుకోడానికి బైడెన్ ప్రభుత్వానికి రిపబ్లికన్లు సహకరించడం లేదు. తాము మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు రుణపరిమితి పెంచుకున్న రిపబ్లికన్లు ఇపుడు ఎందుకని ఇలా మొండికేస్తున్నారంటే దాని వెనుక ఓ మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇపుడు బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు వారు.

రుణపరిమితి పెంచకపోతే అమెరికా సంక్షోభంలో కూరుకుపోతే అది డెమోక్రాట్ల ప్రతిష్ఠను దెబ్బతీస్తుందన్నది రిపబ్లికన్ల ఎత్తుగడగా కనిపిస్తోంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ అయితే రుణపరిమితి పెంచడానికి వీల్లేదని అంటున్నారు. డెమోక్రాట్ల ఆలోచనలకు రిపబ్లికన్ల ఆలోచనలకు పొంతన ఉండదు. రిపబ్లికన్లు ఎంత సేపూ సంపన్న వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటారు. ధనిక వర్గాలపై పన్నులు పెంచడాన్ని రిపబ్లికన్లు ఒప్పుకోరు. అదే సమయంలో ప్రభుత్వ ఖజానా నుండి పేదల సంక్షేమానికి ఖర్చు చేసినా వారు భరించలేరు. డబ్బున్న వాళ్ల ప్రయోజనాలు కాపాడేవిధంగానే వారి ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి. ఇపుడు కూడా బైడెన్ పై ఒత్తిడి తెచ్చి సంపన్న వర్గాల రాయితీలు సాధించుకోడానికే రుణపరిమితి పెంపుదలకు వారు సహకరించకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్లే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత దేశానికి అన్ని కష్టాలు ఉంటాయి. సమస్యలు లేని దేశమంటూ ఉండదు. అప్పులు చేయని రాజ్యాలూ ఉండవు. దీనికి సూపర్ పవర్ కంట్రీస్ మినహాయింపు కాదని అమెరికా చాటి చెప్పింది. ఎంతైనా ప్రపంచానికి పెద్దన్న కదా అప్పుల్లోనూ పెద్దన్నే మరి.