మోదీ మిత్రుల్లో చంద్రబాబే బెస్ట్

By KTV Telugu On 26 May, 2024
image

KTV TELUGU :-

బీజేపీ కోరుకున్నట్లుగా ఎన్డీయేకు 400 స్థానాలు రావడం సాధ్యమేనా..  అందుకు బీజేపీతో పాటు పొత్తు పక్షాల బలం  సరిపోతుందా.. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వాముల పరిస్థితి ఎలా ఉంది.. లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు వస్తున్న సమాధానం మాత్రం టీమ్ మోదీకి రుచించేదిగా అనిపించడం లేదు. సర్వే జనం చేస్తున్న విశ్లేషణలు ఎన్డీయే బలహీనతలను బయటపెడుతున్నాయి. అయితే అందులో ఒక ఆశాకిరణం ఉంది. దక్షిణాదిన ఎన్డీయేకు పట్టు పెరుగుతోందన్నది పలు సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం….

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ..మిత్రపక్షాలతో కలిసి రెండు సార్లు విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పదేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న మోదీపై కాస్త వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో లుకలుకలు, ఇండియా కూటమికి నాయకత్వలేమి వంటి విషయాల నేపథ్యంలో ఈసారి కూడా మోదీ  విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన విజయానికి ఢోకా ఉండకూడదన్న ఉద్దేశంతో ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయన్న ప్రచారాన్ని మోదీ, దేశ ప్రజల్లోకి సమర్థంగానే తీసుకెళ్లగలిగారు. తొలుత జనంలో మంచి స్పందనే కనిపించినా..ఇప్పుడు  పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మోదీ కోరుకున్నట్లుగా 400 సీట్లు రావడం సులభం కాదన్న ఫీలింగు  రోజురోజుకు పెరిగిపోతోంది. మోదీకి, బీజేపీ మిత్రపక్షాలకు అంతగా జనాదరణ లేదన్న అభిప్రాయం క్రమంగా వ్యక్తమవవుతోంది..

మోదీ అంచనాలు ఎక్కడ దెబ్బతిన్నాయి. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ 400 సీట్లకు చేరువగా  రాలేకపోతోంది. మోదీ  మీద ఆధారపడటమే మినహా… మిత్రపక్షాలకు సొంత బలం పెరగడం లేదు. దానితో వారికి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు. ఏపీలో మాత్రం చంద్రబాబు బలం బాగా పెరిగింది. ఎన్డీయేను ఆదుకునేది టీడీపీనే అని తేలిపోయింది…

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా అత్యధిక స్థానాలు గెలిస్తేనే మిషన్ 400 సాధ్యమవుతుంది. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇప్పటి వరకు ఐదు దశల పోలింగ్ పూర్తయి ఆరో దశ జరుగుతున్న నేపథ్యంలో బిహార్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్డీఏ భాగస్వాములైన పార్టీలు ఆశించిన స్థాయిలో రాణించలేదని, అది మోదీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని  విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వామి తెలుగుదేశం మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని, ఎన్డీయేకు చంద్రబాబు నాయుడు బలమైన భాగస్వామి అవుతారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడైన సర్వేలు నిర్వహించే రుచిర్ శర్మ ప్రకటించారు. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్  లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని భావిస్తున్న నేపథ్యంలోనే రుచిర్  శర్మ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది….

ఒక సర్వే ప్రకారం బీజేపీకి సొంతంగా 305 స్థానాల వరకు రావచ్చు. అంటే అటు ఇటుగా గతసారి ఫలితాలే వస్తాయి. మిగతా మిత్రపక్షాలకు దాదాపు వంద స్థానాలు వస్తేనే మోదీ ఆశించిన 400 సాధ్యమవుతాయి. యూపీ, బిహార్, మహారాష్ట్రలో ఇండియా కూటమి బలపడటంతో అది సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఏదేమైనా ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చంద్రబాబు కీలక నాయకుడిగా అవతరించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి