అంబానీ ఇంట్లో పెళ్లి జరిగిందని దేశం మొత్తం అనుకుంటున్నారు. కానీ జరిగింది పెళ్లి కాదు.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అని తెలియని వాళ్లకు వివరంగా చెబితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పెళ్లి కూడా ఎంత కుబేరుడైనా ఆ స్థాయిలో చేయడు. కానీ అంబానీ వేరు. తన కుమారుడి పెళ్లిని చరిత్రలో చెప్పుకునేలా చేసుకోవాలనుకున్నారు. చేశారు. మీడియా కూడా అంతే కవరేజీ ఇచ్చింది. మన దేశంలో అసలు సమస్యల కన్నా.. విలాసాల కులాసాలకే ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారా ? కుబేరుడు ఇంట్లో పెళ్లి అయితే దేశమంతా పండగ చేసుకోవాల్సిందేనా ?
సినిమాలకు ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు చేసేవాళ్లు. తర్వాత వాటి స్థానంలో ప్రి రిలీజ్ వేడుకలు వచ్చాయి. పెళ్లిళ్లకు మొహందీ ఫంక్షన్లు గతంలో లేవు.. కానీ ఈ మధ్య కామన్ అయిపోయాయి. ఇప్పుడు వాటి స్థానంలో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు విపరీతంగా పెరిగిపోయాయి. పాతకాలంలో పెళ్లిళ్లు వారం పాటు జరిగేవని అంటారు. ఇప్పుడు పెండ్లికి ముందు జరిగేవి వారం పాటు జరుగుతున్నాయి. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు అలాగే జరిగాయి. అదీ కూడా ఊహించనంత ఖర్చుతో.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల పుత్రుడు అనంత్ అంబానీకి, ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు రాధికా మార్చంట్కు పెండ్లి నిశ్చయమైంది. వారి ప్రీ వెడ్డింగ్ వేడుక వారి స్వరాష్ట్రంలోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మీడియా అంతా ఆ వేడుక అంశాలకు వేదికగా మారిపోయింది. సినిమా సెలెబ్రెటీలు, ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్తలు, రాజకీయులు, బిగ్‌బుల్స్, బిగ్‌బాస్‌లు అందరూ క్యూలు కట్టారు ప్రజలు కూడా ఈ వేడుకలు చూసేందుకు ఆసక్తి చూపించారు. అందుకే మీడియాల్లోనూ అవే కనిపించాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం జామ్‌నగర్‌లోని చిన్న విమానాశ్రయం, పది రోజుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిపోయింది. ప్రభుత్వమే ఎయిర్‌పోర్టును విస్తరించింది. సిబ్బందినీ రెట్టింపుచేసింది. కస్టమ్, ఇమ్మిగ్రేషన్ సదుపాయాలనూ చకచకా కల్పించేసింది. జామ్ నగర్లో అనంత్ అంబానీ వన్యప్రాణుల సంరక్షణ, కారుణ్యతలను చాటుకునే ఒక ప్రయివేటు జూను ఏనుగుల కోసం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానిని ‘రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్టు’ నిర్వహిస్తుంది. ఇప్పటికీ 200 ఏనుగులు ఇందులో ఉన్నాయట. ఏనుగుల కొనుగోలుకు, అమ్మకాలకూ ప్రయివేటు వారికి అనుమతినిస్తూ వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మన ప్రభుత్వం సవరించింది కూడా.
మొత్తంగా ప్రి వెడ్డింగ్ వేడుకలకు ఖర్చు వెయ్యి కోట్ల వరకూ అయి ఉంటాయని అంచనా. వెయ్యి కోట్లు అని.. మనం తేలికగా తీసుకోవచ్చు కానీ.. మన దేశంలో రెండు లక్షల రూపాయల అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు ఉంటాయి. అంత మాత్రాన అంబానీల సొమ్ము పంచేయాలని కాదు కానీ.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది తమ ఇళ్లల్లో తమ తాహతుకు మించి ఖర్చు చేసి.. అప్పుల పాలవుతూంటారు. అందుకే పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. అందుకే గతంలో కొన్ని ప్రభుత్వాలు పెళ్లి ఖర్చులపై ఆంక్షలు విధించాలనుకున్నాయి. కరోనా టైంలో అనేక ఆంక్షలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి తాహతు ప్రకారం.. వారు చేసుకుంటున్నారు. కానీ తాహతు ప్రకారం చేసుకుంటే సమస్య రాదు.. అంతకు మించి చేసుకుంటనే సమస్య వస్తుంది. అంబానీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. చేసుకుంటారు..అనేది వితండ వాదం. ఎందుకంటే వారి ఆ కార్యక్రమాన్ని ప్రైవేటు ఎఫైర్ గా నిర్వహించలేదు. పబ్లిక్ లో పెట్టారు. తమ వైభోగాన్ని చూపించారు. తమ ఇంట్లో పెళ్లిళ్లు కూడా వైభవంగా జరగాలనే కోరికను పుట్టించారు.
అందులో ఆయన తప్పేమీ లేకపోవచ్చు కానీ.. మరి దేశ ప్రజలకు.. మీడియాకు అంబానీ ఇంట్లో పెళ్లి అయితే.. పండగ చేసుకోవాల్సిందేనా ? . ప్రజల సమస్యల గురించి చెప్పుకునేది లేదా… ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగం గురించి ప్రస్తావనకు రాదా ?. ప్రి వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న రిహన్నా అనే పాప్ సింగ్ డ్రెస్ కాస్త చినిగిందని చేసిన ప్రచారం కన్నా… ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ఇసుమంత కూడా ప్రచారం రాలేదు. దేశ ప్రజలు కోరుకుంటున్నదే తాము చూపిస్తున్నామని మీడియా అంటుంది.. అంటే.. ప్రజలే తమ తమ ప్రాధాన్యతల్ని.. మర్చిపోయి… గొప్పోళ్ల ఇంట్లో సంబరాల్ని చూసి.. సంబర పడే పరిస్థితికి వచ్చేశారా ?