దక్షిణాది డెయిరీకి అమూల్ గండం – అంతా ప్లానేనా

By KTV Telugu On 27 May, 2023
image

దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో అమూల్ సంచలనంగా మారుతోంది. పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రజాభిమానం చూరగొనే విషయంలో ఇది జరగడం లేదు. పాల వ్యాపారాలను కమ్మేసి ఆయా రాష్ట్రాల్లో గుత్తాధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూండటమే. ఏపీ లాంటి రాష్ట్రాలు లొంగిపోయి మొత్తం అమూల్ కు ధారదత్తం చేసేందుకు ప్రజాధనాన్ని కూడా వెచ్చించేందుకు సిద్ధపడ్డాయి. కానీ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలు తిరగబడ్డాయి. దీంతో అమూల్ వ్యవహారం సంచలనంగా మారుతోంది.

తమిళనాడులో అమూల్‌ పాలసేకరణ కార్యకలాపాలు గుత్తాధిపత్యం దిశగా సాగుతున్నాయి. ఇవి తమిళనాడు సహకార డెయిరీ అవిన్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. అమూల్‌ పాల సేకరణ శ్వేత విప్లవ స్ఫూర్తికి విరుద్ధమని దేశంలో ప్రస్తుత పాల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న స్టాలిన్‌ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. అవిన్‌ గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు నాలుగు లక్షల మందికి పైగా సభ్యుల నుండి రోజుకు 35 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. పాల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన ధరలు చెల్లిస్తోంది. అయితే అముల్‌ సంస్థకు చెందిన కైరా జిల్లా స‌హ‌కార పాల ఉత్పత్తుల సంఘం కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కృష్ణగిరి, ధ‌ర్మపురి, వెల్లోర్‌, రాణిపేట‌, తిరుప‌త్తూర్‌, కంచీపురం, తిరువ‌ల్లూరు జిల్లాల్లో పాల సేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాల ఉత్పత్తిదారులు స్వయం సహాయక గ్రూపుల నుంచి పాల‌ను సేకరించాలని నిర్ణయించుకుంది. ఒక‌ స‌హ‌కారం సంఘంపై మ‌రో స‌హ‌కార సంఘం ఆధార‌ప‌డ‌కూడదు. కానీ అమూల్ అదే చేస్తోంది. అలా పాల సేకరణ చేయడం ఆప‌రేష‌న్ వైట్ ఫ్లడ్ స్ఫూర్తికి విఘాతం క‌లిగించిన‌ట్లు అవుతుంది. అవిన్ డెయిరీ సంస్థకు పాల‌ను స‌ర‌ఫ‌రా చేసేవారిపై అముల్ ఆధార‌ప‌డ‌డం స‌హ‌కార స్ఫూర్తిని దెబ్బతీస్తుంద‌ని ఇదే విషాన్ని గుర్తు చేస్తూ స్టాలిన్ నేరుగా కేంద్రానికిలేఖ రాశారు. త‌క్షణ‌మే అముల్ సంస్థ పాల సేక‌ర‌ణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని సీఎం స్టాలిన్ త‌న లేఖ‌లో అమిత్ షాను కోరారు.

కేంద్రంలో సష్టించిన సహకార మంత్రిత్వశాఖకు ఇన్‌ఛార్జిగా ఉన్న హోం మంత్రి అమిత్‌షా కర్ణాటక రాష్ట్ర సహకార డెయిరీ నందినిని అమూల్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటకలో రైతులే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమూల్‌లో నందినిని విలీనం చేయడం, లేదంటే కర్ణాటకలో నందినికి సమాంతరంగా అమూల్‌ నెట్‌వర్క్‌ను చొప్పించడం ద్వారా స్థానికంగా నందినిని ధ్వంసం చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కర్ణాటక ప్రజలు గట్టిగా నమ్మారు. ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఒక సహకార సంస్థను మరొక సహకార సంస్థ కబళించడం సహకార స్ఫూర్తికి విరుద్ధం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అమూల్‌కు పూర్తి దాసోహం అయిపోయింది. ఏపీ సహకార సంఘాలను నిర్వీర్యం చేసి ఆస్తులన్నీ అమూల్‌కు కట్టబెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. నిధులు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎలాంటి నిధులు వెచ్చించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో సంగం డెయిరీ లాంటి వాటిపైనా ప్రభుత్వం గురి పెట్టింది. చివరికి హైకోర్టు ఆస్తులు ఇవ్వడం ఆపేసినా ప్రభుత్వ సహకారం ఉండటంతో పాలసేకరణ జరుగుతోంది.

భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ ప్రకారం సహకార సంస్థలు రాష్ట్రాల జాబితాలోవి. 2021 వరకు సహకార విభాగం వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఒక చిన్న విభాగం. అకస్మాత్తుగా సహకార విభాగాన్ని స్వతంత్ర మంత్రిత్వశాఖ స్థాయికి పెంచి అమిత్‌షాకు ఆ బాధ్యతనిచ్చింది. కేంద్రం నియంత్రణ కిందికి సహకార వ్యవస్థను తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) బిల్లు తెచ్చింది. ఎంఎస్‌సిఎస్‌ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. పాల సహకార రంగాన్ని కార్పొరేటీకరించడం ద్వారా ప్రపంచ పాల మార్కెట్‌లో చేరేందుకు మూడు ఎగుమతి ఆధారిత మల్టీ స్టేట్‌ మిల్క్‌ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నామని ఎగుమతులను ప్రోత్సహించేందుకు పని చేస్తాయని ప్రధాని ప్రకటించారు. తర్వాత అమిత్ షా దేశ వ్యాప్తంగా రెండు లక్షల పంచాయతీలలో స్వతంత్ర పాల సొసైటీలను ఏర్పాటు చేస్తామని ఇవి అమూల్‌ నేతత్వంలోని ఎగుమతి ఆధారిత సొసైటీతో ముడిపడి ఉంటాయన్నారు. దీంతో కేంద్రం అసలు కుట్ర బయటపడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూండటంతో మొత్తంగా అమూల్ వ్యవహారం గుజరాత్‌తో ముడిపడి విమర్శలకు కారణం అవుతోంది.