ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… ఏపీ, తెలంగాణగా విడిపోయి వచ్చే నెల రెండో తేదీకి పదేళ్లు అవుతుంది. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. వాటి సంగతి పక్కన పెడితే రెండు రాష్ట్రాలు, ఎవరికి వారు పరిపాలించుకోవడానికి.. ఇరుగు, పొరుగు సఖ్యతగా ఉండేలా ఏర్పాట్లు చేయడం కూడా చేయలేకపోయారు. పదేళ్లు అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉండిపోయాయి. రాజకీయంగా సఖ్యత ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఐదేళ్ల పాటు ఒకే సమయంలో ఉన్నా పరిష్కారం కాలేదు. అసలు చొరవ కూడా చూపలేదు. కేంద్రం కూడా పట్టించుకోవడం మానేసింది.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి జూన్ 2వతేదీకి పదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. హైదరాబాద్‌తో సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తుది పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలలేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. కానీ పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉంటుంది. పదేళ్ల తర్వాత పూర్తిగా తెలంగాణ రాజధాని. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంకా పూర్తి కాలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ,ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9,10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు. ఆ అంశం ఇప్పుడు కోర్టుకు చేరింది.
2014వ సంవత్సరం జూన్ 2వతేదీ నుంచి 10 సంవత్సరాల కాలానికి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రాష్ట్ర విభజన సమస్యలపై మే 15వతేదీన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరం చెప్పడానికి కూడా ఏమీ లేదు.
ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రం రెండు రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం సద్దుమణిగింది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి. అయితే మిగతా సమస్యలన్నీ ఇలా పరిష్కరించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎలా పరిష్కరించుకున్నా రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు.. ఆస్తుల్ని వేరే వారికి ధారబోస్తున్నారన్న ప్రచారం చేస్తాయి. సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం చేస్తాయి. అందుకే ప్రభుత్వాలు చొరవ చూపడ ంలేదు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అవుతున్నందున తెలుగు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా చర్చించుకొని విభజన వివాదాలను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ రాజకీయ కారణాల వల్ల.. సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. అసలు చర్చలే జరగడం లేదు. కేంద్రం పట్టించుకోవడం లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా వేరయ్యాయి. అక్కడి పార్టీలు ఇక్కడ.. ఇక్కడ పార్టీలు అక్కడ లేవు. అందుకే సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయం. లేకపోతే అవి అంతకంతకూ పెరిగి ప్రజలకు సమస్యలు తెచ్చి పెడతాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…