జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు దుమ్ము రేపాయి. అత్యధిక అవార్డులు సాధించాయి. కానీ జాతీయ అవార్డులకు ఉన్న ఇమేజ్ వేరు. బాక్సాఫీస్ హిట్ సినిమాలకు అవార్డులొస్తాయని గతంలో ఎవరూ అనుకునేవారు కాదు. సెన్సిబుల్ సినిమాలకు అవార్డులు ఇచ్చేవారు. అందుకే అప్పట్లో అవార్డు సినిమాలు వేరు.. కమర్షియల్ సినిమాలు వేరు అన్నట్లుగా ఉండేది. కానీ రాను రాను అవార్డుల ప్రమాణాలు పడిపోయాయో… లేకపోతే.. సినిమాల నాణ్యత పెరిగిందో కానీ.. కమర్షియల్ సినిమాలకే అవార్డులొస్తున్నాయి. అదీ కూడా గుంపగుత్తగా. తాజాగా ప్రకటించిన అవార్డులన్నీ కమర్షియల్ సినిమాలకే వచ్చాయి. కానీ తరచి చూస్తే… అవార్డులు ఇవ్వడానికి ప్రామాణికం ఏమిటి అన్న మౌలిక ప్రశ్న వస్తుంది. కానీ దానికి జ్యూరీ సభ్యుల దగ్గర కూడా సమాధానం ఉండకపోవచ్చు.
సినిమా మాధ్యమం సమాజంలో విలువులు పెంచేలా ఉండాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. అసమానతలు తగ్గించేలా.. ప్రజల్ని చైతన్యవంతం చేసేలా సినిమా ఉండాలని అనుకుంటాయి. అందుకే అలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తూ ఉంటారు. అయితే ఇది గతం. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించిన హీరో క్యారెక్టర్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. నిజానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన బాగోలేదని చెప్పలేం. ఓ కమర్షియల్ సినిమాకు ఎంత కావాలో అంత చేశారు. కానీ ఇది జాతీయ ఉత్తమ నటుడి స్థాయిదా అంటే.. పెద్దలు ఆలోచించాల్సిందే.
జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ఎంపిక ఎప్పుడూ చిత్రవిచిత్రంగానే ఉంటుంది. తాజాగా ప్రకటించిన అవార్డ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. తెలుగులో ఉత్తమ చిత్రం ఉప్పెన ను ఎంపిక చేశారు. ఈ చిత్రం సాదాసీదా కమర్షియల్ సినిమాలు. ఇందులో మ్యాటర్ ఏమీ ఉండదు. ప్రభుత్వాలు కోరుకునే సందేశం కూడా ఇందులో ఏమీ ఉండదు. అద్భుతమైన స్టోరీ కూడా కాదు . ఇదే పోటీలో పుష్ప ఉంది.. ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమా కొండపొలం కూడా ఉంది. అవన్నీ కాదని .. ఉప్పెన చిత్రానికి ఉత్తమ అవార్డు ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. బెస్ట్ పాపులర్ సినిమా, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్, నేపథ్య సంగీతం, స్టంట్స్, కొరియోగ్రఫి, సింగర్ ఉన్నా.. ఈ రాజమౌళి సినిమా ఉత్తమ జాతీయచిత్రంగా నిలవలేకపోవడం విచిత్రమే. రాకెట్రీ ది నంబీ ఎపెక్ట్ సినిమాకు అవార్డ్ వచ్చింది. ఓ రకంగా రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ సినిమాపై చాలా విమర్శలున్నాయి. కానీ అది కమర్షియల్ సినిమా కాదు. ఓ బయోగ్రఫీ .
జాతీయ ఉత్తమనటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. అల్లు అర్జున్ యాక్టింగ్ స్కిల్స్ పై ఎవరికీ డౌట్ లేదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కనబరిచిన అత్యుత్తమ నటన ఏంటి అంటే ఆలోచించాల్సిందే. హీరోలకు ఏదో ఒక వైకల్యం ఉండటం .. నటనకు కొలమానమా? అది కాకుండా.. అర్జున్ తన స్థాయికి తగ్గట్టే నటించాడు. చిత్తూరు యాస.. రఫ్ లుక్ బాగా ప్రదర్శించాడు. ఆ పాత్ర ఒక ఎర్రచందనం స్మగ్లర్ ది. సెంటిమెంట్ ఉంది.. హీరోయిన్ తో రొమాన్స్ ఉంది. ప్రతీసారీ తోటి స్మగ్లర్లను, పోలీసులను బురిడీ కొట్టిస్తాడు. కానీ.. ఇవేవీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు కొలమానంగా ఉండేవైతే కావు. ఎందుకంటే గతంలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు పొందిన వారి జాబితా వారు చేసిన యాక్టింగ్ చూస్తే.. ఇందులో ఏమీ ఉండదు. కానీ అవార్డు ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లుగా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పోషించిన క్యారెక్టర్ కు అవార్డు ఇవ్వాలనే ఆలోచన అసలు రాకూడదు. ఎదుకంటే అది సంఘ వ్యతిరేక.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే పాత్ర. అది కమర్షియల్ గా సక్సెస్ కావొచ్చు కానీ.. ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రోత్సహించకూడదు.
ప్రపంచంలో సినిమా వాళ్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఆస్కార్ అవార్డులు. అక్కడ కూడా సెన్సిబుల్ సినిమాకే ప్రాధాన్యం ఇస్తారు. కమర్షియల్ సినిమాల్లోనూ వాల్యూస్ చూస్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డుల్లో అలాంటి విలువలు కనిపిస్తున్నాయా అన్నది చాలా మందికి వచ్చే సందేహం.
జాతీయ సినిమా అవార్డులనేవి ఒకప్పుడు ఎలాంటి సినిమాలకు వచ్చేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజం స్థితిగతుల్ని మార్చి.. కాలానుగుణంగా ప్రజల ఆలోచనల్ని అభ్యుదయం వైపు నడిపించగలిగే సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. జ్యూరీసభ్యులు కూడా మేధావులే ఉండేవారు. అయితే ఆస్కార్ అవార్డులు కూడా గతంలో సెన్సిబుల్ సినిమాలకే వచ్చేవి . ఇటీవలి కాలంలో ఆస్కార్ జ్యూరీ కూడా బాట మార్చింది. కమర్షియల్ సినిమాలకే ప్రాదాన్యం ఇస్తోంది. మారుతున్న అభిరుచి కావొచ్చు. వారి మార్కెటింగ్ స్ట్రాటజీ కావొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఆస్కార్ అవార్డులు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే ప్రభుత్వాలకు ఉన్నంతగా సామాజిక బాధ్యత ఉండదు. కానీ జాతీయ అవార్డులు పూర్తిగా ప్రభుత్వ వ్యవహారం. సమాజానికి మంచి సందేశం పంపడం కీలకం. ఎర్రచందనం స్మగ్లర్లను హీరోగాలు చూపించే సినిమాలకు అవార్డులు ఇవ్వడం.. వారినే బెస్ట్ యాక్టర్లుగా ఎంపిక చేయడం అంటే… అంత కంటే భావదారిద్ర్యం ఉండదు. అల్లు అర్జున్ అద్భుతమైన నటుడే కానీ… అవార్డు ఇచ్చేందుకు.. ఆయన పోషించిన పాత్ర క్యారెక్టర్ కూడా దోహదం చేయాల్సి ఉంటుంది. అవార్డులిచ్చే ప్రాతిపదిక మారిపోయినప్పుడు ఇలాంటి విషయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం తప్ప ఏవరూ ఏమీ చేయలేరు.
ఇంకా చెప్పాలంటే తమిళనాడులో ఈ ఏడాది సెన్సిబుల్ సినిమాలు వచ్చాయి. జై భీమ్, సార్పట్ట లాంటి సినిమాలు వచ్చాయి. గతంలో తమిళనాడు నుంచి వచ్చిన ఇలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. పరుత్తీ వీరన్ తో పాటు దనుష్ అడుకాలం వంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి. అప్పుడు ఎవరూ విమర్శలు చేయలేదు. ఇప్పుడు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయని మనం సంతోషపడవచ్చు కానీ.. వచ్చిన సినిమాల విషయంలో మాత్రం నిజమైన సినీ అభిమానులకు అంత సంతృప్తి అనిపించదు. ఎందుకంటే.. . రొటీన్ సినిమాలకు… స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలు కమర్షియల్ గా హిట్ అవుతాయి., వాటిని ఆ కోణంలోనే తీస్తారు, వాటికి ప్రభుత్వాలు అవార్డులిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉండదనేదే ఎక్కువ మంది అభిప్రాయం., అందుకే. జాతీయ అవార్డులపై రాను రాను.. నిరాసక్తత పెరుగుతోంది.
జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతీ సారి విమర్శలు వస్తూనే ఉంటాయి. రజనీకాంత్ చెప్పినట్లుగా విమర్శించే నోరు ప్రతీ చోటా ఉంటుంది . కానీ ఆ విమర్శలు ఈర్ష్యతో చేస్తున్నారా లేకపోతే నిజంగా చేస్తున్నారా అన్నది చూడాలి. అప్పుడే సినిమా రంగానికి నిజాయితీగా మేలు చేసినట్లు అవుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…