అయోధ్య రూపురేఖలు అదరహో…!

By KTV Telugu On 12 January, 2024
image

KTV TELUGU :-

రామాలయ నిర్మాణంతో అయోధ్యకు కూడా మంచి జరుగుతోంది. అయోధ్య అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటోంది. 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను అయోధ్య పొందబోతోంది.  అదే సమయంలో చరిత్ర ,సంస్కృతి, ఆధునికతను రంగరించి తన భవిష్యత్ తరాలకు అందజేయబోతోందీ

2031 మాస్టర్ ప్లాన్ తో….. సుమారు లక్ష కోట్ల వ్యయంతో 250 ప్రాజెక్టులు అయోధ్య రూపు రేఖలను మార్చబోతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతలను 34 ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. రామ మందిరం కేవలం మతానికి సంబంధించినదే కాదు, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా మారింది. ఆలయ సముదాయంతో పాటు,అయోధ్య అనేక అభివృద్ధి,  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది.అయోధ్య చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా, నగరాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ప్రపంచ ప్రమాణాలతో కూడిన మెగా పర్యాటక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య  చుట్టుపక్కల ఉన్న  డజనుకు పైగా జిల్లాల ఆర్థిక వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అయోధ్య మాస్టర్ ప్లాన్‌-2031, విజన్ అయోధ్య-2047 పథకాల కింద అయోధ్యలో 250 ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు లక్ష కోట్ల వ్యయంతో  ఈ ప్రాజెక్టులను చేపడుతుండగా ఇందులో సింహభాగం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. 1200 ఎకరాల్లో 2 వేల 200 కోట్ల వ్యయంతో కొత్త టౌన్ షిప్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రానున్న ఐదేళ్లలో ఈ టౌన్ షిప్ నిర్మాణం పూర్తి కానుంది. అయోధ్యలో సుమారు వెయ్యి కోట్లతో కొత్త విమానాశ్రయం, 500 కోట్లతో  ఆధునీకరించిన రైల్వే స్టేషన్ లు అందుబాటులోకి వచ్చాయి. సరయు నదిలో  స్పీడ్ బోట్ రైడ్ లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అక్కడే మ్యూజియం, ఆధ్యాత్మిక థీమ్ పార్క్, రామాయణ ఫారెస్ట్ లను కూడా నిర్మిస్తున్నారు.

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రచారానికి అయోధ్య సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత నెల 30వ తేదీన ప్రధాని మోదీ 5 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు మరోసారి సగర్వంగా ఆధునిక అయోధ్య నిర్మాణానికి దోహదపడనున్నాయి. అయోధ్యలో రామమందిర ఆలయ సముదాయంతో పాటు, అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది. ఇది నగరం తో పాటు  చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా, నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుంది.

133 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతంతో పాటు 31.5 చదరపు కిలోమీటర్ల కోర్ సిటీతో సహా మౌలిక సదుపాయాలు , పర్యాటక అభివృద్ధిని విజన్ అయోధ్య – 2047గా  పరిగణిస్తున్నారు. రామమందిర నిర్మాణం తరువాత  నగరంలో 1:10 నిష్పత్తిలో స్థానికులు, పర్యాటకులు ఉంటారని అంచనా వేస్తున్నారు.  గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో రాష్ట్ర అతిథి గృహాలు, అన్ని రకాల సందర్శకుల అవసరాలను తీర్చడానికి హోటళ్లు ,  వాణిజ్య సముదాయాలు ఉంటాయి. 31 వేల 662 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నగరానికి కొత్త శోభను అందించబోతున్నారు.  మొత్తం 37 రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి.ఎన్‌హెచ్‌ఏఐ 10 వేల  కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తుండగా, యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం  7 వేల 500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. అభివృద్ధి , మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎనిమిది థీమ్‌లుగా వర్గీకరించారు. – సౌందర్య అయోధ్య, క్లీన్ అయోధ్య, సమర్థవంతమైన అయోధ్య, యాక్సెస్ అయోధ్య, అనుభవపూర్వక అయోధ్య, ఆధునిక అయోధ్య, సాంస్కృతిక అయోధ్య , ఆరోగ్యకరమైన అయోధ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతున్నారు.

అయోధ్య రామాలయ సంర్శనకు విదేశాల్లోని హిందువులు క్యూ కట్టే అవకాశం ఉంది. విదేశీ పర్యాటకులకు కూడా అయోధ్య ఫేవరేట్ డెస్టినేషన్ అవుతుంది. వాళ్ల వసతి కోసం ఫైవ్ స్టార్  హోటళ్లు రాబోతున్నాయి. అయోధ్య అన్నింటికంటే మిన్నగా ఉండే స్మార్ట్ సిటీ కాబోతోంది. రోజూ లక్షల మంది ఫ్లోటింగ్ తో పారిశుద్ధ్యానికి కూడా ప్రత్యేక  ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. నగరం కడిగిన ముత్యంలా ఉండాలన్నది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం. దానికి స్థానిక ప్రజల సహకారం కూడా ఉంటుందని ఎదురుచూస్తున్నారు.  ఏదేమైనా ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి