రాముని ఆవాసం, భక్తులకు సంతోషం

By KTV Telugu On 8 January, 2024
image

KTV TELUGU :-

సీతారాముల ఆలయం లేని ఊరు ఉండదు. కష్ట సుఖాల్లో రామ రామ అనుకోని భారతీయుడు ఉండరు. ముస్లింలు కూడా గౌరవించే దేవుడు రాముడు. రాముడ్ని కొలిస్తే కష్టాలు తొలిగిపోయి సర్వసుఖాలు అందివస్తాయని చెబుతారు.

మా ఊళ్లో రామాలయం కడుతున్నాం.. ఈ మాట పూటకో చోట వినిపిస్తున్నదే. ఎందుకంటే రాముడు అంతటి పాపులర్ దేవుడు. ఊళ్లో రామాలయం ఉంటే అష్ట ఐశ్వర్యాలు వస్తాయని హిందువుల విశ్వాసం . ఉదయమే  సీతారామ లక్ష్మణ  హనుమంతులను దర్శించుకుంటే రోజంతా సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ధర్మాచరణలో సంపూర్ణ సంకల్పం ఉన్న నాయకుడు రాముడు.  రామాలయం లేని చాలా గ్రామాలు పట్టణాల్లో వేరే ఆలయాల్లో రాముడి విగ్రహాలు పెట్టి పూజిస్తారు.. ప్రతీ గ్రామంలో ఆలయం ఉన్నప్పటికీ…రాముడికి ప్రసిద్ధ క్షేత్రాలున్నప్పటికీ ఆయోధ్యకు ఉన్న  విశిష్టతే వేరని చెప్పక తప్పదు.. అందుకే అయోధ్య ఆలయం ఎప్పుడు  పూర్తవుతుందా ఎప్పుడు దర్శించుకుందామా అని ప్రతీ భారతీయుడు ఎదురు చూస్తున్నారు..

సప్త మోక్షదాయక క్షేత్రాలుగా చెప్పే ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మణ, గురువు, బంధు పరివారం హత్యదోష నివారణార్థం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. అంత మహిమాన్వితమైన సప్తపురి క్షేత్రాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య అని చెప్పక తప్పదు.

రామో విగ్రహవాన్‌ ధర్మః..అంటే ‘ధర్మం విగ్రహ రూపంలో అంటే రాముని రూపంలో ఉంది’ అని అర్థం. త్రేతా యుగంలో ఆదర్శ మానవ జీవితాన్ని గడిపి సామాన్య వ్యక్తిగా అసామాన్య ప్రజ్ఞ చూపించిన మహావ్యక్తి శ్రీరాముడు. అంత పరాక్రమవంతుడు, ధర్మపరాయణుడు, తన రాజ్యంలో ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టిన శ్రీరాముడు ‘రామం దశరధాత్మజం’ అంటే ‘నేను కేవలం దశరధ మహారాజు కుమారుణ్ణి’ అని చెప్పుకుంటాడు. అందుకే సీతారాముల ఆలయం లేని ఊరు కనిపించదు. అయోధ్య,  మిథిల, భద్రగిరి, రామతీర్థం, ఒంటిమిట్ట, గోదావరి తీర్థం, నాసిక్, పంచవటి, రామగిరి, లక్ష్మణపురం, గంధమాదనం , పంపాతీరం, కిష్కింద, యమునా తీరం , చిత్రకూటం , పర్ణశాల, నంది గ్రామం, హంపి, జీడికల్లు, తిరువళ్లూరు, తిరుపతి, మధురాంతకం, శ్రీరంగం , దర్భశయనం , తిరుప్పల్ నొడి. ఈ క్షేత్రాల్లో శ్రీ రాముడిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యం అని హిందువులు విశ్వసిస్తారు.  అన్నింటిలోనూ అయోధ్య అత్యంత ముఖ్య ప్రదేశంగా చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా రాసి ఉంది. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా చెప్పారు. అయోధ్య ప్రజలు సర్వ  సౌఖ్యాలతో తులతూగారు. అయోధ్య నగర వాసులందరూ ధర్మపరులు. సర్వశాస్త్ర పారంగతులు.  లోభి, కాముకుడు, విద్యాహీనుడు, నాస్తికుడు అక్కడ  భూతద్దం పెట్టి వెతికినా కనిపించేవాడు కాదు.  అందుకే హిందువులంతా ఒక్కసారైన అయోధ్య నగరాన్ని సందర్శించాలని కోరుకుంటారు. రాముడి తండ్రి దశరథుడి సహా అయోధ్య వాసులంతా  పరాక్రమవంతులు. దశరథుని సైన్యం సింధుదేశంలో పుట్టిన మేలుజాతి గుర్రాలతో నిండి ఉండేది. ఐరావతజాతి, అంజనజాతి, వామనజాతికి చెందిన ఏనుగులెన్నో ఉండేవి. అయోధ్యకు బయట కూడా రెండు యోజనాల వరకు శత్రువులు అడుగుపెట్టలేనంతగా ఉండేది. దశరథుడి హయాంలో అయోధ్య అంతలా ప్రకాశించింది.

తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేద  ఎంత ప్రాచుర్యమో… అయోధ్యను తప్పక  సందర్శించాలనే వాదన కూడా అంతే ప్రాచుర్యం పొందింది. అయోధ్య వెళిన ప్రతీ వారికి ధర్మకార్యాలు నిర్వహించి తీరాలన్న ఒక సందేశం కూడా అందుతోంది. మనోల్లాసమే కాదు, ప్రవర్తనలో పరివర్తన కూడా వస్తుందని చెబుతారు. అందుకే వీలైనప్పుడు అయోధ్యను సందర్శించండి. రామనామ స్మరణ చేయండి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి