ఆ వివాదాలు పరిష్కారమవుతాయా..?

By KTV Telugu On 5 July, 2024
image

KTV TELUGU :-

ఫస్ట్ మీటింగు మొక్కుబడిగానే జరుగుతుందా.. చంద్రబాబు, రేవంత్ చర్చించుకోబోయే అంశాలేమిటి. అంతం కాదిది ఆరంభం అంటూ సరిపెడతారా.. కీలకాంశాలేమైనా  చర్చకు వస్తాయా.. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు ఎదురుచూస్తున్నదేమిటి…  కేంద్రంలో  ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న పరపతితో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకుంటారా..అసలు ఆరో తేదిన ముఖ్యమంత్రుల బాడీ  లాంగ్వేజ్ ఎలా ఉండబోతోంది….

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు . చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఈ నెల 6న ప్రజాభవన్లో కలుసుకుందామని  లేఖ పంపారు. నిజానికి ఈ నెల మూడవ వారంలో ఆ ఇద్దరు నేతలు కలుసుకోవాలి. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే  తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు నేతలు హాజరవుతారు. సీఎంలిద్దరూ వేదికను పంచుకుంటారని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హెచ్ఐసీసీ  వేదికగా  జరిగే కమ్మ మహాసభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరవుతారు. మరి వెంకయ్య నాయుడు పక్కనే ఉండగా.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమి మాట్లాడుకుంటారోనన్న చర్చ జరిగింది. అంతలోనే మొత్తం వ్యవహారానికి కొత్త ట్వీస్ట్ ఇస్తూ త్వరలో కలుసుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ మేరకు ఆయన రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయగా… రేవంత్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మరో లేఖను పంపారు . ఈ నెల 6న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌లో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు చంద్రబాబును రేవంత్ ఆ లేఖలో అభినందించారు. స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన అతికొద్ది మంది రాజకీయ నేతల సరసన చంద్రబాబు  చేరడం సంతోషకరంగా ఉందన్నారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా  ముఖాముఖి చర్చించాలన్న చంద్రబాబు సూచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు.

విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారనే అనుకోవాలి. రేవంత్ కూడా అంతే హుందాగా స్పందించారని పరిగణించాలి. అసలు ఆ సమస్యలు ఏమిటనేదే ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మరి నేతలు  వాటిని చర్చించుకోబోతున్నారా….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి  పదేళ్లు దాటింది. 2014లో విభజన జరిగినా.. ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయి. మొన్నటివరకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ కాల పరిమితి సైతం ముగిసిపోయింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీతో పరిపాలనపరంగా హైదరాబాద్‌తో ఏపీకి ఉన్న సంబంధాలు తెగిపోయాయి. పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందనుకున్న ఆంధ్రప్రదేశ్ కు ఒక్క రోజు కూడా ఆ అదృష్టం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలుంటుందని  అంచనా వేస్తున్నారు.  . ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. గతంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. రెండుమూడుసార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు గానీ సమస్యలు పెద్దగా కొలిక్కి రాలేదు. ఈ విభజన చట్టాన్ని సవాల్‌ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ గుర్తుచేస్తోంది. దాన్ని విభజించుకోవడమెలాగని నేరుగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి అంశాలు మరి ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి రావాల్సిన  ఐదువేల  కోట్ల రూపాయలకు సంబంధించి అప్పట్లో జగన్ ప్రభుత్వం చేసిన డిమాండ్ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తుచేస్తోంది. విద్యుత్ బకాయిలు ఐదువేల కోట్లు ఉన్నాయి. ఏపీ హౌసింగ్ బోర్డు బకాయిలకు సంబంధించి 5  వేల 170 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నారు.కృష్ణా  గోదావరి జల  వివాదాలు ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావడం లేదు. ట్రిబ్యూనల్స్ మీటింగులు తప్పితే ఒరిగిందేమీ లేదు.  దీనిపై ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని కదిలిస్తే తేనే తుట్టెను తాకినట్లే అవుతుంది. చంద్రబాబు ఏమి అడుగుతారు. రేవంత్ ఏమి చెబుతారు… లేకపోతే రేవంత్ ఏమి అడుగుతారు. చంద్రబాబు ఏం చెబుతారు… లాంటి ప్రశ్నలకు  ఆరో తేదీనే సమాధానం రావచ్చు. కాకపోతే తొలి భేటీలో వివాదాల ప్రస్తావన ఎందుకులే అని నాయకులు అనుకోవచ్చు. నాలుగు మాటలు, ఒక మంచి కాఫీతో సరిపుచ్చుకుని  బయలుదేరవచ్చు.. ఏదేమైనా మీటింగు శుభపరిణామమే అవుతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి