భోపాల్ పాలకుల పాపాలకు శవమెత్తు నిదర్శన. డాలర్ల పంట కోసం చల్లిన విదేశీ విషపు మందు. ఏళ్ల తరబడి ఏరులై పారుతోన్న కన్నీటి సంద్రాన్ని ఒడిసి పట్టిన ఓ జ్ఞాపకం. ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు కూలిన బతుకుల కాలిన జీవితాల చావు కేక. ఔను భోపాల్ ఇపుడు ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. భోపాల్ వేసే ప్రశ్నలకు పాలకుల దగ్గర సమాధానాలు లేవు.
ఓ మహా విషాదాన్ని గుండెల్లో దాచుకున్న భోపాల్ బిగ్గరగా ఏడుస్తోంది. రోజూ లాగే చీకటైంది రోజూ లాగే అందరూ నిద్రలోకి జారుకున్నారు. రోజూ లాగే వెన్నెల అందరినీ తడిమి తడిమి వెళ్లింది. కానీ ప్రతీ రోజుకూ భిన్నంగా కాల కూట విషంతో తయారు చేసిన కాల మేఘాలు అమాయక ప్రజలపై దాడులు చేశాయి. కళ్లు తెరచే లోగా ఊపిరితిత్తులను కాల్చేశాయి. కళ్లల్లో కన్నీటి సెలయేళ్లు ఆవిర్లు కక్కాయి. నెత్తుటితో కలసి విషం విషపు హాసాలు చేసింది. ఆ రాత్రే వేలాది మందికి కాళ రాత్రి అయ్యింది ఆ రాత్రి వాళ్ల కళ్లల్లోంచి ఇప్పటిదాకా చెదరలేదు.
1984 డిసెంబర్ రెండో తేదీ అర్ధరాత్రి దాటింది తెల్లవారితే మూడో తేదీ మధ్య ప్రదేశ్ లోని భోపాల్ పట్టణం అమాయకంగా నిద్రపోతోంది. అంతలో ఓ కారు మేఘం పగబట్టిన కాల సర్పంలా విషాన్ని మోసుకుంటూ దూసుకు వచ్చింది. నిద్రట్లో ఉన్న వాళ్లు నిద్రట్లో ఉండగానే విష మేఘాలు కాటేశాయి. గాఢ నిద్రలోంచే చాలా మంది శాస్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా మంది విష వాయువులు ఊపిరితిత్తులను మండిస్తోంటే ఉలిక్కి పడిలేచారు. ఏ పాపం ఎరుగని చిన్నారులు నిద్రల్లోంచే ఏడుస్తూ లేచారు. అలా లేచి ఏడుస్తూనే తలలు వాల్చేశారు. వృద్ధులూ ఏం జరుగుతోందో ఆరా తీసే లోపే నేల రాలిపోయారు. ఏడ్పులు పెడబొబ్బలు హాహాకారాలు భయంతో జనాల పరుగులు పిల్లా పాపలను చంకలనెత్తుకుని అమ్మల ఆర్తనాదాలు ఆక్రందనలు ఎవ్వరికీ ఏమీ తెలీడం లేదు. ఎవ్వరికీ ఎటు పోవాలో అర్దం కావడం లేదు. గుండెల్లో ఒకటే మంట వాంతులు దగ్గులు ఊపిరి సలపక ఒకటే ఇబ్బంది. ఎప్పుడూ ఎరుగని వంటి ఓ ఘాటు వాసన ముక్కుపుటాలను చీల్చుకుంటూ ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు పోతోంది. చూస్తోండగానే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
రాత్రి దాకా హాయిగా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకున్న బంధువులు కళ్లముందే చివరి శ్వాసవిడిచారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం చీకిటి కన్నా దట్టంగా మోకాలెత్తున పాకుతోన్న మేఘాలను చూసి ఉలిక్కి పడ్డారు. అవేంటో అర్ధం కాలేదు. ఆ మేఘాలే తమ పాలిట మృత్యు పాశాలని వాళ్లకస్సలు తెలీనే తెలీదు. పిచ్చెక్కినట్లు తోచిన దిక్కుకు జనం పరుగులు తీశారు చూస్తోండగానే వందలాది మంది శవాలైపోయారు. పీనుగుల దిబ్బగా మారింది భోపాల్. తెల్లారే సరికి వేలాది కపాలాలు భూమిలోంచి పొడుచుకు వచ్చినట్లు మొలకెత్తాయి. ఓ భీకర రాత్రి ఎంతో కోపంతో చేసిన విద్వంసపు సంతకంలా భోపాల్ భయానకంగా మారిపోయింది. చింపిరి తలలా భోపాల్ నగరం అస్త వ్యస్థమైంది. భూతల స్వర్గాన్ని భేతాళ లోకంగా మార్చిన ఆ కాళ రాత్రి ఏం జరిగింది. లెక్కకు మించిన ప్రాణాలను తనతో తీసుకుపోయిన ఆ విష వాయువులను ఎవరు పంపారు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి.
భోపాల్ ను తరిమిన విషాదం ఆ విషాదానికి కారణమైన విష సర్పం ఈ పుట్టలోంచే వచ్చింది. ఈ పుట్ట పేరు యూనియన్ కార్బైడ్. అమెరికా దేశస్థుల కంపెనీ ఇది ఈ కంపెనీలోంచే అర్ధ రాత్రి కాల కూట విష వాయువులు వికటాట్ట హాసాలు చేస్తూ నిర్దాక్షిణ్యపు చూపులు చూస్తూ మనుషుల పై పగబట్టి వెంటాడి వేటాడి ప్రాణాలను తోడేశాయి. ఒకటీ రెండూ కాదు దాదాపు ఇరవై వేల మందికి పైనే ఈ వాయువులు మట్టుబెట్టాయని అంచనా. అసలింతకీ ఈ పుట్టలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ పుట్ట ఇక్కడికి ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. 1969 లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పేరిట ఈ కంపెనీ ఇక్కడ అవతరించింది. అమెరికాలోని యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కి ఇందులో 50.9శాతం వాటా ఉంది. ఇండియాకు చెందిన పలువురు ఇన్వెస్టర్లు మిగతా వాటాదారులు. కార్బరిల్ అనే పెస్టిసైడ్ ను తయారు చేసేందుకు ఈ కంపెనీని నెలకొల్పారు.1979 లో ఇందులోనే మిథైల్ ఐసో సైనేట్ ప్లాంట్ ని స్థాపించారు. ఈ ప్లాంటే భోపాల్ విషాదానికి మూల కారణం.
డిసెంబర్ రెండో తేదీ రాత్రి ఈ ప్లాంట్ లోంచే విషవాయువులు ఒక్కసారిగా వెలువడి భోపాల్ పట్టణాన్ని చుట్టుముట్టి వేలాది మంది ఉసురు తీశాయి. కారు చీకట్లోనే వేలాది బతుకులు తెల్లారిపోయాయి. నివాస భవనాలను ఆనుకునే నిర్మించిన యూనియన్ కార్బైడ్ మానవ తప్పిదంతో మారణ హోమమే సృష్టించింది. యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే భోపాల్ ను భూతల నరకంగా మార్చింది. స్మశానాల దిబ్బగా చేసింది. వేలాదిమంది అమాయకులను అన్యాయంగా బలితీసుకుంది. ఇంతకీ విషవాయువులు ఎలా లీకయ్యాయనేది ఆసక్తికరమైన అంశం. మిథైల్ ఐసో సైనేట్ ప్లాంట్ లోని 610 ( సిక్స్ వన్ జీరో )ట్యాంకర్ లో 42 టన్నుల మిథైల్ ఐసో సైనేట్ ఉంది. డిసెంబర్ రెండో తేదీన రాత్రి ప్లాంట్ లో పైపులను శుభ్రం చేస్తున్నారు సిబ్బంది. ఉన్నట్టుండీ 610ట్యాంక్ లోకి పెద్ద మొత్తంలో నీరు చేరింది. మిథైల్ ఐసో సైనేట్ నీటితో కలవడంతోనే రసాయిన చర్య మొదలైంది. నిముషాల్లోనే ట్యాంక్ లో టెంపరేచర్ 200డిగ్రీల సెల్సియస్ కి పెరిగిపోయింది. దాంతో ఒక్క సారిగా విషవాయువులు వెలువడ్డాయి. అవి ఒక్క సారిగా ఎక్కువ పీడనంతో బయటకు వచ్చాయి.
అలా నిముషాల్లోనే ఈ విష వాయువులు భోపాల్ పట్టణాన్ని ఆవరించాయి. మిథైల్ ఐసో సైనేట్ అధిక టెంపరేచర్ల వద్ద హైడ్రోజిన్ సైనైడ్ గా విడిపోతుంది. ఇది చాలా ప్రమాదకర రసాయినం. దీనితో పాటే కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ తదితర విషవాయువులు గాల్లో కలిసిపోయాయి. ఇవన్నీ కలసిన కాల కూట విష వాయువులు మానవాళి పై విరుచుకు పడి ప్రాణాలు తీశాయి. ట్యాంక్ లోకి నీళ్లు ఎలా చేరాయనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైపులను శుభ్రం చేసేటప్పుడు పైపుల్లోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయం పై సిబ్బందికి అవగాహన ఉండదు. దీన్ని సూపర్ వైజర్లు దగ్గరుండి చెప్పాలి. కానీ ఆరోజున సూపర్ వైజర్లు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు ఫలితంగా పైపుల్లోంచి నీరు 610ట్యాంక్ లోకి చేరింది. భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కంపెనీలో భద్రతా చర్యలను మొదటినుంచీ కూడా పట్టించుకున్న పాపానపోలేదు. అడుగడుగునా అజాగ్రత్తలే అణువణువునా నిర్లక్ష్యాలే ప్రమాదం పొంచి ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా కూడా కంపెనీ పెద్దలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ దుర్గటనకు ముందు కంపెనీలో చాలా ప్రమాదాలు సంభవించాయి. అయినా యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు.
మిక్ ప్లాంట్ లో విషవాయువులు లీక్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ చాలా ముందస్తుగానే హెచ్చరించినా భోపాల్ యూనిట్ లో మాత్రం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. అంతే కాదు ప్లాంట్ ను పర్యటించిన అమెరికా నిపుణులు మిక్ స్టోరేజ్ ప్లాంట్ ను పరిశీలించారు. అప్పుడే ఈ హెచ్చరిక చేశారు.1979 నుంచి స్థానిక అధికారులూ యూనియన్ కార్బైడ్ ప్లాంట్ లో సేఫ్టీ మెజర్స్ సరిగా లేవని వారిస్తూనే ఉన్నా ఇక్కడి యాజమాన్యం పట్టించుకోలేదు. ఇన్ని ప్రమాదాలు జరిగినా మరో పెద్ద ప్రమాదానికి తలుపులు తీసే ఉంచిన యాజమాన్యం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. యూనియన్ కార్బైడ్ యాజమాన్యం భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. మిక్ నిల్వలు ఉన్న ప్లాంట్ లో టెంపరేచర్ 4 డిగ్రీల సెల్సియస్ కు మించి ఉండకూడదు. కానీ ప్రమాదం జరిగినరోజున అక్కడ రూమ్ టెంపరేచర్ లోనే మిక్ ను ఉంచారు. ఇటువంటి ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటే అందరినీ అప్రమత్తం చేయడానికి సూపర్ వైజర్లు ఉండాలి. కానీ ఖర్చులు తగ్గించుకోడానికి వీలుగా యాజమాన్యం అసలు సూపర్ వైజర్ లనే నియమించలేదు. చాలా కాలం నుంచి ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
గ్యాస్ లీక్ అయిన తర్వాతనయినా ఆ గ్యాస్ ఎంత ప్రమాదకరమైనదో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో యాజమాన్యం ఎవరినీ అలెర్ట్ చేయలేదు. నిజానికి ఇటువంటి ప్రమాదాలు సంభవించినపుడు ముందుగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు తెలయజేయాలి. చివరికి విషవాయువులు వేలాది మంది ప్రాణాలు తీసి మరికొన్ని వేల మందిని ఆసుపత్రులకు చేర్చినా వాళ్లను ఏ రక మైన వాయువులు దెబ్బ తీశాయో వాటి లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్లకు ఏవిధమైన మందులు వాడాలో కూడా కంపెనీ తరపు ప్రతినిథులు అప్రమత్తం చేయలేదు. చాలా యూనిట్లలో స్కిల్డ్ వర్కర్లు లేనే లేరు ఉన్న వాళ్లకి సేఫ్టీ మెజర్స్ పై అవగాహన లేదు. వెరసి కంపెనీ యాజమాన్యం అడుగడుగునా నిర్లక్ష్యంతోనే వ్యవహరించి ఇన్ని ప్రాణాలు తోడేసింది. ఓ పెద్ద నిర్లక్ష్యం విషంగా మారింది. భోపాల్ గుండెలను కాల్చింది వేలాది మందిని నేలరాల్చింది ఈ నరమేథానికి ఖచ్చితంగా యూనియన్ కార్బైడ్ యాజమాన్యమే కారణం. విష వాయువులు లక్షలాది మందిని చుట్టుముట్టాయి. అందులో వేలాది మంది అక్కడి కక్కడే మరణించారు. వేలాది మంది విష వాయువుల దుష్ప్రభావానికి ఏళ్ల తరబడి భయంకర వ్యాధులతో ఇతరత్రా రుగ్మతలతో నరక యాతన అనుభవించి మరీ చనిపోయారు. ఇప్పటికీ లక్షకు పైగా బాధితులు ఆ కాళ రాత్రి చేసిన విష గాయాలతో సతమతమవుతూనే ఉన్నారు.
బతికున్నవాళ్లు ఆనాటి ఘోర విషాదంలో మృతి చెందిన తమ బంధువులను తలచుకుని కన్నీటిని తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. యూనియన్ కార్బైడ్ కు పది కిలోమీటర్ల రేడియస్ లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. గ్రౌండ్ వాటర్ లో యూనియర్ కార్బైడ్ లో వాడే రసాయినాల అవశేషాలే ఉన్నాయి. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత పుట్టిన పసి కందుల్లోనూ అంతు చిక్కని రోగాలు వచ్చాయి. ఇంతటి పెద్ద దారుణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకు తీరాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. కంపెనీ సిఈఓ వారెన్ ఆండర్సన్ ను ఉరి తీయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. 26 ఏళ్ల తర్వాత ఈ మహాపాపం పై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం కంపెనీకి చెందిన ఏడుగురు అధికారులకు కేవలం రెండేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించింది.1987 లో ఛార్జి షీటు దాఖలైనప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు 19 మంది న్యాయమూర్తులు విచారణ జరిపారు. నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు తీయడానికి కారణమయ్యారంటూ ఏడుగురిపై ఐపీసీలో శిక్ష తక్కువగా ఉండే సెక్షన్ల కింద శిక్ష విధించారు.
ఈ శిక్ష ప్రకటించిన కొద్ది సేపటికే ఆ ఏడుగురూ పాతిక వేల రూపాయల పూచీకత్తు తో బెయిల్ పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. అసలు దోషిగా బాధితులు ఆక్రోశిస్తోన్న ఆండర్సన్ కు ఎలాంటి శిక్షా లేదు. అసలు అతని ప్రస్తావనే తీర్పులో రాలేదు.
డిసెంబర్ రెండో తేదీ అర్ధరాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీ చిమ్మిన విష వాయువులు చేసిన గాయాల కన్నా కూడా న్యాయ స్థానంలోనూ తమకు న్యాయం జరగలేదన్న బాధ బాధితులను క్షోభ పెట్టింది. అందుకే కోర్టు ఆవరణ లోనే బాధితులు ఆందోళనకు దిగారు. తన నిర్లక్ష్యంతో వేలాది మంది ఉసురు తీసి లక్షలాది జీవితాలను చీకట్లోకి నెట్టిన ఆండర్సన్ మాత్రం న్యూయార్క్ లో తన భార్యా పిల్లలతో హాయిగా జీవించాడు. ఈ పాపంతో తనకేమీ సంబంధం లేదనే ఆండర్సన్ జీవితాంతం వాదించాడు. ఆండర్సన్ విషయంలో అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి కఠిన వైఖరినీ ప్రదర్శించకపోవడం బాధితులను మరింతగా వేధిస్తోంది.
యూనియన్ కార్బైడ్ యాజమాన్యానికి డిసెంబర్ రెండు నాటి మహా విషాదం గురించి ముందే తెలుసని సమాచారం.
తెలియడం ఏమిటి యాజమాన్యమే గ్యాస్ లీక్ చేసి ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. కంపెనీని పెద్ద మొత్తంలో ఇన్స్యూరెన్స్ చేసిన యాజమాన్యం విలువైన రసాయినాల నిల్వలను తొలగించి ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు చేసి ఇన్స్యూరెన్స్ ను క్లెయిమ్ చేసేందుకు పథకాన్ని రచించిందట. అయితే కొద్ది మొత్తంలో గ్యాస్ ను లీక్ చేసి హడావిడి చేద్దామనుకున్న ప్లాన్ కాస్తా బెడిసి కొట్టిందట. గ్యాస్ కొంత లీక్ కాగానే 610 ట్యాంక్ లో ఒక్క సారిగా పీడనం పెరిగి గ్యాస్ ఉధృతంగా వెలువడిందని ఓ ఆరోపణ. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ యాజమాన్యం ఎవరినీ అలెర్ట్ చేయకపోవడాన్ని చూస్తే ఏదో కుట్ర లాంటిది జరగడానికి అవకాశాలున్నాయని మాత్రం అనిపిస్తుంది. ఇది కాకుండా మరో వాదనా ఉంది. యూనియన్ కార్బైడ్ లో పెస్టిసైడ్స్ తయారీ ముసుగులో అమెరికా జీవ రసాయిన ఆయుధాలను తయారు చేసి వాటిని ప్రయోగించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జీవ రసాయిన ఆయుధం సామర్ధ్యాన్ని అంచనా వేసే క్రమంలో ఈ ప్రయోగానికి పాల్పడిని కార్బైడ్ యాజమాన్యం వేలాది మంది అమాయకులను అన్యాయంగా బలితీసుకుందని అంటున్నారు అయితే వీటికి సాక్ష్యాలు లేవు. ఇంతకీ ఆండర్సన్ ను మన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అతనికి న్యాయస్థానంలో ఎందుకు శిక్ష పడలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆండర్సన్ ను ఎందుకు టార్గెట్ చేయలేదు. మన దేశంలో వ్యాపారం చేసుకుంటూ మన పౌరులను సమాధి చేసిన హంతకుడికి మన పాలకులే సెల్యూట్ కొట్టి రాజ మర్యాదలు చేయడానికి కారణాలేమిటి. ఇవన్నీ భేతాళుని మార్కు ప్రశ్నలే వాటికి సమాధానాలు చెప్పలేక శవాలు మళ్లీ చెట్టెక్కాల్సిందే. 1984 డిసెంబర్ మూడో తేదీ తెల్లారడమే భయంకరంగా తెల్లారింది. లక్షలాది మందిని శపిస్తూ వెళ్లిన కాళ రాత్రి చేసిన గాయాల నుంచి ఎగజిమ్ముతున్న నెత్తుటేరులను తాకుతూ వెలుతురు వచ్చింది. నిద్రట్లోనే మళ్లీ లేవలేని నిద్రలోకి జారుకున్న వేలాది మంది వదనాలను నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూ సూర్యుడు వచ్చాడు.
నరమేథపు పాపులను ద్రోహులను తనలో కలిపేసుకున్న చీకటి మాత్రం శవాలనే సాక్ష్యాలుగా మిగిల్చి వెళ్లిపోయింది.
విషయం తెలిసిన వెంటనే భోపాల్ అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయింది. అధికార యంత్రాంగం బాధితులకు సహాయం అందిస్తోంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ పాపానికి ఓనరైన వారెన్ ఆండర్సన్ కు సహాయం అందించడంలో బిజీ అయిపోయింది. బాధితులు కానీ వారి బంధువులు కానీ ఉద్వేగంలో ఆండర్సన్ ను ఏమన్నా చేస్తారేమోనని పాపం మధ్యప్రదేశ్ పోలీసులు తెగ బెంగ పెట్టుకున్నారు. అందుకే డిసెంబర్ ఏడో తేదీన ఆండర్సన్ ను అదుపులోకి తీసుకుని తమ రక్షణలో ఉంచుకున్నారు. అమెరికా అతిథి కి ఎక్కడా మర్యాదలో లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అంతే ఇక మొత్తం రాష్ట్రం యంత్రాంగం ఆండర్సన్ కు సెల్యూట్ చేసేసింది.
భోపాల్ కలెక్టర్ దగ్గరుండీ ప్రత్యేక విమానంలో ఆండర్సన్ ను ఢిల్లీకి తరలించారు. అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఏవియేషన్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆర్.సి.సోంధీ యే ఈ రహస్యాన్ని ఆ తర్వాత చెప్పారు. ఆ విమానానికి పైలట్ గా వ్యవహరించిన కెప్టెన్ సయీద్ ఆలీ కూడా దీన్ని ధృవీకరించారు. అంతే కాదు ఎవరో విఐపీ ని ఢిల్లీ తీసుకెళ్లాలని సమాచారం వచ్చిందే తప్ప చివరి నిముషం వరకు అతను ఆండర్సన్ అని తమకు తెలీదని ఆలీ అన్నాడు. ఆ టైమ్ లో ఆండర్సన్ చాలా ఆందోళన కరంగా కనిపించాడని ఆలీ గుర్తుచేసుకున్నాడు. అర్జున్ సింగ్ ఆదేశాల మేరకే ఆండర్సన్ ను రాజ మర్యాదలతో క్షేమంగా ఢిల్లీ పంపారు. అక్కడి నుంచి అతన్ని అమెరికా కు సురక్షితంగా తరలించారు.
ఆండర్సన్ ని ఇంతలా కంటికి రెప్పలా కాపాడాల్సిన అవసరం ఆ నాటి పాలకులకు ఎందుకొచ్చింది. ఈ సహాయం చేసి పెట్టినందుకు వాళ్లకు ఏ ప్రయోజనం ఒనగూడి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు ఇండియాలో సమాధానాలు దొరకవు.
కాకపోతే ఇండియన్స్ కి ఈ సమాధానాలు ఏమిటో చూచాయగా తెలుసు.
వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పెద్ద మనిషిని ఆ తర్వాతైన ఇండియా కు తీసుకు వచ్చి అతనికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపకపోవడం ఈ విషాదాన్ని మించిన దారుణం. ప్రత్యేకించి అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ పై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. అర్జున్ సింగ్ పై విమర్శలు చేసిన బిజెపి కూడా ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. తమ ఓట్లే తప్ప ప్రజల మనోభావాలూ వాళ్ల బాధలూ తమకు పట్టవని రాజకీయ నాయకులు చాలా సార్లు చాటి చెప్పారు. ఈ కేసులో మరో సారి చెప్పారు అంతే.
అయితే ఇపుడు భోపాల్ బాధితులను వెంటాడుతోన్న ప్రశ్న ఒకటే. భోపాల్ ను మాడ్చి మసి చేసిన విషవాయువులు ప్రమాద కరమైనవా లేక ప్రజల విషాదాన్నీ తమ ప్రయోజనాలకు వాడుకునే రాజకీయుల చిరునవ్వులే ఎక్కువ ప్రమాదకరమైనవా అని వారు ఆలోచిస్తున్నారు. సరైన సమాధానం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. జీవిత కాలపు గాయం జీవితాన్ని మించిన విషాదం ఏళ్ల తరబడి న్యాయ పోరాటం పాలకుల నిష్క్రియా పరత్వం వెరసి 39 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసిన భోపాల బాధితులకు కోర్టు తీర్పు నిరాశనే మిగిల్చింది. యూనియన్ కార్బైడ్ చేసిన ద్రోహం కన్నా పాలకుల సహాయ నిరాకరణే తమకు అన్యాయం జరగడానికి కారణమని వారు భావిస్తున్నారు. వాళ్లు ఇపుడు ప్రభుత్వాన్ని శపిస్తున్నారు.