ఎమర్జెన్సీ” దగ్గరే ఆగిన బీజేపీ !

By KTV Telugu On 9 July, 2024
image

KTV TELUGU :-

యాభై ఏళ్ల కిందట జరిగిన విషయాన్ని బీజేపీ ఇప్పుడు బూచిగా చూపించి రాజకీయం చేయాలనుకుంటోంది. యాభై ఏళ్ల కిందట ఇందిరగాంధీ ఎమర్జన్సీ విధించారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా  పోరాడిన చాలా మంది నేతలు పెద్దవారయ్యారు.  పదవులు అనుభవించారు. రిటైరైపోయారు. వెంకయ్యనాయుడు, అద్వానీ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు. యాభై ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఏమిటో తెలియదు.  ఎన్ని చెప్పినా కథలే.  మరి అయినా బీజేపీ ఎందుకు దాన్నే పట్టుకు వేలాడుతోంది.  ఎమర్జెన్సీ కన్నా ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయని వస్తున్న విమర్శలకు ఎందుకు కౌంటర్ లేదు ?

పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పై దాడిచేయాడజనికి  ప్రధాని మోడీ 50ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీన అస్త్రాన్ని తెచ్చుకకున్నారు.   స్పీకర్, రాష్ట్రపతి నోట ‘ఎమర్జెన్సీ’ ప్రస్తావనే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీసుకొచ్చారు. విపక్షనేతగా మొదటిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక అంశాలు సభ ముందు లేవనెత్తారు. మణిపూర్ రావణ కాష్ఠంలా రగులుతున్నా ప్రధాని మోడీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ ఒక్కసారీ మణిపూర్‌ను ఎందుకు సందర్శించ లేదు అని ప్రశ్నించారు. హిందూమతం అంటే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కాదని గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి యువత భవిష్యత్ అయోమయం చేశారని నిలదీశారు. నోట్ల రద్దు నుంచి పౌరసత్వ సవరణ చట్టంవరకు ఎన్నో సమస్యలను రాహుల్ నిక్కచ్చిగా సభ ముందుంచినా వీటిలో ఏఒక్కదానికి మోడీ సర్కారు నుంచి సమాధానం రాకపోవడం గమనార్హం.

ఎమర్జెన్సీని పదేపదే తిట్టిపోసే ప్రధాని నరేంద్ర మోడీ తన హయాంలో అంతకు మించిన నిర్బంధ పాలన చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  రెండురాష్ట్రాల సీఎంలు జైలుకెళ్లారు. ఓ రాష్ట్ర సీఎం బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ సీఎం అయ్యారు.  మరో రాష్ట్ర సీఎం జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు.  మోదీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని బలిపీఠంపై పెట్టిన  ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.  చివరికి మీడియా స్వతంత్రంగా లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  తమకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలపై కత్తెర వేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను వినియోగించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకున్నారు.  జాతీయ దర్యాప్తు సంస్థ NIA, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులు కేవలం విపక్షాల మీదనే పెడుతున్నారు.  సుప్రీం ధర్మాసనం ఎన్నో సార్లు ఈ దర్యాప్తు సంస్థల కేసుల డొల్లతనం ఎండగట్టింది.  కేవలం ప్రతిపక్షాలను బోనుకెక్కించడానికే ఈ దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి తప్ప అధికార బిజెపి నేతలు ఎవరిపైనా కేసులు దాఖలు కావడం లేదు.

17 వ లోక్‌సభలో ప్రతిపక్షాలను నోరెత్తనీయకుండా మోడీ సర్కారు చేసింది.  పౌరసత్వం సవరణ చట్టం, క్రిమినల్ కొత్త చట్టాలు, వ్యవసాయ చట్టాలు గురించి సభలో చర్చ జరగలేదు. చర్చకు నోచుకోని చట్టాలను బలవంతంగా ఇప్పుడు అమలులోకి తీసుకురావడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదు.  ఎమర్జెన్సీ బూచిని చూపించి కాంగ్రెస్‌పై పదేపదే ఎదురు దాడి చేస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు కూడా తానెంతవరకు ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. . 400 స్థానాలు సాధిస్తామని, కాంగ్రెస్ నుంచి భారత్‌కు ముక్తి కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన మోడీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు.

బీజేపీ ఇప్పుడు  పదేళ్లకుపైగా అధికారంలో ఉంది. ఐదు దశాబ్దాల కిందట జరిగిన ఎమర్జెన్సీ  గురించి ప్రజలు ఇప్పుడు అంత ఆసక్తిగా చర్చించుకోవడంలేదు.  దానికి కారణం అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో చేసినట్లుగా చెప్పుకున్న ఎన్నో అంశాలు ఇప్పుడు అధికారిక ప్రకటన లేకుండానే జరిగిపోతున్నాయి. ప్రజలకు స్వేచ్చ లేదు. ప్రభుత్వాలను వ్యతిరేకించే వారికి గ్యారంటీ లేదు.  ఇలాంటి పాలన లో .. ఎమర్జెన్సీ గురించి చెప్పి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచాలనుకుంటే.. వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది.

నెహ్రూను నిందించి.. ఇందిరను ఎగతాళి చేసి ఎమర్జెన్సీని ఓ అస్త్రంగా చేసుకునిప్రతీ సారి ఎన్నికల్లో ఈదలేరు.  పదహేనేళ్లు అధికారంలో ఉన్న తర్వాత అలాంటి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు.  కేంద్ర పాలకులు ఎప్పుడు ఈ రాజకీయ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటారో !

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి