అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల కవితకు కాదేదీ అనర్హం. అలాగే కులం, మతమే , అవార్డులు కూడా రాజకీయాలకు అతీతం కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ నిరూపిస్తోంది. భారతరత్న అవార్డులను విరివిగా ప్రకటిస్తూ తన మార్క్ రాజకీయం చేస్తోంది. ఈ అవార్డులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతరత్న స్థాయిని రాజకీయాల కోసం దిగజారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఎన్నడూ లేని విధంగా కేంద్రం ప్రభుత్వం ఒకే సంవత్సరం ఐదుగురు ప్రముఖులకు భారతరత్నాలు ప్రకటించింది. అయితే దీనికి కారణం వారి మీద హఠాత్తుగా ముంచుకొచ్చిన ప్రేమ కాదు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ తన వద్ద ఉన్న అస్త్రాలను ఇప్ప టికే ఒక్కొక్కటిగా ప్రయోగిస్తున్నారు. వాటిలో భాగమే ఈ భారతరత్నాలు. కొద్ది రోజుల క్రితం బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించారు. అక్కడ ప్రభుత్వాన్ని మార్చేశారు. అయోద్య రామాలయం ప్రారంభానికి వెళ్లే అవకాశం నోచుకోని ఎల్కే అద్వానీకి తర్వాత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటింారు. ఇప్పుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్లను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మోడీ ప్రకటించిన భారతరత్నాలలో ముగ్గురు ప్రతిపక్షాలకు చెందిన వారే.
ఒకప్పటి భారతీయ లోక్‌దళ్ ప్రస్తుతం రాష్ట్రీయ లోక్‌దళ్ నేత చరణ్ సింగ్, సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్, ప్రధానిగా ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న తొలి గాంధీ కుటుంబ యేతర కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు….వీరు ముగ్గురూ ప్రతిపక్షానికి చెందిన వారే. గతంలో కూడా మోడీ తన పార్టీతో సంబంధం లేని సర్దార్ వల్లభారు పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లకు ఎనలేని ప్రధాన్యత ఇచ్చారు. 1966లో ప్రధాని అయిన వెంటనే ఇందిరాగాంధీ అమెరికాలో పర్యటించారు. ఆ తర్వాత ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ దిశగా హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ చేసిన కృషి ఎనలేనిది. ఆ విధంగా స్వామి నాథన్‌కు కూడా ఇందిర, కాంగ్రెస్‌తో కొంత అనుబంధం ఉంది. కర్పూరీ ఠాకూర్, చరణ్ సింగ్ వెనుకబడినతరగ తులకు చెందిన వారే.
వాస్తవానికి మండల్ నినాదానికి ఆద్యుడు కర్పూరీ ఠాకూరే. ఆయన 1978లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ నిర్ణయం హింసాత్మక నిరసనలకు దారితీయడంతో వాటిలో 3 శాతం రిజర్వేషన్లను ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మరో మూడు శాతం రిజర్వేషన్లను మహిళలకు ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు చెందిన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించిన నేపథ్యంలోనే జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. సోషలిస్టు నేతకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తాను గతంలో కేంద్ర ప్రభుత్వాలకు అనేకసార్లు లేఖలు రాశానని, అయితే ఎవరూ పట్టించుకోలేదని, చివరికి మోడీ తన కోరికను నెరవేర్చారని నితీష్ చెప్పుకొచ్చారు.
బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న ప్రకటించడం వెనుక మోడీ మందిర మంత్రం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మోడీ హయాంలో అద్వానీని పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన్ని మళ్లీ తెర పైకి తెచ్చారు. ఆయనకు భారతరత్న ప్రకటించడం ద్వారా మోడీ పార్టీ కార్యకర్తలకు…ముఖ్యంగా కరడుకట్టిన హిందూత్వ వాదులకు ఓ స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ఆర్ఎల్డీ నేత, చరణ్ సింగ్ మనుమడు జయంత్ చౌదరి స్పందన కూడా ఇలాగే ఉంది. తన తాతకు భారతరత్న ఇవ్వడంపై జయంత్ స్పందిస్తూ ‘హృదయాలను గెలుచుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. నిన్నటి వరకూ ఇండియా కూటమిలో ఉన్న జయంత్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి ఎన్డీఏలో చేరడానికి సిద్ధమయ్యారు. రైతు నేత అయిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంతో అన్నదాతలు బీజేపీ వైపు మళ్లుతారని ఆయన భావిస్తున్నారు. రైతులు…ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని జాట్లు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. చరణ్ సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆర్ఎల్డీ ఇప్పుడు బీజేపీ పంచన చేరడంతో జాట్ల ఓట్లు కొల్లగొట్టవచ్చునని మోడీ ఆలోచన. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనానికి చరణ్ సింగే కారణం. ఆయన జాట్లకే కాదు…యాదవులకు కూడా నేతగా వెలిగారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీయే. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక రంగం తలుపులు తెరవడం కోసం ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పైగా పీవీ దక్షిణాదికి చెందిన నేత. తెలంగాణకు చెందిన తెలుగు బిడ్డ. దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి పీవీ కన్పించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొంత మేరకైనా ఓట్లు, సీట్లు సాధించాలని ఆశిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమంటే అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా దక్షిణాదికి చెందిన వారే. ఏదేమైనా ఒకే సంవత్సరంలో ఐదుగురు నేతలకు భారతరత్న పురస్కారాలు ప్రకటించడం వెనుక రాజకీయ కారణాలున్నయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…