అటు లిక్కర్ ఘాటు..ఇటు డ్రగ్స్ హీటు || BJP || TDP || JSP || YCP

By KTV Telugu On 24 March, 2024
image

KTV TELUGU :-

సార్వత్రిక ఎన్నికల వేళ  దేశంలో మత్తు రాజకీయాలు  మంట పుట్టిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటికే బి.ఆర్.ఎస్. నాయకురాలు కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్  ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్ ను  ఇండియా కూటమి పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. అన్ని పార్టీలూ కూడా కేజ్రీవాల్ కు సంఘీభావం తెలిపాయి. బలవంతంగా జైలుకు పంపితే జైలునుండే  పాలన సాగిస్తానని అరవింద్ కేజ్రీవాల్  స్పష్టం చేశారు. ఎన్నికల వేళ తనను ప్రచారానికి దూరంగా ఉంచడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్నదే బిజెపి కుట్ర అన్నారు కేజ్రీవాల్.

ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు రాజకీయాలను ఇప్పటికే వేడెక్కించాయి. ఈ   తరుణంలోనే ఆంధ్ర ప్రదేశ్   లో విశాఖ పట్నం  పోర్టులో 25 వేల కిలోల  కంజైన్ మెంట్ ను సిబిఐ సీజ్ చేసింది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు కంటెయినర్ ను స్వాధీనం చేసుకుని అందులోని సరుకును పరీక్షించగా డ్రై ఈస్ట్ లో   డ్రగ్స్ కలిపి తెచ్చినట్లు స్పష్టమైంది. సిబిఐ డ్రగ్స్ ను పట్టుకున్నట్లు వార్తలు రాగానే దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.  టిడిపి అధినేత చంద్రబాఉ నాయుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి నేతలు  ముక్తకంఠంతో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్ కు రాజధానిగా మారిపోయిందని నిప్పులు చెరిగారు.

టిడిపికి అనుకూలంగా  పనిచేస్తాయని  పేరొందిన మీడియాలోనూ డ్రగ్స్ వెనుక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనేలా వార్తలు  వచ్చాయి. సిబిఐ అధికారులు డ్రగ్స్ ను సీజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఏపీ పోలీసులు అడ్డుకున్నారని..దాని వెనుక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని ఆ కథల్లో ఆరోపించారు. అయితే కొద్ది గంటల్లోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ తో వచ్చిన ఆ కంటెయినర్ బ్రెజిల్ నుంచి  వచ్చింది. అది విశాఖ^లోని సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో వచ్చింది. ఆ కంపెనీ ఎవరిదని  దర్యాప్తు చేస్తే  ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి కి సన్నిహిత బంధువలదే అని తేలింది. దీంతో టిడిపి-జనసేనలు సైలెంట్ కాక తప్పలేదు.

పురందేశ్వరి తనయుడు చెంచురామ్, పురందేశ్వరి వియ్యంకుడు  ప్రసాదరావులు కలిసి సంధ్య ఆక్వాటెక్ అనే కంపెనీ పెట్టారు. ఆ తర్వాత దాన్ని మూడు కంపెనీలుగా విభజించారు. విశాఖ, ఉయ్యూరు, పాలకొల్లులో ఆ మూడు కంపెనీలూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ మూడు కంపెనీల నిర్వాహకులంతా  పురందేశ్వరికి సన్నిహిత బంధువులే. కోటయ్య చౌదరి, వీర భద్రరావు చౌదరి  లు సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్నారు. వీరికి విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్ధి, నందమూరి బాలయ్య రెండో అల్లుడు,  నారా లోకేష్ తోడల్లుడు అయిన భరత్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో టిడిపి  నేత దామచర్ల  సత్య కూ దీంతో సంబంధాలున్నాయని అంటున్నారు.

డ్రగ్స్ ఏ కంపెనీ పేరు మీద వచ్చిందో ఆ కంపెనీ నిర్వాహకులు అయితే ఏపీలో టిడిపి -బిజెపిలకు చెందిన నేతల బంధువులే. అయితే  తాము రొయ్యల ఫీడ్ కు ఆర్డర్ పెట్టామని  కంపెనీ నిర్వాహకులు అంటున్నారు. అయితే అందులో ఈస్ట్ తో పాటు డ్రగ్స్ ఎందుకు వచ్చాయో తమకు తెలీదంటున్నారు. అయితే దీనిపై సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  ఎన్నికల వేళ ఈ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి రావడం టిడిపి-జనసేన-బిజెపి కూటమికి  నష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రొయ్యల ఫీడ్ కి ఆర్డర్ పెడితే లక్షల కోట్ల విలువ చేసే  డ్రగ్స్ ను ఎవరైనా ఎందుకు పంపిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. అయితే దీని వెనుక సూత్రధారులెవరు పాత్రధారులెవరు అన్నది తేలాల్సి ఉంది.

ఈ నెల 19నే ఈ డ్రగ్స్ కంటెయినర్ ను సిబిఐ పరిశీలించిందని సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ హరికృష్ణ  చెప్పారు. ఈ తరుణంలోనే  దగ్గుబాటి పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆమె వెళ్లారని అంటున్నారు. ఆమెను ఢిల్లీ నుండి పిలిచింది ఎవరు? ఎందుకు ? అన్నది  తేలాల్సి ఉంది. ముందుగా అయితే ఎన్నికల వేళ ఏపీ బిజెపిలో ఆమె వ్యతిరేక వర్గం పురందేశ్వరిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయడంతో దానికోసం ఆమెను పిలిపించారేమో అనుకున్నారు. అయితే డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసే బిజెపి పెద్దలు ఆమెను ఆరాతీయడానికి పిలిపించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు.  అయితే సిబిఐ దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎవ్వరినీ దోషులని చెప్పడానికి లేదు. మొత్తానికి లిక్కర్ అండ్ డ్రగ్స్ రాజకీయాలతో ముడి పడి ఉండడం  కొత్త చర్చకు తెరతీస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి