బ్రిజ్ భూషణ్‌ను బీజేపీ హైకమాండ్ కాపాడుకుంటుందా

By KTV Telugu On 3 June, 2023
image

దేశం మొత్తం తిరిగిచూసే ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రధాని మోదీ కానీ బీజేపీ కానీ పట్టించుకోనట్లుగా ఉంటే ఇక ఆ సమస్యను ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇదే జరుగుతోంది. ఆ సమస్య ఏమిటి, ఎంత తీవ్రమైనది ప్రజల్లో తమ ఇమేజ్ ను చులకన చేస్తుందా లాంటివి ఏమీ పట్టించుకోవడం లేదు. అలాంటి సమస్య ఇప్పుడు కూడా ఉంది అదే మహిళా రెజ్లర్ల సమస్య. వారాల తరబడి వారు నిరసనలు చేస్తున్నారు. కానీ కేంద్రం స్పందించలేదు. దేశమంతా చర్చనీయాంశమవుతోంది కానీ సైలెంట్. ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదు. మహిళా రెజ్లర్లు దేశానికి గర్వకారణం. అమ్మాయిలపై తీవ్రమైన వివక్ష ఉన్న హర్యానా సహా ఇతర ఉత్తరాది ప్రాంతాల్లోని గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు. వారిలో ఎన్నో అంతర్జాతీయ పతకాలు తెచ్చిన వారు ఉన్నారు. పతకాలు సాధించుకొచ్చినప్పుడు వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా పిలిచి అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఫోటోలను ఆ రెజ్లర్లు తమ ఇళ్లల్లో ఫ్రేమ్ కట్టించుకుని మరీ ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి సమస్యలొస్తే ఆయన నోరు మెదపడం లేదు. విపక్షాలన్నీ ఎద్దవా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. భేటీ బచావో అని అరుస్తున్నా వినిపించుకోనట్లే ఉంంటున్నారు. అసలు రెజ్లర్ల సమస్య ఏమిటి. కేంద్రం కూడా పరిష్కరించలేనంత పెద్ద సమస్యనా.

జీవితాన్ని త్యాగం చేసి తాము సాధించిన పతకాలను గంగా నదిలో విసిరేయడానికి మహిళా రెజ్లర్లు సిద్ధపడ్డారు. కానీ వారికి ఆ అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదు. ఢిల్లిలో అయిదు నెలలుగా జరుగుతున్న మహిళా రెజ్లర్ల ఆందోళనకు పాలకులూ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోవడంతో చివరికి పతకాలను గంగానదిలో వేయాలని వారు తీసుకున్న నిర్ణయం అది. హస్తిన నుంచి హరిద్వార్‌కి చేరిన ఆ దృశ్యం ఒక విషాదమే. జాతి గర్వించదగ్గ రీతిలో విజయాలు సాధించిన పతకాలను గంగపాలు చేసేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారంటే వారెంత ఆవేదనకు గురైఉంటారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోకపోవడమే అసలు విషాదం. మహిళా రెజ్లర్ల సమస్య రైతు చట్టాల మాదిరి పరిష్కరించలేనంత పెద్దదా అంటే చాలా చిన్నదని చెప్పుకోవాలి. భారత రెజ్లర్ల ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్నది వారి ఆరోపణ. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ ఏమీ రెజ్లర్ కాదు వివాదాస్పదమైన వ్యక్తి. కాకపోతే బీజేపీ ఎంపీ అదొక్కటే ఆయన బలం. రెజ్లర్లు రోడ్డెక్కడానికి ముందే చాలా సార్లు ఆయన తీరుపై ఫిర్యాదులు చేశారు. విషయం అంతర్గతంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసర అంశంగా పరిగణించి అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమ నంగానైనా పరిష్కారాన్ని కనుగొని ఉండాల్సింది. కాని అలా జరగలేదు. ప్రభుత్వ మౌనం రెజ్లర్లకు పుండు మీద కారం చల్లినట్లయింది. రోడ్డెక్కారు రాత్రింబవళ్లు నిరాహారదీక్షలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పోరాటం చేస్తున్నారు. పోలీసులు అడుగ డుగునా కట్టడి చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు కానీ అదే దేశవ్యాప్తంగా రెజ్ల సమస్యలపై చర్చ జరగడానికి వారికి మరింత నైతిక బలం అందడానికి కారణం అయింది.

ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్‌భూషణ్‌ బీజేపీ లోక్‌సభ సభ్యుడు. పార్టీ లో 1988 నుంచి కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బలమైన నాయకుడిగా చెలామణి అవుతున్నారు. 1991, 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మూడుసార్లు బీజేపీ టిక్కెట్‌పై గెలిచి ఎంపీగా ఉన్నారు. 2008లో బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌ మీద కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి మళ్లి బీజేపీలో చేరారు. 2019లో 17వ లోక్‌సభకు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కనీసం వంద విద్యా సంస్థలు నడుపుతూంటారు. తన ప్రాంతంలో పార్టీల కన్నా మిన్నగా ఆయన పలుకుబడి సాధించారు. అంచే కాదు కరుడు గట్టిన నేరస్తుడు కూడా. అతని మీద అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆధారపడదగ్గ అతి కొందరు నేతల్లో బ్రిజ్‌ ఒకరు. అందుకే అతని మీద ప్రభుత్వం వైపు నుంచి ఈగ కూడా వాలడం లేదు. రెజ్లర్లకు నానాటికీ సంఘీభావం పెరుగుతున్నా సానుభూతి వెల్లువ అవుతున్నా కదలాల్సిన వ్యవస్థలు మాత్రం కదలడం లేదు.

ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏడుగురు సభ్యులతో వేసిన విచారణకు కమిటీ నియమించింది. మేరీ కోమ్‌తో సహా ఇందులో అందరూ అథ్లెట్లే ఉన్నారు. బ్రిజ్‌ భూషణ్ గత ఫిబ్రవరి చివర్లో ఆ కమిటీ ముందు హాజరయ్యారు. మిగతా కథ సస్పెన్స్‌. మరోవంక ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. బ్రిజ్‌ మీద చర్య తీసుకునేందుకు ఎలాంటి ఆధారాలు దొరకడం లేదని పోలీసులు చేతులెత్తేశారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభొత్సవ వేళ రెజ్లర్లు ధర్నా చేయబోతే పోలీసులు అడ్డుకున్నారు. పతకాలు తెచ్చినప్పుడు ఘనంగా కీర్తించి శాలువలు కప్పి సత్కరించే ప్రభుత్వమే వారికి ఎదురైన సమస్యను పరిష్కరించడానికి వెనకాడటం ప్రజల్ని సైతం విస్మయపరుస్తోంది. తమకు ఏ సమస్యలు లేకుండా ఉత్తి పుణ్యాన తమ బ్రిజ్ భూషణ్‌పై వారు వ్యతిరేకత పెంచుకుంటారా. లైంగిక వేధింపులకు సాక్ష్యాలు ఎలా వస్తాయన్న అంశాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. రెజ్లర్లకు అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రజలు, క్రీడాకారులు కూడా. కానీ బీజేపీ ప్రభుత్వమే ఆందోళన చేస్తున్న వారిని శత్రువులుగా చూస్తోంది. యూపీలో గ్యాంగ్ స్టర్లను నడిరోడ్డుపై కాల్చేస్తారు కానీ బీజేపీలో ఉండేవారిని కాదు. బ్రిజ్ భూషణ్ లాంటి వారిపై ఈగ కూడా వాలనీయరు. దేశానికి గర్వకరాణంగా నిలిచిన భేటీల విషయంలోనూ అంతే. మన రాజకీయం తప్పు చేసినా మన వాడు అనుకున్నంత కాలం ప్రజలకు ముఖ్యంగా బాధితులకు న్యాయం జరగడం అసాధ్యమే. దానికి ఈ మహిళా రెజ్లర్ల ఆవేదనే సాక్ష్యం.