చంద్రబాబుకు బీఆర్ఎస్ గాలం

By KTV Telugu On 3 November, 2023
image

KTV TELUGU :-

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పైగా ఎన్నికల వేళ ఏది జరిగినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. తెలంగాణ రాజకీయాలు చూస్తే ఇప్పుడు అవే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఓట్ల కోసం బీఆర్ఎస్ పాటిస్తున్న వ్యూహాల్లో టీడీపీని మంచి చేసుకోవడం కూడా ఒకటని చెప్పక తప్పదు. చివరకు చంద్రబాబుతో   నేరుగా కాంటాక్ట్ లోకి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ ప్రయ్తనిస్తున్నట్లుగా కొత్తగా వార్తలు వచ్చాయి…..

టీడీపీ అంటే బీఆర్ఎస్ కు ఒకప్పుడు అసలు పడేది కాదు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పటి దాకా అదే పరిస్థితి ఉంది. చంద్రబాబును అరెస్టు చేసిన తొలి నాళ్లలో తెలంగాణ గడ్డపై  నిరసనలను కేటీఆర్ వ్యతిరేకించారు. ఇక్కడ అలాంటి కార్యకలాపాలు వద్దని సెటిలర్లను  వారించారు. కాకపోతే రెండు మూడు రోజులకే పరిస్థితి మారింది. కేటీఆర్ స్టేట్ మెంట్స్ తో ఎన్నికల వేళ పార్టీకి నష్టమని బీఆర్ఎస్ గుర్తించింది. అంతే నేతలు ఒక్కరొక్కరుగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వచ్చారు. వారిలో మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలైన వెంటనే కూడా కొందరు నేతలు హర్షం వ్యక్తం  చేశారు. బాబును అన్యాయంగా అరెస్టు చేశారని ఇప్పుడు రిలీఫ్ వచ్చిందని వారన్నారు.

ప్రస్తుతానికి  తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పరంగా  కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతోందని రాజకీయ  వర్గాల్లో వినిపిస్తున్న మాట. నర్మగర్భంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చే  ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు. బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. పైగా చంద్రబాబు అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని  హితవు పలికారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపుకు  టీడీపీ వెళ్లకుండా ఆపాలన్నది బీఆర్ఎస్ ప్లాన్.  టీడీపీ ఒక నిర్ణయానికి వస్తే సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోయి తమకు కష్టకాలం తప్పదని భావిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన  చంద్రబాబును మంచి చేసుకునే చర్యల్లో భాగంగా ఆయన్ను పరామర్శించేందుకు ఒక సీనియర్  నాయకుడిని  పంపాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఎవరిని పంపాలనే దానిపై తర్జన భర్జనలు పడుతోంది. నేరుగా మంత్రి కేటీఆర్ ను పంపాలా లేక… వేరెవరినైనా పంపాలా అన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ కు వెళ్లేందుకు ఇబ్బందయితే స్థానిక ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీలను పంపే  విషయం పరిశీలనలో ఉంది. ఎవరెళ్లినా చంద్రబాబు అరెస్టయినప్పుడు బీఆర్ఎస్ నేతల వైఖరికి వివరణ ఇవ్వాలన్న డిసైడైనట్లు చెబుతున్నారు. సైబరాబాద్లో ఐటీ ఉద్యోగులు నిరసన ప్రకటించినప్పుడు పోలీసులు తొందరపడ్డారని చంద్రబాబుకు సారీ చెప్పే చాన్స్ కూడా ఉంది.

ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రత్యర్థి పార్టీలకు టీడీపీ  చెమటలు పట్టిస్తోంది. జగన్ కు బీఆర్ఎస్ మిత్రపక్షమని తేలిన నేపథ్యంలో ఆ పార్టీని తెలంగాణలోని టీడీపీ మద్దతుదారులతో పాటు ఆంధ్రా సెటిలర్స్ వ్యతిరేకిస్తున్నారన్న వాదన బలంగా ఉంది. తాజా పరిణామాలు కూడా ఆ అనుమానాలను నిజం చేస్తున్నాయి. పైగా చంద్రబాబుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని వైపుల నుంచి నరుక్కు వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు  ఒక్క సారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ సానుభూతిపరులను కాంగ్రెస్ వైపుకు లాక్కోవడమెలాగో రేవంత్ రెడ్డికి బాగానే తేలుసు. పరిస్థితి అక్కడి దాకా రాకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకు  చంద్రబాబును కలవడమొక్కటే కాదు..టీడీపీ వాళ్లు ఏదైనా డిమాండ్లు పెట్టినా వాటిని  నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి