ఇండియన్‌ డ్రగ్స్‌ని బ్యాన్‌ చేసే పరిస్థితొస్తుందా?

By KTV Telugu On 5 February, 2023
image

ఒక్క నివేదిక అదానీ సామ్రాజ్యాన్ని కూల్చేసింది. వేలమంది ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. విశ్వాసం సన్నగిల్లితే పర్యవసానాలు అలాగే ఉంటాయి. విదేశాల్లో మన ఔషధాలు కూడా శల్యపరీక్షకు నిలుస్తున్నాయి. వెయ్యి సంస్థల్లో ఒకటే కావచ్చు. కానీ ఆ డ్రగ్‌మీద మేడిన్‌ ఇండియా ముద్రని ఎవరూ చెరిపేయలేరు. ఆ డ్రగ్‌తో జరిగిన అనర్ధం ఆ కంపెనీకే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే అనుమానంగా చూసేలా చేస్తుంది. ఆ మధ్య ఆఫ్రికాలో మన దగ్గుమందు చిన్నారుల ప్రాణాలు తీస్తే ఇప్పుడు మన ఐడ్రాప్స్‌ ఇన్‌ఫెక్షన్‌కి కారణమయ్యాయి. భారత్‌లో తయారైన ఐడ్రాప్స్‌తో ఇన్‌ఫెక్షన్‌ సోకుతోందని అమెరికా తమ రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో ఇండియాకి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌ కేర్‌ తన తయారీ మందులను రీకాల్‌ చేసింది. ఎజ్రీకేర్‌, ఎల్‌ఎల్‌సీ, డెల్సమ్‌ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ డ్రాప్స్‌తో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55మంది బాధితులయ్యారు.

ఒకరు బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ప్రాణాలు కోల్పోయారు. కొందరు దృష్టి కోల్పోవటంతో అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు భారత్‌ తయారీ కాఫ్‌ సిరప్‌లు కారణమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేయటం మనమీదున్న నమ్మకాన్ని దెబ్బతీసింది. 33ఏళ్ల అనుభవమున్న మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన కాఫ్‌ సిరప్‌లే హానికారకమని డబ్ల్యుహెచ్‌వో తేల్చింది. ప్రధాని గొప్పగా చెప్పినట్లు మనదేశం ప్రపంచ ఫార్మసీనే. కోవిడ్‌ మహమ్మారి వణికించినప్పుడు కూడా మన టీకాలే ప్రపంచదేశాలకు భరోసా ఇచ్చాయి. జెనెరిక్ మందుల తయారీలో భారతీయ కంపెనీలకు మంచి పేరుంది. ప్రపంచదేశాలకు చౌకధరలకే ఔషధాలు ఎగుమతిచేసే దేశంగా మనకో గుర్తింపు ఉంది. అయితే అప్పుడప్పుడూ మన మందులు ప్రాణాలు తీస్తుండటం మన నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలకు కారణమవుతోంది. దేశంలో దాదాపు 3వేల కంపెనీలు 10వేలకు పైగా ఫ్యాక్టరీల్లో జెనెరిక్ ఔషధాలు ఉత్పత్తి చేస్తున్నాయి.

అమెరికాలో విక్రయించే దాదాపు 40 ఓవర్ ద కౌంటర్, జెనిరిక్ మందులు మన దేశంనుంచే వెళ్తుంటాయి. బ్రిటన్‌లో 25 శాతం మన ఔషధాలే. కాసుల కక్కుర్తితోనో అలవిమాలిన నిర్లక్ష్యంతోనో మన పరువు పోయేందుకు కొన్ని కంపెనీలు కారణమవుతున్నాయి. 2013లో ర్యాన్‌బాక్సీ లేబరేటరీస్‌కు అమెరికా 500 మిలియన్ డాలర్ల ఫైన్‌ విధించింది. చాలా భారత కంపెనీలు గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ నిబంధనలను పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. దేశంలోని చాలా డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌లో కీలకమైన పరికరాలే లేవన్నది నమ్మక తప్పని నిజం. గాంబియా పిల్లల మరణాల తర్వాత జాగ్రత్తపడటం ఐడ్రాప్స్‌ అనర్ధాల తర్వాత చర్యలకు పూనుకోవడం కాదు. తయారయ్యే ప్రతీ ఔషధం అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. అతిక్రమిస్తే ఎంతటివారిపైనయినా కొరడా ఝుళిపించాలి. లేకపోతే ప్రపంచదేశాల్లో మనకున్న విశ్వసనీయతను మనమే పోగొట్టుకున్నవాళ్లమవుతాం.