మాయావతి వారసుడికి సవాళ్ల స్వాగతం

By KTV Telugu On 13 December, 2023
image

KTV TELUGU :-

రాజకీయాల్లో మరో వారసుడొచ్చాడు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు  ఆకాశ్ ఆనంద్ కు బెహన్జీ ఫుల్ పవర్స్ ఇచ్చారు. మంచి ముహుర్తం చూసుకుని ఆమే పట్టాభిషేకం చేస్తారని చెబుతున్నారు. ఆనంద్  మాయావతికి మేనల్లుడు. తనకు వయసైపోతుందనుకున్నారో… ఇక తిరగలేనని అనుకున్నారో బహుజన సమాజ్ పార్టీ పగ్గాలు ఆనంద్ కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైగా స్వయంగా వారసత్వ  రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.

ఆకాశ్ ఆనంద్ ఐదారేళ్లుగా క్రియాశీలంగా ఉంటున్నారు. మాయవతి  సోదరుడి కుమారుడైన 28 ఏళ్ల ఆనంద్  బీఎస్పీలో చిరపరిచితుడే. అందరితో  కలిసిపోయి పార్టీ పనులు  చేసుకుంటూ  వస్తున్నారు. 2017 మొదటి సారి ఆయన రాజకీయ వేదికపై కనిపించారు. యూపీ మహాకూటమి  తరపున షారాన్పూర్ నగరంలో జరిగిన ర్యాలీలో  తొలిసారి దర్శనమిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ  అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ తో కలిసి  వేదిక పంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ కీలక భూమిక వహించారు. అప్పట్లో మాయావతి ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఆకాశ్ ఆనంద్ రంగంలోకి దిగి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆకాశ్ ఆనంద్ మూడు రాష్ట్రాల ఇంఛార్జ్ గా వ్యవహరించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు.

ఆకాశ్ ఆనంద్ ను మాయావతి పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు చూసుకోవాలని ఆదేశించారు. దానితో ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ గల్లీ వరకు ఆయన నాలుగైదేళ్లుగా అన్ని రాజకీయాలు అధ్యయనం చేశారు. దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మతపరమైన  మైనార్టీల సంక్షేమం కోసం  పార్టీ  ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి సంబంధించిన అనేక ప్రతినిధివర్గాల్లో ఆయనకు భాగస్వామ్యం ఇచ్చారు.

ఆనంద్ విద్యాధికుడే. లండన్లో ఎంబీఏ చేశారు. ప్రపంచ జ్ఞానం ఉన్న యువనాయకుడు. 2019లో తాను ప్రసంగించిన తొలి సదస్సులోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సభ ఆగ్రాలో జరిగింది. పార్టీ విధానాల్లో సమూల మార్పులకు కూడా జాతీయ సమన్వయకర్తగా ఆకాశ్ ఆనంద్ శ్రీకారం చుట్టారు. ఇంతవరకు పాదయాత్రలకు బీఎస్పీ వ్యతిరేకం. ఈ ఏడాది ప్రారంభంలో సర్వజన్  హితయ్ సర్వజన్ సుఖయ్ సంకల్ప్ యాత్రను ఆయన 14 రోజుల పాటు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలకు బీఎస్పీని సమాయత్తపరిచే దిశగా ఈ యాత్ర జరిగింది. బాబా సాహెజ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేయడమే తన ధ్యేయమని ఆకాశ్ ఆనంద్ చెప్పుకుంటారు. విద్యా, సమానత్వం, సాధికారతే బీఎస్పీకి మూడు మూల సూత్రాలని మాయావతి  వారసుడు కొత్త నిర్వచనాన్ని అందుకున్నారు. ఒకప్పుడు రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్లో బీఎస్పీని గట్టిగా నిలబెట్టే బాధ్యతను ఆకాశ్ ఆనంద్ తీసుకోవాల్సి ఉంటుంది. 405 మంది ఎమ్మెల్యేలుండే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీని బీఎస్పీ ఒకప్పుడు ఊపేసిన మాట వాస్తవం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 206 స్థానాలు సాధించి మాయావతి సీఎం అయ్యారు. 2012లో కేవలం 80 స్థానాలుు సాధించి అధికారాన్ని కోల్పోయింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా రాలేదు. 2017 అసెంబ్లీ  ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి 22 శాతం ఓట్ షేర్ వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ మహాకూటమికి 15 స్థానాలు దక్కాయి. అప్పుడు బీఎస్పీ ఓట్ షేర్ 19 శాతానికి తగ్గింది.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక అసెంబ్లీ సీటు వచ్చింది. ఓట్ షేర్ 13 శాతానికి పడిపోయింది. నానాటికి దిగజారుతున్న బీఎస్పీ బలాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆకాశ్ ఆనంద్ ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే మాయావతి మొదటి నుంచి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే చెప్పాలి. కాంగ్రెస్ లో వారసత్వాన్ని ఆమె తరచూ  విమర్శించేవారు. ఇప్పుడు మాత్రం బీఎస్పీలో తన  మేనల్లుడినే వారసుడిగా ప్రకటించారు. బహుశా  పార్టీని కాపాడుకోవడానికి ఆమెకు వేరే  మార్గం కనిపించలేదేమో…

బీఎస్పీ ఇప్పుడు రాజకీయ కూడలిలో నిల్చుంది. ఎటు వైపుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. పార్టీని చేయి పట్టుకుని నడిపించాల్సిన బాధ్యత యువ నాయకుడిపై  ఉంది. ఆకాశ్ ఆనంద్ ఐదారేళ్లుగా రాజకీయాలను అర్థం  చేసుకుంటున్నందున సరైన మార్గంలో  పార్టీని  తీసుకెళ్లే అవకాశాలున్నాయి. దళిత ఉద్యమాన్ని  కూడా ఆయన దివిటీ పట్టుకుని నడిపించాలి, చూడాలి మరి ఏమవుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి