అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకందని అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచ గతిని పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను సమూలంగా మార్చేయబోతోంది. ఈమధ్యే అందుబాటులోకి వచ్చిన ‘చాట్ జీపీటీ’ ఆ అద్భుతాల్లో ఒకటి. అమెరికాకు చెందిన ‘ఓపెన్ఏఐ’ సంస్థ ఈ ఈ యాప్ ను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే చాట్ జీపీటీకి సంచలనం సృష్టిస్తోంది. దీనిపట్ల లక్షల మంది యూజర్లు ఆకర్షితులవుతున్నారు. 2 నెలల్లోనే 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు. జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లను ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంటర్ నెట్ స్పేస్ లో గత 20 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ చాట్ జీపీటీ వినియోగదారులకు దగ్గరవుతోందని నిపుణులు అంటున్నారు.
వంద మిలియన్ల మార్క్ చేరుకోడానికి ఇన్‌స్టాగ్రామ్ కు రెండున్నర ఏళ్లు, టిక్ టాక్ కు 9 నెలలు పట్టింది.
2022 డిసెంబర్‌లో చాట్ జీపీటీని అందుబాటులోకి వచ్చింది. ఇది బ్రౌజర్ పై పనిచేసే టూల్. ఇది ఆర్టిపీషియల్ ఇంటెలెజెన్స్ తో పనిచేస్తుంది. దీని ద్వారా మనిషి చేయగలిగే పనులను అచ్చం మనిషిలాగే చేయగలిగే వీలుంటుంది. కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులు గుర్తించి తొలగించడం, సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కథలు రాయడం వంటివి చేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాసిపెడుతుంది. అలాగే పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. పాటలు కూడా రాస్తుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్ తయార చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం అడిగే ప్రశ్నలకు ఒక మనిషిలాగా ఆలోచించి సమాధానాలు ఇస్తుంది. క్షణాల్లో
ఇంటర్నెట్ మొత్తం శోధించి మనం అడిగిన వివరాలు మన ముందుంచుతుంది.
వికీపీడియా, దేశ విదేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సేకరిస్తుంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలను క్షణాల్లో టెక్స్ట్ రూపంలో అందిస్తుంది. అచ్చం మనిషిలాగా ఆలోచించే ఈ చాట్ జీపీటీ పనితనం చూస్తుంటే త్వరలో ఇది మనుషులనే మించిపోతుందేమోననే భయాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఈ చాట్ జీపీటీ దూకుడు చూసి గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్ దిగ్గజ సంస్థల్లో ఆందోళన మొదలైంది. దీన్ని తలదన్నే విధంగా కృత్రిమ మేధ గల వెబ్‌సైట్ రూపొందించాలని గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా యూజర్ల కోసం ఓపెన్ఏఐ ఇటీవల చాట్ జీపీటీ ప్లస్ మోడల్‌ను తీసుకొచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే చాట్ జీపీటీ ప్లస్ అందుబాటులో ఉంది. పీక్ టైమ్ లోనూ యూజర్లు దీని సేవలను ఉపయోగించుకోవచ్చు. ముందు ముందు ఈ చాట్ జీపీటీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలి.