కమాన్ పిల్లల్ని కనండి.! చైనాలో కొత్త జంటలకు బంపర్‌ ఆఫర్‌

By KTV Telugu On 25 February, 2023
image

అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనాది మొదటి స్థానం. ప్రస్తుతం ఆ దేశ జనాభా 145 కోట్లు. జనాభా పెరిగితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికీ తెలుసు. కానీ చైనా కు ఇప్పుడున్న జనాభా సరిపోవడం లేదంట. ఇంకా పిల్లల్ని కనండి అని కొత్త దంపతులను ఎంకరేజ్‌ చేస్తోంది. వారికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది. గతంలో జనాభా పెరుగుదలను కట్టడి చేయడం కోసం 1980 నుంచి 2015 వరకు అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసింది చైనీస్‌ ప్రభుత్వం. వన్‌ ఆర్‌ నన్‌ అనే కాన్సెప్టుతో ఒక్కరికంటే ఎక్కువ సంతానం ఉండకూడదని ఆదేశించింది. అయితే దీర్ఘకాలంలో వన్ చైల్డ్‌ పాలసీ వల్ల అక్కడి ప్రభుత్వం ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. మేల్‌ ఫిమేల్‌ సెక్స్‌ రేషియా తలకిందులైపోయింది.

కమ్యూనిస్టు దేశమైన చేనాలో కూడా ఆడ పిల్లల పట్ల వివక్ష ఉంది. తల్లిదండ్రులు మగపిల్లాడే కావాలని కోరుకోవడంతో క్రమంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అంతేకాదు కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్లు చేయించుకోవడం సర్వసాధారణ తంతుగా మారింది. చివరికి దేశ జనాభాలో యువత తగ్గిపోయి వృద్ధుల శాతం పెరిగిపోయింది. ఏ దేశానికైనా మానవ వనరులే పెద్ద ఆస్తి. కానీ జనాభా నియంత్రణ వల్ల ఆ దేశంలో మానవ వనరులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొందరు కొందరు పిల్లలను కనడమే మానేశారు. ఫలితంగా చైనా జనాభా గణణీయంగా తగ్గింది. గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. ఆరు దశాబ్ధాలలో తొలిసారి గతేడాది చైనాలో అత్యల్ప జనన రేటును నమోదు చేసింది.

వన్‌ చైల్డ్‌ పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం తన పాలసీని సవరించింది. పెళ్లయిన దంపతులు ఒకరికంటే ఎక్కువ సంతానం కనొచ్చని 2016 నుంచి అనుమతి ఇచ్చింది. అయినా వారు ఆశించిన మార్పు కనిపించలేదు. జననాల రేటు ఆశించినంత పెరగలేదు. దాంతో 2021లో దంపతులు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని పేర్కొంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పిల్లలను కనండి అని దంపతులను ప్రోత్సహిస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఎంజాయ్‌ చేయడం కోసం నెల రోజులు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తోంది. సాధారణంగా చైనాలో వివాహం చేసుకున్నవారికి మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ వల్ల 30 రోజులు సెలవులు ఇవ్వడంతో పాటు ఆ నెల జీతం కూడా చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్‌ వల్ల జననాల రేటు పెరుగుతుందని చైనా ప్రభుత్వం ఆశిస్తోంది.