కప్పలు, కుక్కలు, పాములు, పురుగులు ప్రాణమున్న ఏ జీవినైనా తిని బతికేసే చైనా ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిపోతోంది. కరోనా పుట్టినిల్లుగా పేరున్న డ్రాగన్ కంట్రీ మరోసారి ఆ వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జెట్ స్పీడ్‌తో అక్కడ వైరస్ వ్యాపిస్తోంది. కొన్నాళ్లలోనే దేశంలోని 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్-7తో పాటు మరో మూడు వేరియంట్లు ఈ తీవ్రతకు కారణమని గుర్తించారు. కోవిడ్-19 విజృంభణతో కొత్త వేరియంట్ల పుట్టుకకు చైనా బలమైన కేంద్రంగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతొ ప్రపంచమంతా పెను ప్రమాదం పొంచి ఉంది.
వైరస్ ప్రమాదాన్ని చైనా ముందే గ్రహించింది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యల విషయంలో కాస్త అతి చేసింది. బాధితులను కరడుగట్టిన ఖైదీల్లా బంధించింది. ఎంత క్రమశిక్షణ ఉన్న దేశమైనా ఈ ఒత్తిడిని చైనా ప్రజలు భరించలేకపోయారు. ప్రాణాలు పోతేపోయాయని నిరసలనకు దిగారు. చివరికి ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి చైనా మంగళం పాడేసింది. జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తేసింది. రోజువారీ కోవిడ్ నివేదికలను కూడా ఇప్పుడు బయట పెట్టటం లేదు. దీంతో ఎందరికి సోకుతోందో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో దేనికీ లెక్కలేదన్నమాట!
వ్యాక్సినేషన్ విషయంలో చైనా విఫలమైంది. దీంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. దీంతో వైరస్ బాధితుల్లో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనానే మరోసారి కేంద్ర బిందువుగా మారబోతోంది. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. కొద్ది నెలల్లోనే 500కుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించారు. అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని తెలుసుకోవడం కష్టం అంటున్నారు. చైనా రాకపోకలపై ఆంక్షలు పెట్టినా వైరస్ ఆదేశ సరిహద్దుల దగ్గరే ఆగిపోదు. ఏదోలా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. చైనా తప్పులకు యావత్ ప్రపంచం భయపడాల్సి వస్తోంది.