కరోనా అనంతర పరిణామాలు, చైనాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, కోవిడ్ కొత్త రకాలు ఇలా అనేక రకాల సమస్యల పేరుతో చైనా పని అయిపోయిందని ప్రపంచం అంతా ప్రచారం జరుగుతోంది. చైనా నుంచి అందరూ పెట్టుబడులు తరలించ్సుతన్నారని చెప్పుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే ఇంకేముంది చైనా నుంచి వెనక్కి వచ్చే పెట్టుబడులు చైనాకు వెళ్లాలనుకునే పెట్టుబడులు అన్నీ ఇండియాకే వరదలా వస్తాయని చెప్పుకున్నారు. కానీ నిజంగా చైనాలో ఆ పరిస్థితి ఉందా ? అక్కడ రియాలిటీ ఏంటి ?
ప్రపంచంలో నాలుగు అతి పెద్ద బ్రాండ్లు ఆపిల్, అడిడాస్, వాల్ మార్ట్, నైకీ. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఈ బ్రాండ్ల అమ్మకాలు ఉంటాయి. కానీ ఈ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని తయారు చేసేది మాత్రం చైనాలోనే. ఎక్కడ హెడ్ ఆఫీస్ ఉన్నా ప్రొడక్ట్ డిజైన్స్ ఎక్కడ చేసినా ఉత్పత్తి మాత్రం చైనాకే ఔట్ సోర్సింగ్‌కు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే వాల్ మార్ట్ ఉత్పత్తుల్లో 70 శాతం చైనాలోనే తయారవుతాయి. యాపిల్ ఐ ఫోన్స్ 75 శాతం, నైకీ 46 శాతం, అడిడాస్ పాతిక శాతం ఉత్పత్తులు చైనాలోనే తయారవుతాయి. కోవిడ్ ముందు తర్వాత కూడా ఎలాంటి పరిస్థితుల్లో మార్పులు రాలేదు. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తి ప్లాంట్లను చైనా నుంచి తరలించాలని అనుకోవడం లేదు.
ప్రస్తుతం ప్రపంచంలో చైనాకు అంత మంచి ఇమేజ్ లేదు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. అక్కడ ఉగర్ ముస్లిమ్స్ మీద దారుణాలు జరుగుతూంటాయి. ప్రపంచం మొత్తం విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. జీరో కోవిడ్ విధానం పేరుతో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడ బాండెడ్ లేబర్ విషయంపై మానవహక్కుల సంఘాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. కమ్యూనిస్టు ప్రభుత్వ నిర్ణయాలపై అక్కడ తరచూ ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఇన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ చైనా ఇప్పటికీ ప్రపంచానికి ” ఫ్యాక్టరీ “గానే ఉంది. చైనా నుంచి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్ ఒక్కటీ తరలి వెళ్లే ఆలోచన చేయడం లేదు.
కొంత కాలంగా మల్టినేషనల్ కంపెనీలు చైనా నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. పెట్టుబడుల ప్రణాళికలు తగ్గించుకోవడం లేదా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలపై ఆలోచన చేస్తున్నాయని చెబుతూంటారు. కానీ నిజంగా అలా జరుగుతోందా అన్నది లెక్కలను చూస్తే అర్థమైపోతుంది. చైనాకు విదేశీ పెట్టుబడులు 26.1 శాతం పెరిగాయి. 2022లో 74.7 బిలియన్ల విదేశీ పెట్టుబడి చైనాకు వచ్చింది. అంటే ఏ మాత్రం తగ్గకపోగా ఇరవై ఆరు శాతం పెరిగిందన్నమాట. అసలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంలో చైనాలో ఓ ప్రఖ్యాత సంస్థ పెట్టుబడిదారుల నుంచి అభిప్రాయసేకరణ జరిపింది. చైనా నుంచి పెట్టుబడులు తరలించాలనే ఆలోచన వచ్చిందా అని తెలుసుకుంటే 75 శాతం మంది తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు. ఇక మల్టీనేషనల్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెంచుతున్నాయి కూడా.
ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా తన స్థానాన్ని ఎన్ని సవాళ్లు ఎదురైనా కాపాడుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
1. చైనాలో తయారీ ఖర్చు చాలా తక్కువ. ప్రపంచ ప్యాక్టరీగా చైనా ఉండటానికి మఖ్య కారణాల్లో ఒకటి తయారీ ఖర్చు తక్కువ కావడం. అక్కడ అన్ని రకాల ముడిపదార్థాలు తక్కువకే లభిస్తాయి.
2. చైనాలో శ్రామిక శక్తి ఎక్కువ. చైనాలో జనాభా ఎక్కువ. వారిలో శ్రామికులు కూడా ఎక్కువ. ఎంత మంది సిబ్బంది కావాలంటే అంత మంది లభిస్తారు. వారికి జీతాలు కూడా తక్కువే. ఈ కారణంగా కంపెనీలు చైనా వైపు దృష్టి సారిస్తున్నాయి.
3. చట్టాలు కూడా అనుకూలంగా ఉంటాయి. చైనా అంటే కఠిమైన చట్టాలు అనే ప్రచారం ఉంది. కానీ చైనా ప్రభుత్వం పారిశ్రామిక విధానం చాలా సరళంగా అమలు చేస్తుంది. చట్టాలను కఠినంగా అమలు చేయదు. అనేక రకాల మినహాయింపులు చట్ట పరంగా వెసులుబాటు ఉంటుంది. కార్మిక కట్టాలు కూడా అంత బలంగా ఉండవు.
4. తయారీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం. అనుమతులు పర్యావరణం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించదు. చట్ట పరంగా వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఉండేది కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి లంచాలు అనే మాటే వినిపించదు.
అంతే కాదు మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్స్ చైనాలోనే పెట్టుబడులు పెట్టడానికి అక్కడ్నుంచి వెనక్కి రాకుండా ఉండటానికి మరో ప్రధాన కారణం అక్కడ ఉన్న మార్కెట్. చైనాలో తయారీ మాత్రమే కాదు అక్కడ అమ్మకాలు కూడా మల్టీ నేషనల్ కంపెనీలకు కీలకం. చైనాలో తయారీ వలన సులువుగా మార్కెట్‌ను ను విస్తరించుకునే వెసులుబాటు ఉంటుంది. చైనాలో 1.4 బిలియన్ పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు. చైనాలో అన్ని మల్టినేషనల్ బ్రాండ్స్ తమ పెట్టుబడులను పెంచడంతో పాటు లాభాలనూ పెంచుకుంటున్నాయి. స్టార్ బక్స్ ఇటీవలే ఆరు వేల స్టోర్స్ మైలురాయిని చైనాలో అందుకుంది. చైనాలో యాపిల్ ఫోన్ల మార్కెట్ వాటా పాతిక శాతం. బీఎండబ్ల్యూ, ఫోక్స్ వ్యాగన్ వంటి కార్ల అమ్మకాలూ చైనాలో చాలా ఎక్కువ. సౌందర్య సాధనాల ఉత్పత్తుల మార్కెట్ కూడా చైనాలో పెరుగుతూనే ఉంది. ఎల్ ఓరియల్ ఎప్పటికప్పుడు మార్కెట్ ను లాభాలను పెంచుకుంటూనే ఉంది.
అంటే ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనాను దాటడం ఇతర దేశాలకు అంత సులువు కాదని అర్థం చేసుకోవచ్చు.