చైనా టూ సింగపూర్‌.. కుబేరుల వలసలు షురూ

By KTV Telugu On 4 February, 2023
image

ప్రభుత్వ విధానాలు బావుంటే పరిశ్రమలు వస్తాయి. సురక్షితమని భావిస్తే సంపాదించింది అక్కడే ఖర్చుపెడుతుంటారు. వ్యాపార విస్తరణకు చొరవచూపిస్తారు. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉంటే తట్టాబుట్టా సర్దేసుకుంటారు. మరోచోట కొత్త పెట్టబడులు పెడతారు. సంపాదించుకుంది జాగ్రత్తచేసుకునే పనిలో పడతారు. చైనాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. చైనా కుబేరుల్లో అపనమ్మకం పెరుగుతోంది. వ్యాపారాలకు, పెట్టుబడులకు ఇక తమ దేశం ఎంతమాత్రం సురక్షితం కాదనుకుంటున్నారు. అందుకే చలో సింగపూర్‌ అంటున్నారు.
అలీబాబా గ్రూప్‌పై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కత్తిగట్టింది. ప్రభుత్వ విధానాలను, బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడమే జాక్‌మా చేసిన నేరం. దీంతో ఆయన వ్యాపారాలపై డ్రాగన్‌ కంట్రీ ఉక్కుపాదం మోపింది. దాంతో భారీగా సంపదను నష్టపోయిన అలీబాబా గ్రూప్‌ అధినేత చైనాని విడిచిపెట్టి జపాన్‌లో తలదాచుకుంటున్నారు. జాక్‌మాకి ఎదురైన అనుభవంతో చైనా కుబేరులు స్వదేశంలో వ్యాపారాలు చేయలేమన్న అభిప్రాయానికి వస్తున్నారు. పన్నుల విషయంలో ఉదారంగా ఉండే సింగపూర్‌ వైపు చూస్తున్నారు. అక్కడే తమ కుటుంబ కార్యాలయాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సంపాదించుకున్నదాంతో బతికుంటే బలుసాకు తినొచ్చనుకుంటూ సింగపూర్‌కి షిఫ్ట్‌ అవుతున్నారు.
జీరోకోవిడ్‌ పాలసీ కూడా చైనా వ్యాపారవర్గాల వలసకు కారణంగా చెప్పొచ్చు. చైనా ప్రభుత్వం సంపన్నులపై, పారిశ్రామికవేత్తలపై కఠినంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకే తమదాకా వచ్చేలోపే చైనా విడిచిపెడితే మంచిదనుకుంటున్నారు అక్కడి శ్రీమంతులు.
ఆరుదశాబ్దాలుగా సింగపూర్‌లో రాజకీయ అనిశ్చితి లేదు. ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. కార్మికుల సమ్మెలు, వీధుల్లో ఆందోళనలపై సింగపూర్‌లో నిషేధం ఉంది. పైగా సింగపూర్‌లో పన్నులమోత చాలా తక్కువ. అక్కడ ఉండేది కూడా ఎక్కువమంది చైనావాసులే. అందుకే సింగపూర్‌ని ఎంచుకుంటున్నారు. చైనానుంచి పారిశ్రామికవేత్తల వలసలతో సింగపూర్‌లో కుటుంబ కార్యాలయాలు పెరుగుతున్నాయి. 2020లో అక్కడ 400 ఉన్న కుటుంబకార్యాలయాలకు ఏడాది తిరిగేసరికి 700కు చేరాయి. త్వరలోనే ఈ సంఖ్య రెట్టింపు కాబోతోందని అంచనావేస్తున్నారు. కఠినంగా ఉంటే కాళ్లబేరానికి వస్తారని చైనా అనుకుంటే.. కుబేరుల వలసలతో అసలుకే మోసమొస్తోంది.