ప్రపంచంపై పెత్తనం కోసం జిత్తుల మారి జిన్ పింగ్ కుయుక్తులు పన్నుతూనే ఉన్నాడు. దొంగలాగా ఇతర దేశాల్లోకి అక్రమంగా చొరబడి వివరాలు సేకరించే కుట్రలు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న కోవిడ్‌తో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశారు. అంతటితో ఆగని కంత్రీ డ్రాగన్ చాటుమాటుగా ఎన్నో కుట్రలకు పాల్పడుతోంది. మబ్బుల చాటున నిఘా బెలూన్లతో ఆయా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని తస్కరిస్తోంది. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్ ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి.
ఇటువంటి బెలూన్ల సాయంతో డ్రాగన్ కొన్నేళ్లుగా నిఘా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చైనా నిఘాపెట్టిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ఇందు కోసం చైనా పురాతన పద్ధతులకు అత్యాధునిక సాంకేతికతను జోడించి నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేశాల సైనిక కదలికలను గమనిస్తోంది. హెయినన్ ప్రావిన్స్ కేంద్రంగా బెలూన్లతో చైనా నిఘా కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడి దక్షిణ తీరంలో వీటిని ఎగురవేసి భారత్ సహా పలు దేశాల్లో సైన్యం, ఆయుధాల మోహరింపులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు వాషింగ్టన్ పోస్టుకు తెలియజేశారు. ఈ బెలూన్ నిఘా కార్యక్రమం చైనా వాయుసేన ఆధీనంలో జరుగుతోందని చెబుతున్నారు. ప్రపంచంలోని ఐదు ఖండాల్లో ఇటువంటి బెలూన్లు కనిపించినట్లు వాషింగ్టన్ పోస్ట్ స్పష్టం చేసింది. గత వారం రోజులుగా హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది.
వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కొనసాగింపుగా అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు చైనా నిఘా బెలూన్ల వ్యవహారంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చైనా చేపట్టిన ఈ చర్య ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్ సంబంధిత ఎయిర్‌షిప్స్ తప్ప నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్. ముప్పు ఎదురైనప్పుడు తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతటి తీవ్రమైన చర్యలకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
చైనా ప్రయోగించిన బెలూన్ సుమారు 200 అడుగుల ఎత్తు ఉన్నట్లు సమాచారం. ఇది కొన్ని టన్నుల బరువును కూడా మోసేలా డిజైన్ చేశారు. సముద్రంలో దీనిని కూల్చిన ప్రదేశం నుంచి అమెరికా దళాలు శకలాలను సేకరిస్తున్నాయి. వీటిని చైనాకు తిరిగి ఇచ్చే ప్రశ్నేలేదని అమెరికా తేల్చిచెప్పింది. బెలూన్ సాంకేతిక సామర్థ్యాలు అది ఏ ఉపగ్రహాలతో అనుసంధానమైందనే విషయాలను అమెరికా నిర్ధారించే పనిలో ఉంది. అవసరమైతే మళ్లీ అందులోని పరికరాలను పునర్నిర్మించి బెలూన్ పనితీరును పరిశీలించనున్నారు. దీంతోపాటు బెలూన్ నిర్మాణానికి ఉపయోగించిన పరికరాల సప్లైచైన్‌ను కూడా అమెరికా అధికారులు గుర్తించనున్నారు. అమెరికాలోనే అత్యున్నత నిపుణులు పనిచేసే ఎఫ్‌బీఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ బృందం శకలాలను విశ్లేషించనున్నారు. దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిన శకలాలను అమెరికా నౌకాదళం జాగ్రత్తగా సేకరిస్తోంది.