ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం….

By KTV Telugu On 25 November, 2024
image

KTV TELUGU :-

దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసిబొట్టు నాగం బొట్టు అన్నట్లుగా తయారైంది. కొంచెం పుంజుకున్నట్లు కనిపించిన మరుసటి ఎన్నికలోనే ఆ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బ తగులుతోంది. రాహుల్ గాంధీ దూరం జరిగి మళ్లీ క్రియాశీలమైన నైపథ్యంలో పార్టీ ఏదో సాధిస్తుందని అనుకుంటే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే షాక్ తలిగింది. జార్ఖండ్ లో కూటమి గెలిచినప్పటికీ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి….

దేశంలో రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా చక్రం తిప్పుతున్న తరుణంలోనే ఈ ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వాయనాడ్ లోక్ సభా స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ ఘనవిజయం సాధించడం గాంధీ కుటుంబ అభిమానులకు ఆనందరక అంశం కావచ్చు. కర్ణాటకలో జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో దక్షిణాదిన హస్తం పార్టీ మరోసారి తన సత్తా చాటినట్లయ్యింది. ఉత్తరాదిన మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయింది…

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక కూటమిలోనూ, కాంగ్రెస్ ప్రత్యర్థి కూటమిలోనూ పోటీ చేశాయి. మహావికాస్ అఘాడీ పేరుతో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పోటీ చేశాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అఘాడీకి కేవలం 49 సీట్లు వచ్చాయి. అందులోనూ 107 చోట్ల అభ్యర్థులను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 13 శాతం లోపే అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయంగా ఎంత మేర దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ 81 అసెంబ్లీ స్థానాలుండగా… కూటమికి 56 సీట్లు వచ్చాయి. అందులో జేఎంఎంకు 34 స్థానాలు రాగా… కాంగ్రెస్ కు కేవలం 16 సీట్లు వచ్చాయి. హస్తం పార్టీ అక్కడ 30 చోట్ల పోటీ చేసింది. 16 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. నిజానికి బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమికి 24 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కు స్థానాలు పెరిగి ఉంటే ఎన్డీయే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఎన్డీయే పరువు కాపాడుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..పైగా జేఎంఎం ఓట్లు భారీగా కాంగ్రెస్ కు బదిలీ కావడం వల్లే పార్టీకి జార్ఖండ్ లో 16 స్థానాలు దక్కాయని చెబుతున్నారు..

లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉదాసీనత వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్రకు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేసినట్లు కనిపించలేదు. ఉద్ధవ్ ఠాక్రే వాపును చూసి తమ బలుపు అనుకుని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఉండిపోయినట్లు కనిపిస్తోంది. పైగా సీఎం అభ్యర్థి ఎవరో తేల్చాలంటూ ఉద్ధవ్ ఠాక్రే రోజు వారీ ప్రకటనలు ఇస్తున్న తరుణంలో ఆయన అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే గెలుపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూశాయి. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో దెబ్బతిన్న ఎన్డీయే కూటమి.. తర్వాతి కాలంలో క్షేత్రస్థాయి బలం పెంచుకునేందుకు ప్రయత్నించగా… కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో కనెక్షన్ వదులుకున్నట్లు విశ్లేషణలు వినిపించాయి…బలమైన ప్రాంతీయ పార్టీలను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయాలనుకుందని వినిపిస్తున్న మాట.కాంగ్రెస్ పార్టీ నేతల్లో చిత్తశుద్ధి కొరవడి… పక్కనోడి బలంపై గెలిచే ప్రయత్నం చేసింది. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి కొన్ని రాష్ట్రాల్లో గెలిచినట్లే మహారాష్ట్రలో కూడా విజయం సాధించాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. మరో పక్క జార్ఖండ్ లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి విజయం సాధించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. జేఎంఎం అత్యధిక స్థానాలు గెలుచుకున్నందునే కాంగ్రెస్ ఇప్పుడు అధికార కూటమిలో భాగస్వామి కాబోతోంది. జేఎంఎం కష్టపడితే కాంగ్రెస్ కొన్ని సీట్లు సాధించిందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ క్రమంలో మరో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ దక్షిణాది పార్టీ, బీజేపీ ఉత్తరాది పార్టీగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా కాంగ్రెస్ పుంజుకుని ఉంటే మిత్రపక్షాలైన ప్రాంతీయ ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలిగి ఉండేది. ఆయా పార్టీలకు సీట్లు పెరిగి ఉండేవి. కానీ అలా జరగలేదు. అందుకే మునిగిన కాంగ్రెస్, ముంచిన కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి