కౌ హగ్‌.. ప్రేమికులతో గేమ్‌ ఆడితే ఇలాగే ఉంటుంది

By KTV Telugu On 14 February, 2023
image

ఎవడికొస్తాయోగానీ ఇలాంటి ఐడియాలు ఎవరి చెవుల్లోనే ఊదేస్తారు. సూపరో సూపర్‌ అంటూ వాళ్లు గుడ్డిగా వాకే అనేస్తారు. జనం చెడామడా తిట్టాక నాలిక కరుచుకుంటారు. ప్రేమికుల దినోత్సవానికి కేంద్రం ప్రతిపాదించిన కౌ హగ్‌ సోషల్‌మీడియాలో కామెడీ అయిపోయింది. ఏ కాలంలో ఉన్నారంటూ ట్రోల్స్‌తో నెటిజన్స్‌ విరుచుకుపడటంతో ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కితీసుకుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్‌ డే. ఏటా ప్రేమికులు ఈరోజు సరదాగా కలుసుకుంటారు. కొందరు పార్కుల వెంట తిరుగుతారు. సొమ్మున్నోళ్లు ఏ పబ్బులోనో గడుపుతారు. ఇది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకమంటూ ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేసేందుకు తాళిబొట్లతో బయలుదేరిన వారున్నారు. రాతియుగంనాటి భావజాలంతో దాడులుచేసిన అతివాదులు ఉన్నారు. ఎవడో తలకెక్కిన పైత్యంతో చేయకూడనిది చేస్తే నాలుగు తగిలించడానికి పోలీసులున్నారు. కానీ ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేస్తే మన ఆలోచనలు ఎటుపోతున్నట్లు. వాలంటైన్‌ డేని కౌ హగ్‌ డేగా జరపాలనుకుంది కేంద్రం. అంటే ఆవును కౌగిలించుకుని ప్రేమను ప్రదర్శించాలన్నమాట.

కేంద్ర జంతు సంక్షేమ బోర్డు అఫీషియల్‌గా నెలముందే ఓ సర్క్యులర్‌ జారీచేసింది. కౌ హగ్‌ డే జరుపుకోవాలని చెప్పినప్పటినుంచీ కేంద్రంపై వచ్చిన ట్రోల్స్‌, మీమ్స్‌ అన్నీ ఇన్నీ కావు. వాస్తవానికి గోమాతను పూజించడం దాన్ని ప్రేమగా కౌగిలించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దాన్ని తప్పుపట్టేందుకేమీ లేదు. అయితే దాన్ని వాలంటైన్‌డేతో ముడిపెట్టాలన్న ఆలోచన తప్పు. వాలంటైన్‌డే కోసం ప్రేమజంటలు చూస్తుంటే మధ్యలో జొరబడటానికి కొన్ని సంప్రదాయిక శక్తులు చుట్టూ ఉంటాయి. ఏటా ఈ దాగుడుమూతల మధ్యే ప్రేమికుల దినం జరుగుతుంటుంది. కానీ ప్రేమను పంచుకోవాల్సిన రోజున ఆవును కౌగిలించుకోమని అధికారికంగా చెప్పడమే అసహ్యంగా ఉంది. కానీ సోషల్‌మీడియాల కేంద్రప్రభుత్వ నిర్ణయం కామెడీ అయిపోయింది. దీంతో నవ్వులపాలు కావడం ఇష్టంలేక కౌ హగ్ డేని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడుసు తొక్కడమెందుకు కాలు కడగడమెందుకు.