వసంతకాలంలో వచ్చే తొలి పౌర్ణమికి పింక్ మూన్ అని పేరు. అంటే చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని కాదు. వసంతకాలంలో అమెరికాలోని మెయినీ ప్రాంతంలో ఒక రకమైన అడవి జాతి మొక్కలకు గులాబీ రంగులో పూవులు వికసిస్తాయి. అమెరికాలోని పాత పంచాంగాల్లో ప్రతి పున్నమి చంద్రుడికి ఒక పేరు ఉంటుంది. కాని వాటిల్లో బాగా పాపులర్ అయింది మాత్రం పింక్ మూనే. అమెరికన్లు ఈ చంద్రుడిని పాస్ ఓవర్ మూన్ అని కూడా అంటారు. ఈస్టర్కు ముందు వచ్చే చంద్రుడని దానర్థం.
ఇండియాలో పింక్ మూన్ అంటే వసంత చంద్రుడు బుధవారం కనిపిస్తాడు. దాదాపు ఈ వారమంతా చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా 15శాతం ఎక్కువ ప్రకాశవంతంగా మురిపిస్తాడు. అందుకే ఆరోజున చందమామను సూపర్మూన్ అని పిలుస్తారు. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండే ఈ దశలో పన్నెండు రాశులపై చంద్రుడి ప్రభావం అనేక రకాలుగా ఉంటుంది. అయితే పింక్మూన్ డేంజర్ బెల్స్ మోగిస్తోందంటున్నారు జ్యోతిష్య పండితులు. మన భూమికి అతి దగ్గరగా వచ్చే పింక్ మూన్తో మనకు భయంకర ముప్పు తప్పదంటున్నారు.
పింక్ మూన్తో అనారోగ్యాలు పెరుగుతాయని వ్యాధులు ప్రబలుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది కాబట్టే పింక్ మూన్తో అల్లకల్లోలం తప్పదంటున్నారు వాళ్లు. మరోవైపు జ్యోతిష్య పండితులు ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో లెక్కలేసి చెబుతున్నారు. మేషరాశి వారు ఈ సమయంలో తమ భాగస్వామికి మరింత దగ్గరవచ్చు లేదా పూర్తిగా దూరం కావచ్చంటున్నారు. వృషభరాశి వారికి కూడా కొన్ని కష్టనష్టాలు తప్పవన్నది జ్యోతిష్యుల మాట. వృషభ రాశి వారు సహనంగా ఉండగలిగితే సమీప భవిష్యత్తులో శుభవార్తను వింటారు.
పింక్ మూన్ సమయంలో కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువే ఉంటాయి. అయితే సింహరాశికి వారికి ఇది శుభ సమయమని వారిలో సృజనాత్మక పెరుగుతుందంటున్నారు. కన్యా రాశి వారికి ఇది కలిసొచ్చే కాలమట. తులా రాశి వారికి కూడా ఇది అనుకూలమైన కాలమని చెబుతున్నారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొంత విశ్రాంతిగా ఉంటే మంచిదంటున్నారు. ధనురాశి వారికి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందట. మకరరాశి వారికి ఇది ఉజ్వలమైన దశ అని చెబుతున్నారు. కుంభరాశికి కూడా ఇది శుభసమయం అంటున్నారు. మీనరాశివారికి మాత్రం పింక్ మూన్ ప్రభావం కొంత ప్రతికూలంగా ఉండే సూచనలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తల దృష్టిలో మాత్రం ఖగోళ పరంగా జరిగే అద్భుతాల్లో పింక్మూన్ ఒకటి. అంతకుమించి దాని గురించి ఎక్కువ ఆందోళనపడాల్సిన పన్లేదు. మనకు ఏ రకంగానూ అన్వయించుకోవాల్సిన పన్లేదు.