హైదరాబాద్ విమానాశ్రయం గత నెల మొత్తం కిటకిటలాడిపోయింది. ఇమ్లిబన్ బస్ స్టేషన్ కన్నా ఎక్కువగా రద్దీ కనిపించింది. ఏదో ఉపద్రవం వచ్చినట్లుగా దేశం దాటిపోయేందుకు అలా ఎందుకు వస్తున్నారో కానీ ఇప్పుడు ప్రతి యువకుడి కల అబ్రాడ్. ముఖ్యంగా అమెరికా పోయి అక్కడే బతికేయాలన్నది వారి డ్రీమ్. ఇక్కడ ఎన్ని ఆస్తులున్నా వారికి అక్కర్లేదు. కానీ అక్కడ బతకాలనుకుంటారు. అక్కడే ఉండాలనుకుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతే. ఇక్కడ లేనిది అక్కడేముంది ? . గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలు ఎదురు చూడటానికి సిద్దం కానీ… సొంత దేశంలోనే ఉద్యోగ , ఉపాధి అవకాశాలు చూసుకోవాలని ఎందుకు అనుకోరు ?
భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 22 లక్షలు. ఇతర దేశాల్లో పుట్టి అమెరికాలో వచ్చి స్థిరపడిన మొత్తం వలస ప్రజల్లో మెక్సికన్ల సంఖ్య 27.9 శాతం కాగా, భారతీయుల సంఖ్య 5.2 శాతం. 2012 నుంచి అమెరికాకు వలసవచ్చే మెక్సికన్ల, చైనీయుల సంఖ్య బాగా పడిపోయినా, భారతీయుల సంఖ్య మాత్రం పెరగుతూనే వస్తోంది. ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనర్లకు ఇప్పటికీ అమెరికాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారతీయులు అమెరికాకు క్యూ కడుతున్నారు. అమెరికాలో గత తొమ్మిదేళ్లలో భారతీయుల సంఖ్య ఏకంగా 49 శాతం పెరిగింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. ఎవరికీ తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. అందరూ గ్రీన్ కార్డుల కోసమే ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు రావాలంటే … మరో తరం మారాల్సి వస్తోంది.
చదువు కోసం వెళ్లి అక్కడే ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడిపోతారు. పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు తీసుకునేందుకు తహతహలాడిపోతారు. అయితే ఇప్పుడు అమెరికాలో శాశ్వత నివాస హోదాకు వీలు కల్పించే ‘గ్రీన్ కార్డ్’ను పొందటం అందని ద్రాక్షగానే మారుతున్నది. ఆ దేశంలో భారతీయ వృత్తి నిపుణుల గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్స్ సంఖ్య రికార్డు స్థాయిలో 18 లక్షలు దాటింది. ఇందులో 10.7 లక్షల దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు దాదాపు 134 ఏండ్లు పడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. అమెరికా ప్రభుత్వం ఏటా 1,40,000 మాత్రమే గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తుంది. ఇందులో ఒక్కో దేశం కోటా 7 శాతం మాత్రమే. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే, కొత్త దరఖాస్తుదారులు చనిపోయేలోగా గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో లక్షలాది మంది భారతీయ వలసదారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఒకవేళ మరణాలు, వృద్ధాప్యం కారణాలతో ఈ జాబితా నుంచి బయటకు వచ్చే వారిని పరిగణనలోకి తీసుకున్నా.. నిరీక్షణ కాలం 54ఏళ్ల కంటే తక్కువగా కనిపించడం లేదు. ఇదే సమయంలో అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయుల పిల్లల వయసును లెక్కిస్తే, వేలాది మంది వారి తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశం నుండి కొత్త దరఖాస్తుదారులు ఈ గ్రీన్‌కార్డుల కోసం జీవితకాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇందులో దాదాపు 4,00,000 కంటే ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ పొందేలోపు మరణిస్తారని ఓ రిపోర్టులో తేలింది. ప్రతిదేశానికి సగటున గ్రీన్‌కార్డు కేటాయింపు దరఖాస్తుల వార్షిక పరిమితి 7 శాతంగా ఉంది. డిమాండ్ తరచుగా ఈ పరిమితులను మించిపోతున్నది. తద్వారా ఇది గణనీయమైన బ్యాక్‌లాగ్‌కు దారితీస్తుంది. కొత్త భారతీయ దరఖాస్తుదారులకు, గ్రీన్ కార్డ్‌లోని ఈబీ-2, ఈబీ-3 వర్గాలలో బ్యాక్‌లాగ్ పెద్ద సమస్యగా మారింది. యుఎస్‌లోని లక్ష మందికి పైగా భారతీయ పిల్లలు బ్యాక్‌లాగ్ కారణంగా వారి తల్లిదండ్రుల నుండి వేరయి.. మాతృదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వారు గ్రీన్ కార్డ్ కోసం నిరవధికంగా నిరీక్షిస్తున్నందున, హెచ్-4 వీసా విధానంలో యుఎస్‌లో ఉంటున్న 1 లక్షా 34 వేల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి వయస్సు దాటిపోతారు. ఇది వారి తల్లిదండ్రుల నుండి బలవంతంగా విడిపోవడానికి దారితీస్తుంది. వారు తల్లిదండ్రుల వద్దే ఉంటాలంటే ఎఫ్-1 విద్యార్థి వీసాను పొందాలి. లేదంటే దేశం నుంచి వెళ్లిపోవాలి. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న మొత్తం 18 లక్షల ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో 63శాతం భారతీయులవే ఉన్నాయి.
దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్న వారికీ గ్రీన్ కార్డులు మంజూరు చేయడానికి అమెరికాకు వచ్చిన సమస్య ఏమిటి ? . వలసదారుల మేధో సంపత్తితో అభివృద్ధి చెందిన అమెరికా వారిని దోచుకుంటోందా
ఎంతో కాలంగా అమెరికాలో నివసిస్తున్నా కావాలని గ్రీన్‌కార్డు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది అమెరికన్ ప్రభుత్వం. దీనికి కారణం… గడువు అయిపోయిన ప్రతిసారీ హెచ్1బి వీసాని రెన్యూ చేయించుకోవాలన్న నిబంధన లక్షలాది డాలర్లను సంపాదించిపెట్టడమే. అట్లా రెన్యూవల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతిసారి మూడువేల డాలర్లు కట్టాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగిది 2020లో వీసా గడువు ముగిసిందనుకోండి. యుసిఐఎస్ అనే గవర్నమెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒకటుంది. వాళ్లు ఒక పద్ధతి, రూల్‌ని అనుసరించకుండా ఒకోసారి ఆరునెలలకు ఎక్స్‌టెన్షన్ ఇస్తే, మరోసారి ఏడాదిపాటు ఎక్స్‌టెన్ష్షన్ ఇస్తారు. నిజానికి ఈ ఎక్స్‌టెన్షన్ మూడేండ్లు ఇవ్వాలి. చిన్న చిన్న బ్రోకరేజ్ చేసే కన్సల్టింగ్ కంపెనీలుంటాయి. వీటినే బాడీ షాపింగ్ కంపెనీలు అంటారు. వాళ్ల దగ్గర డబ్బులు కాజేయాలని ప్రాజెక్టు ఎంతవరకు ఉంటే అంతవరకే ఎక్స్‌టెన్షన్ ఇస్తారు. అమెరికాలో పర్మినెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు ఉంటాయి. ప్రాజెక్టులు ఉన్నంత కాలం కాంట్రాక్టు కుదుర్చుకొని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ప్రాజెక్టు అయిపోవడంతోనే ఉద్యోగుల వీసా గడువుకూడా అయిపోతుంది. కన్సల్టింగ్ కంపెనీల క్లయింట్ లెటర్‌లో కాంట్రాక్టు ఎంతకాలం ఉంటుందో చూసి అంతకాలానికే వీసా ఇస్తారు. మళ్లీ ఇంకో ప్రాజెక్టు దొరికి అక్కడుండాలంటే మరోసారి హెచ్1బి వీసాకి అప్లై చేసుకోవాలి. ఇట్లా ప్రతిసారి డబ్బులు కట్టడం వల్ల అమెరికా ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది.
ప్రతి సంవత్సరం హెచ్1బి వీసా మీద అరవై అయిదు వేలమంది అమెరికా వస్తారు. అంటే కాలం గడిచే కొద్దీ హెచ్1బి వీసా మీద వచ్చి ఉద్యోగాలు చేస్తూ రెన్యూ చేయించుకునేవారి సంఖ్య పెరిగిపోతుందన్నమాట. ఒక్కసారి అమెరికాలో ప్రవేశించిన తర్వాత చాలామంది తిరిగి అంత తొందరగా సొంత దేశం వెళ్లరు. వీళ్లందరు హెచ్1బి వీసా కోసం అప్లైచేస్తూ డబ్బులు కడుతూనే ఉండటం వల్ల పెద్దమొత్తంలో అమెరికన్ ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అందుకని గ్రీన్‌కార్డుకు అర్హత ఉన్నా దాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంటారనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి.
అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసా హోల్డర్లు కాగా, 14 లక్షల మంది న్యూట్రలైజ్డ్ రెసిడెంట్లు. మరో 10 లక్షలమంది అక్కడే పుట్టినవారు. చదువులకోసం మన దేశం నుంచి ఏటా వేల మంది వెళ్తున్నారు. వాళ్లలో అత్యధిక మంది తిరిగి రారు. అక్కడే ఉద్యోగాలు చేసుకంటారు. అందుకే ఈ హెచ్ వన్ బీ వీసాలతో అక్కడ ఉండే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.
అమెరికా ను వదిలేసి ఇండియాలో ఏదైనా వ్యాపారమో.. ఉద్యోగమో చేయాలని వచ్చే వారిని వింతగా చూస్తారు. అమెరికాకు వెళ్లడమే లక్ష్యంగా యువత పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందో ఇప్పుడే అంచనా వేయలేము.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…