భారత్ లో ఎన్నికల ప్రక్రియ ప్రతీది అనుమానాస్పదమవుతోంది. వీవీ ప్యాట్లు మొత్తం లెక్కించడానికి అంగీకరించరు. ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెప్పడానికి ఎంత సమయం తీసుకుంటారో తెలియదు. బూత్ ల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఇచ్చేందుకు టైం లేదంటారు. అసలే ఈవీఎంల ద్వారా పెరిగిపోతున్న అనుమానాలకు ఇలాంటి అనుమానాస్పద చర్యలతో ఈసీ ఎన్నికలపై మరింత నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. సుప్రీంకోర్టులో పదే పదే పటిషన్లు దాఖలవుతున్నా పారదర్శకంగా వ్యవహరించలేకపోతోంది.
దేశ పాలకుల్ని నిర్ణయించే సార్వత్రక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. కానీ నిన్నామొన్నటి వరకూ ఎంత పోలింగ్ అయిందో ఎవరికీ తెలియదు. సార్వత్రిక సమరానికి సంబంధించి ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా పోలింగ్ నమోదు గురించి అనేక సందేహాలు పెరుగుతూండటం, కోర్టుల్లో కేసులు పడుతూండటంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలైన నిర్ధిష్ట ఓట్ల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది పోలింగ్ శాతాలను గతంలోనే ఇసి విడుదల చేసింది. కానీ, ప్రతి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల వాస్తవ సంఖ్యను నిర్దిష్టంగా వెల్లడించలేదు. అత్యంత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నందున పోలింగ్ కేంద్రాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న నిర్ధిష్ట ఓటర్ల సంఖ్య, శాతాలను ఎన్నికల సంఘం ఎందుకు ప్రకటించడం లేదంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలు సందేహాలను వ్యక్తం చేశాయి. ఎడిఆర్ వంటి సంస్థలు కోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే పోలింగ్ కేంద్రాల వారీగా డేటా విడుదల చేయడం గందరగోళానికి దారితీస్తుందంటూ ఈసీ వాదించింది. చివరికి నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను ప్రకటించింది.
సాధారణంగా నూటికి నూరు శాతం పోలింగ్ నమోదు కావడం గొప్ప విశేషం. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతానికి మించి ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లోనే పేర్కొనడంతో సర్వత్రా విస్మయానికి గురి చేసింది. అసలు పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల నిర్ధిష్ట సంఖ్యను ఎందుకు తెలియజేయడం లేదంటూ ఎన్నికల సంఘాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు నిలదీస్తూ వస్తున్నాయి. పోలింగ్ రోజునే ఫారమ్ 17సి ద్వారా అందరి అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు ఈ సమాచారం అందచేస్తామని తెలిపింది. ఓటర్ టర్నవుట్ డేటా అభ్యర్ధులకు ఎప్పుడూ అందుబాటులోనే వుంటుందని,అలాగే పౌరులకు ఓటర్ టర్నవుట్ యాప్ ద్వారా నిరంతరం అందుబాటులో వుంటుందని తెలిపింది.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారానికి సంబంధించి ఫారమ్ 17సి చాలా కీలకమైనది. ఈవీఎంలో నమోదైన ఓట్ల రికార్డును ఫారమ్ 17సిలోనే పొందుపరుస్తారు. ఈ డేటాను తక్షణమే విడుదల చేయాలనే ఎడిఆర్ సుప్రీంను కోరింది. మొదటి రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ డేటాను ప్రచురించడంలో జాప్యం జరగడంతో ఈ పిటిషన్ దాఖలైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్ తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల ఫారమ్ 17సి స్కాన్ చేసిన స్పష్టమైన కాపీలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఓటర్ టర్నవుట్‌కు సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులను ఈసి వెల్లడించాలని ఎడిఆర్ విన్నవించింది. తాము ఆ పత్రాన్ని కేవలం అభ్యర్ధులకు లేదా వారి ఏజెంట్లకు మాత్రమే ఇవ్వగలమని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. పోలైన ఓట్ల డేటాను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది.
పోలైన ఓట్లలో తేడాలు రావడం… పోలైన ఓట్లకు మించి లెక్కింపు జరగడం వంటివి ఈవీఎంలు వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈసీ పోలైన ప్రతి ఓటుని నిర్దిష్టంగా పారదర్శకంగా లెక్కించాలసి ఉంటుంది. గానీ.. బూత్‌లు రిగ్గింగులు చేసుకునే చోట మాత్రం ఈ లెక్కలు గతి తప్పుతున్నాయి. ఇప్పటికే ఈసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినవారిపై సత్వర చర్యలు తీసుకోవడం, నియమనిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరపడం కంటే, పాలకపక్షపెద్దల ఆగ్రహానికి గురికాకుండా తెలివిగా వ్యవహరించడం ఈసీకి ముఖ్యమైపోయింది. అన్ని పార్టీలనూ ఒకేరీతిలో చూస్తున్నట్టుగా, సమానంగా శిక్షిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, మొగ్గు అధికారపక్షంవైపు ఉందని అందరికీ ఓ క్లారిటీ ఉంది.
లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం కాదు.. నిర్వహించినట్లుగా కూడా కనపడాలి .. లేకపోతే ఎన్నికలపై నమ్మకం ఉండదు. మన ప్రజాస్వామ్యం ఆ నమ్మకం మీదనే ఆధారపడి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…