కాళ్లకింద భూమి కంపిస్తే ఇక మనిషి తలదాచుకునేందుకు చోటెక్కడ ఉంటుంది. ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఇళ్లు పేకమేడల్లా కూలిపోతే బయటపడే అవకాశం ఎక్కడుంటుంది. టర్కీ భూకంపం వేలమందిని బలి తీసుకుంది. శిధిలాలు తొలగించేకొద్దీ శవాల గుట్టలు బయట పడుతున్నాయి. ఇక ఆస్తి నష్టానికైతే అంతేలేదు. ఫిబ్రవరి 11న టర్కీలో సంభవించిన భూకంపం ప్రకృతి ప్రకోపానికి పరాకాష్ట. ఆగ్నేయటర్కీకి రెండు భారీ భూకంపాలు వణికించాయి. 7.8, 7.5 తీవ్రతలతో సంభవించిన భూకంపాల ధాటికి క్షణాల్లో భారీ భవంతులు కూడా కుప్పకూలిపోయాయి. మొదట భూకంపం సంభవించిన మూడురోజులకే మళ్లీ భూమి వణికిపోయింది. దాదాపు రెండొందల ప్రకంపనలతో టర్కీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
భూమి ఎందుకు కంపిస్తుందంటే అనేక సాంకేతిక అంశాలు దాంతో ముడిపడి ఉంటాయి. భూమి క్రస్ట్ టెక్టోనిక్ ప్లేట్లుగా పిలిచే దాదాపు 15 భారీ విభజిత చంకీ స్లాబ్‌లతో ఉంటుంది. ఈ ప్లేట్లు నిరంతరం ఢీకొంటాయి. టర్కీ, సిరియా భౌగోళికంగా మూడు పలకల సంగమం దగ్గరున్నాయి. అరేబియన్ ప్లేట్, అనటోలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ మూడూ ఈ ప్రాంతాన్ని క్రియాశీల భూకంప జోన్‌గా మార్చాయి. అరేబియా ప్లేట్ ఉత్తరాన యూరప్‌లోకి ప్రవేశిస్తోంది దీంతో అనటోలియన్ ప్లేట్ పశ్చిమానికి నెట్టబడుతుంది. అనటోలియన్ ప్లేట్‌పై రెండు ప్రధాన లోపాల మధ్య ఉండటంతో టర్కీ భూకంప తాడికి గురవుతోంది.
భౌగోళికంగా ఎక్కడ ఉండాలన్నది మన చేతుల్లో లేదు. కాళ్లకింద భూమిపొరల్లో అసాధారణ కదలికలు జరిగేచోట ఉండటమే టర్కీకి శాపమవుతోంది. తాజా భూకంపం గతంలో టర్కీలో వచ్చిన ప్రకంపనలకంటే ఎక్కవ తీవ్రమైంది. 7.8 తీవ్రత దాదాపు 190 కి.మీ పొడవునా ప్రభావం చూపుతుంది. రెండవ భూకంపం 7.5 తీవ్రతతో ఉత్తరాన సంభవించింది. టర్కీ-సిరియా భూకంపంలో మూడు పురాతన నగరాలు దెబ్బతిన్నాయి. టర్కీ-సిరియా భూకంపాలలో దాదాపు 300 సంవత్సరాల కాలంలో పోగుచేసిన ఒత్తిడి నుండి శక్తి విడుదలైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భారత్ భూకంప రహితమేం కాదు. భూమిలో ఒత్తిడి ప్రభావం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌ని ఢీకొట్టి పైకి వంగి హిమాలయాలను సృష్టించింది. హిమాలయ ప్రాంతంలో అత్యంత సాధారణమైన భూకంపం రెండు పలకల మధ్య సంపీడన బలాల ప్రభావంతో రివర్స్ ఫాల్ట్‌ల వల్ల సంభవిస్తుంది. గర్హ్వాల్-కుమావోన్ శ్రేణిలో భారీ భూకంపం ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. 7 తీవ్రత నమోదైందంటే అది భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రకంపనమే. టర్కీ భూకంపం ప్రపంచానికి పెను హెచ్చరికలు చేస్తోంది. 8 మాగ్నిట్యూడ్‌ని భూకంపాలు కూడా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. వినాశకరమైన భూకంపాల చరిత్రకు చిలీ దేశాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు.
జపాన్ ప్రజలు భూకంపాలకు ఎప్పుడూ సిద్ధపడి ఉంటారు. కానీ ఆ దేశం ముందుచూపు ప్రాణ ఆస్తి నష్టాలను నివారిస్తోంది. 2014, 2015 సంవత్సరాల్లో 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించినా జపాన్‌లో ప్రాణనష్టం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే భవన నిర్మాణ ప్రమాణాల విషయంలో జపాన్ కఠినంగా ఉంటోంది. భూకంప నిరోధక నిర్మాణాలలో అపార అనుభవం జపాన్‌కి స్వీయరక్షణగా నిలుస్తోంది. టర్కీ నిర్మాణాల్లో అలాంటి ప్రమాణాలేమీ లేకపోవటమే ఇంత విధ్వంసానికి అంచనాలకు అందని ప్రాణనష్టానికి దారితీసింది.
వారం గడిచినా భూకంప ప్రకోపం నుంచి తుర్కియే, సిరియా తేరుకోలేదు. శిథిలాల నుంచి మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిధిలాలనుంచి కొందరు ప్రాణాలతో బయటపడుతున్నా సహాయకచర్యలు వేగంగా జరగడంలేదు. మరోవైపు భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించి ప్రాణనష్టానికి కారకులయ్యారని తుర్కియేలో వందలమంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య ఉండటం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపానికి ఇప్పటిదాకా 34వేలమంది మరణించారు. లక్షమంది గాయాలపాలయ్యారు. ప్రకృతి విసిరిన పాశానికి ప్రజలు నిలువునా వణికిపోతున్నారు.