జమిలి ఎన్నికలకు రంగం సిద్ధ

By KTV Telugu On 11 September, 2023
image

KTV TELUGU :- 

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ తాజాగా భోపాల్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాద్యాలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించిన నేపథ్యంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జమిలి ఎన్నికలు సాధ్యమే అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల గడువుకు ఆరునెలల లోపు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని ఆయన పేర్కొనడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే జనవరిలో 12 రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్ సభకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి జమిలి ఎన్నికలు వస్తాయా? అని ప్రశ్నించగానే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వానికైనా గడువుకు ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ఈ వ్యాఖ్య చేయడం ద్వారా జమిలి ఎన్నికలకు అవకాశం ఉందని ఆయన ఒప్పుకున్నట్లయ్యిందని అంటున్నారు. జమిలి ఎన్నికల బిల్లు కోసమే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 18 నుండి 22 వరకు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్న సంగతి తెలిసిందే.
ఒక వేళ జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే మటుకు ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు వచ్చే ఏడాది అక్టోబరు ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టి దాంతోపాటే లోక్ సభ ఎన్నికలు జరుపుతారని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు ఒక నెల వాయిదా వేసి 2024 జనవరిలో ఎన్నికలు పెట్టచ్చంటున్నారు. అదే విధంగా ఏప్రిలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు మూడు నెలలు ముందుకు జరిపి ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది డిసెంబరు లో తెలంగాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది చివర్లో మహారాష్ట్ర హరియాణా జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 12 రాష్ట్రాలతో పాటే లోక్ సభ ఎన్నికలకు ఒకే సారి నగారా మోగే అవకాశాలున్నాయంటున్నారు. డిసెంబరు రెండో వారం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చునని తెలుస్తోంది.
అయితే 12 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ పరంగా ఎలాంటి సవరణలూ అవసరం లేదంటున్నారు. అందుకే సెమీ జమిలిగా అభివర్ణిస్తోన్న ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలూ ఉండకపోవచ్చునంటున్నారు. మామూలుగా అయితే జమిలి ఎన్నికలను విపక్ష కూటమిలోని పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు బిజెపి నేతలు మాత్రమే జమిలి ఎన్నికలకు జై కొడుతున్నారు. రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్ సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే తమకి లబ్ధి చేకూరుతుందని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు.

మొత్తం అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణతో పాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ సవరణలు తీసుకురావాలి. అది చాలా పెద్ద ప్రక్రియ. అది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. కాకపోతే ఈ 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం సెమీ జమిలి ఎన్నికల దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి