రాజకీయ నేతలు అడ్డగోలుగా సంపాదించుకుంటారు. ఎన్నికల సమయంలో వాటిని ప్రజలకు పంచి పెడతారు. అదే రాజకీయం. ఇప్పుడు ఇప్పుడు ఏపీలో ఇలా సంపాదించుకున్న మొత్తం పెద్ద మొత్తంలో ప్రజలకు పంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే రెండు నెలల పాటు ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. కొన్ని చోట్ల ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది.
ఎన్నికల ఖర్చు అనేది రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓ పెద్ద టాస్క్. అది ఎన్నిక ఎన్నికకూ మారుతూ ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుందో దిగిన తర్వాత కూడా అర్థం కాదు. సాధారణంగా దక్షిణాదిలో ఎన్నికలు రాను రాను కాస్ట్ లీగా మారిపోతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో వంద కోట్లు ఖర్చు పెట్టినా సరిపోని పరిస్థితి వస్తోంది. ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఆషామాషీ కాదు. నియోజవర్గం మొత్తం ప్రచార హోరు కనిపించేలా చూసుకోవాలి. ఇందు కోసం రోజూ కార్యకర్తలు రారు. ఖచ్చితంగా రోజువారీ కూలీల్నే సభలకు, సమావేశాలకు తెచ్చుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలకూ తప్పదు. వీరి కోసమే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కార్యకర్తలకు డబ్బులు ఇవ్వకపోయినా.. వారికి కనీస అవసరాలు అంటే.. భోజనం, టీ కాఫీలు పెట్టాలి. ఇక మద్యం అనేది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతలకు కనీస అవసరం. ఒక్క అసెంబ్లీ అభ్యర్థి రోజుకు ఇరవై లక్షల వరకూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
ఎలక్షనీరింగ్ అనే పదానికి అర్థం ఇప్పుడు మారిపోయింది. ఎలక్షనీరింగ్ అంటే.. ఓట్లను కొనుగోలు చేయడం. ప్రభుత్వ పథకాలు ఎంత ఇచ్చారు.. ఎంత మేలు జరిగిందనేది. పోలింగ్ రోజు ఓటర్లకు గుర్తు ఉండదు. ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చారన్నదే చూసుకుంటారు. . రాజకీయ నేతల అవినీతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయాల్లో..వారు ఎన్నికలకు వచ్చిన సమయంలో ఎంతో ఇస్తారని ఆశ పెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పదివేల రూపాయలు ఎక్స్ పెక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సారి అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గెలుపును అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆర్థిక వనరులను ముందుగానే సమకూర్చుకుని ఉంటాయి. అందుకే .. ఖర్చులు హద్దులు దాటిపోతాయని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా రాజకీయం అంటే.. కింది స్థాయి నుంచి సహకారం ఉంటేనే గెలుస్తారు. లేకపోతే గెలవరు. గతంలో ఎమ్మెల్యేకు గ్రామస్థాయిలో నాయకులు నమ్మకంగా ఉండేవారు ఇప్పుడు గ్రామ స్థాయి నాయకులు.. తమ నాయకుడి దగ్గర నుంచి ఎంతో కొంత ఆశిస్తున్నారు. దానికి కారణం ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే సంపాదించుకుంటున్నారు కానీ..తాము ఏమీ సంపాదించుకోవడం లేదన్న భావనే. ఇది అంతకంతకూ పెరిగిపోతోంది. చివరికి వేరే పార్టీ నేత డబ్బులు ఇస్తే.. తన అనుచరులతో ఓటేస్తారన్న భావనతో.. తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తున్నారు.
మన దేశంలో రాజకీయ అవినీతిని ఎవరూ కాదనలేరు. ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే ఇలా అవినీతిని చట్టబద్దంగా చూపించుకోవడం దాదాపు అసాధ్యం. ప్రభుత్వం ఉన్నంత కాలం ఎలాగోలా అనుభవించినా తర్వాత దొరికిపోతారు. అందుకే ఎక్కువ మంది రాజకీయ నేతలు ఈ రాజకీయ అవినీతి ద్వారా వచ్చిన సొమ్మును తర్వాత ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి పంచేస్తూంటారు. ఇలా .. రాజకీయ అవినీతి ద్వారా పోగుపడిన సొమ్ము ఎన్నికల సమయంలో ప్రజల చేతుల్లోకి వెళ్తోంది. ఎన్నికల సమయంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా కాస్తంత పెరుగుతుందంటే దీనికి కారణం ఈ సొమ్మే. ఎన్నికల ఖర్చు వల్ల.. నేతల అవినీతి పెరుగుతుంది.. అలాగే అవినీతి సొమ్ము కూడా ప్రజల్లోకి వస్తుందని సర్దుకోవడమే. ఎందుకంటే..దీన్ని కంట్రోల్ చేసేంత బలమైన వ్యవస్థలు ఇంకా మన ప్రజాస్వామ్యంలో పెరగలేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…