అధికారంలో ఉన్నపార్టీలు వ్యాపార సంస్థలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుని .. వాటి ద్వారా తమ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లంచం తీసుకునే ప్రక్రియకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఎనిమిదేళ్లు ఆలస్యమైనా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలకు వెల్లువలా వస్తున్న ఎలక్టోరల్ బాండ్ల గుట్టు బయటకు రానుంది. ఎలా చూసినా బలహీనమవుతున్న ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు తీర్పు కాస్త బలం కల్పించిందనేది ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయం.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటి జారీని తక్షణం నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఒక్కరు కూడా ఆ ఎలక్టోరల్ బాండ్లు మంచివని.. నీతి, నిజాయితీతో కూడినవని అనడం లేదు. చివరికి చట్టం తీసుకు వచ్చిన బీజేపీ నేతలు కూడా ధైర్యంగా ఈ మాట చెప్పలేకపోతున్నారు. కార్పొరేట్లకు దోచిపెట్టి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీగా నిధులు సమకూర్చుకొని రాజకీయాలను శాసించాలనుకున్న అధికార పార్టీలకు సుప్రీం తీర్పుతో కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. పాలక పార్టీ, కార్పొరేట్ల నడుమ ‘నీకిది నాకిది’ తరహాలో క్విడ్‌ప్రోకోకు ఎలక్టోరల్ బాండ్ల స్కీం దారి తీసిందని సుప్రీం నిర్ధారించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఎటువంటి వివరాలూ తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనంది. నల్లధనాన్ని అరికట్టేందుకు, పారదర్శకత కోసం ఈ స్కీం తెచ్చామన్న బిజెపి ప్రభుత్వ కుతర్కాన్ని తోసిపారేసింది.
అధికారంలో ఉన్న పార్టీలు క్విడ్ ప్రో కో ద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసి వాటి దగ్గర నుంచి లంచం రూపంలో పార్టీ ఫండ్ తీసుకుంటున్నాయి. ఇది నేరం కాదు. చట్టబద్దమైన పనిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రదాని మోదీ ప్రభుత్వం తేల్చింది. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఓ చట్టం తీసుకు వచ్చింది. ఈ బాండ్స్ ఎవరైనా కొని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఎవరు కొన్నారు..ఎంత కొన్నారు అన్న వివరాలేమీ బయటకు రావు. అంతా రహస్యం. ఆ బాండ్లు కొనడానికి డబ్బులు నీతిగా సంపాదించారా.. నిజాయితీగా సంపాదించారా అన్న సంగతి కూడా చెప్పాల్సిన పని లేదు. పోనీ పన్నులైనా కట్టారా అన్నది కూడా చెప్పాల్సిన పని లేదు. అంటే ఎలా సంపాదించినా సరే.. అది రాజకీయ పార్టీకి విరాళం ఇస్తే మంచిదయిపోయింది. కనీసం ఎవరు ఇచ్చారు అన్నది కూడా బయటకు రాదు. కానీ కేంద్రానికి తెలుస్తుంది. తమ వ్యతిరేక పార్టీకి ఇస్తే వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ బాండ్లు ఒక్క ఎస్‌బీఐ మాత్రమే అమ్ముతుంది. తమ కు కాకుండా వ్యతిరేక పార్టీలకు ఇచ్చిన వారిపై.. చతురంగబలాలపై దాడులు చేస్తారు. అంటే తాము మాత్రమే బలంగా ఉండాలి.. ఇతర పార్టీలన్నీ ఆర్థికంగా కుంగిపోవాలన్న వ్యూహం కూడా ఇందులో ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ రాజకీయ వ్యూహం నిరాటంకంగా అమలవుతూనే ఉంది.
మార్చి 2018లో తొలిసారి ఎలక్టోరల్ బాండ్లను విక్రయించడం మొదలుపెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వేల కోట్లు విరాళాలు సమీకరించుకుంది. . 2021లో ఇలా పొందిన బాండ్ల సొమ్ములో 60 ఒక్క భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే జమ అయ్యాయి. 2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు .2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయి. మొత్తంగా బీజేపీ ఖాతాలో ఆరు వేల కోట్లకుపైగా నిధులు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేరాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు బీజేపీకి వచ్చిన విరాళాల్లో పదో వంతు కూడా రాలేదు.
ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని రాజ్యాంగ ధర్మాసనం ముందు వివరాలను ఉంచారు. ‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అనే సందేహాన్ని విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన విరాళాల వ్యవస్థ ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే సొమ్ముతో నిర్వహిస్తున్న ఎన్నికల మీద ప్రైవేటు విరాళాల ద్వారా రాజకీయ పార్టీలు పొందే అపారమైన నిధుల పెత్తనం ప్రజాస్వామ్యానికి హానికరం . ఈ విరాళాల పద్ధతి ప్రభుత్వాలతో పనులుండే సంపన్న కార్పొరేట్ యాజమాన్యాలు అధికారంలోకి రాగల అవకాశాలు అధికంగా వుండే పార్టీలకు నిధులు చెల్లించడానికి దోహదం చేస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీలు తమకు విరాళాలిచ్చిన సంస్థలకు లేదా వ్యక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలను నడుపుతాయేగాని ప్రజలకు మేలు చేయవు. ఈ ప్రమదం నుంచి ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు రక్షించింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…