కాలుష్య రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ మౌలిక వసతులు కల్పించేందుకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం కొత్త స్కీమ్ తెచ్చింది కేంద్రం. ఈ మేరకు రూ.10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా స్కూటర్లు, బైకులకు రూ. 10 వేల రాయితీ అందిస్తోంది. ఆటోలకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు సబ్సిడీ రానుంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా టూ-వీలర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం, ఛార్జింగ్ వసతులు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్దికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రారంభించింది. రూ. 10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలైన ఈఎంపీఎస్ 2024 స్కీమ్ స్థానంలో తీసుకొచ్చింది.
ఎలక్ట్రిక్ టూ- వీలర్లకు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ ఇవ్వనున్నారు. కిలోవాట్ అవర్‌కు రూ. 5 వేల సబ్సిడీ అందిస్తారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో గరిష్ఠంగా రూ. 10 వేలు ఉంటుంది. రెండో ఏడాది కిలోవాట్‌కు రూ. 2,500, మొత్తంగా రూ. 5 వేల సబ్సిడీ మించకూడదు. ఇక త్రిచక్ర వాహనాలకు మొదటి ఏడాదిలో రూ.25 వేలు సబ్సిడీ వస్తుంది. రెండో ఏడాదిలో రూ. 12,500 ప్రోత్సాహకాలు అందుతాయి. ఎల్ 5 విభాగంలో అంటే గూడ్స్ విభాగం త్రిచక్ర వాహనాలకు తొలి ఏడాదిలో రూ. 50 వేలు, రెండో ఏడాదిలో రూ. 25 వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు.
సబ్సిడీ అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ యాప్ సాయంతో ఈ స్కీమ్ కింద ఇ-ఓచర్లను అందిస్తారు. ఒక ఆధార్ నంబర్ పై ఒక వాహనాన్నే అనుమతిస్తారు. వెహికల్ కొన్న వెంటనే పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఇ-ఓచర్ జనరేట్ చేస్తారు. దానిపై సంతకం చేసి డీలర్‌కు అందించాలి. ఆ తర్వాత సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్లు, అంబులెన్సులు, ట్రక్కులు, ఇతర వాహనాల సబ్సిడీ కోసం రూ. 3,679 కోట్లు కేటాయించారు. కార్లకు 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టూ-వీలర్, త్రీ- వీలర్ వాహనాలకు 48,400 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు కేటాయించింది కేంద్రం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…