ప్రపంచ కుబేరుడిగా మస్క్ అగ్రస్థానం

By KTV Telugu On 1 March, 2023
image

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానానికి చేరారు. బ్లూమ్‌బెర్గ్‌ సూచీ ప్రకారం మస్క్‌ ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టేసినట్లైంది. ప్రస్తుతం ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ 185.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతేడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. తాజాగా టెస్లా షేర్ల విలువ పెరగడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవ‌త‌రించాడు. ఈ ఏడాది టెస్లా కంపెనీ షేరు ధర దాదాపు 70 శాతం పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద పెరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి గతేడాది నవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో టెస్లా అధిపతి మస్క్‌ ఆస్తుల విలువ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు పతనమైంది. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా ప్రకటించింది. 2021లో నవంబర్లో 340 బిలియన్‌ డాలర్లున్న ఆస్తులు గతేడాది చివర్లో దాదాపు 137 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దీంతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడి స్థానం దక్కించుకున్నారు. మస్క్‌ కంపెనీ టెస్లా షేర్లు కొవిడ్‌, చైనా లాక్‌డౌన్ల కారణంగా 65శాతం విలువ కోల్పోయాయి. 2022 సంవత్సరం టెస్లాకు అత్యంత దారుణంగా గడిచిందని నిపుణులు చెబుతున్నారు. ఆ కంపెనీ దాదాపు 700 బిలియన్‌ డాలర్లు కోల్పోయింది.

ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్‌ను జూలై 2003 లో టెస్లా మోటార్స్ గా మార్టిన్ ఎబెర్ హార్డ్, మార్క్ టార్పెన్నింగ్ స్థాపించారు. 2004 లో మస్క్ 6.5 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారారు. ఆ తర్వాత 2008లో కంపెనీ సీఈఓ, ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు చేపట్టారు. మస్క్ 2022 లో తన టెస్లా షేర్లలో ఎక్కువ భాగాన్ని విక్రయించారు. మొదట ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ఆ తరువాత ఈ కొనుగోలు నష్టాలను భరించడానికి టెస్లా షేర్ల‌ను విక్ర‌యించారు. మస్క్‌ గతేడాది మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అనంతరం దాని పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టారు. ఆ సంస్థ రోజుకు 4 మిలియన్‌ డాలర్లు కోల్పోతోందని నవంబర్‌లో ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టి దాదాపు 50 శాతం మందికిపైగా ఉద్యోగులను తొలగించారు.