పాపం ఉద్యోగులదేముంది వేతన జీవులు. ఎంత తింగరోడైనా బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్ అనాల్సిందే. ఎలాన్‌మస్క్ విషయంలో అది కూడా లేదనుకోండి. మొహంమీదే చాలా మంది ఉద్యోగులు ఛీకొట్టారు. ఛీత్కరించుకున్నారు. కాస్త తేడా అయితే ఎలాగోలా భరించొచ్చు. మరీ మెంటల్ క్యాండేట్ అయ్యేసరికి ట్విటర్ ఇజ్జత్ బజార్నపడింది. ట్విటర్ టేకోవర్ చేసినప్పటినుంచీ తోచిన మార్పులన్నీ చేస్తున్నాడు ఎలాన్‌మస్క్. జనం ఏవనుకుంటున్నా తనకు నచ్చింది చేసుకుపోతున్నాడు. ట్విటర్ టేకోవర్‌తో ఎలాన్‌మస్క్ బావుకున్నదేమీ లేదు. అప్పటిదాకా ఆ ప్లాట్‌ఫాంకున్న క్రేజ్ పడిపోయింది. అడ్వటైజర్స్ తప్పుకుంటున్నారు. మరోవైపు ఎలాన్‌మస్క్‌ని సంపన్నుడిని చేసిన టెస్లా పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. కొన్నినెలల్లోనే టెస్లా షేరు విలువ దారుణంగా పతనమైంది.
పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ప్రస్తుతం ట్విటర్ పరిస్థితి. ఈ పరిణామాలతో మస్క్ మరో విచిత్రమైన ప్రయోగం చేశాడు. జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భంగపడ్డాడు. నేను ట్విటర్ అధిపతిగా కొనసాగాలా? తప్పుకోవాలా అంటూ యూజర్లని ప్రశ్నించాడు ఎలాన్‌మస్క్. యూజర్ల నిర్ణయానికి కచ్చితంగా కట్టుబడి ఉంటానని మాటిచ్చాడు. దొరికిన బంగారం లాంటి చాన్సుని యూజర్లు వదులుకుంటారా. అన్నీ మూసుకుని తప్పుకోమంటూ మస్క్‌కి వ్యతిరేకంగా స్పందించారు. పారదర్శకంగా ఉన్నానని మస్క్ బిల్డప్ ఇవ్వబోతే అది బూమరాంగ్ అయింది. సీఈవో పదవి నుంచి మస్క్ తప్పుకోవాలని దాదాపు 60శాతం మంది సలహా ఇచ్చారు. ఓ 40శాతం మందే ఆయనకు అనుకూలంగా స్పందించారు.
మరి యూజర్ల తీర్పుని గౌరవిస్తానన్న ఎలాన్‌మస్క్ ఏం చేస్తాడో చూడాలి. ట్విటర్ చేతుల్లోకి తీసుకోగానే పాలసీని మార్చేసిన మస్క్ వేలమంది ఉద్యోగాలు పీకేశాడు. తాజాగా తనకు వ్యతిరేకంగా కథనాలిచ్చిన జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను తొలగించి విమర్శలపాలయ్యాడు. ఇప్పటిదాకా జరిగినదానికి క్షమాపణలు చెబుతూ ఇకపైన ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని మాటిచ్చాడు. కానీ మస్క్ ఏం చెప్పినా ఇప్పుడెవరూ నమ్మడం లేదు. పరిస్థితులు మస్క్‌కి ఏమాత్రం అనుకూలించడం లేదు. ఈ ఏడాదిలో ఏకంగా 107 బిలియన్ డాలర్లు (రూ.8.84 లక్షల కోట్లు) కోల్పోయి ప్రపంచకుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయాడు మస్క్. ఎందుకిలా నా ఖర్మ కాలిపోయిందంటూ ట్విటర్‌ని వదిలించుకునే ప్రయత్నాల్లో పడ్డాడు.