మరో “శేషన్” మళ్లీ ఎందుకు రాలేదు

By KTV Telugu On 3 March, 2023
image

ఓ క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు. రెండు టీములు హోరాహోరీగా తలపడితే ఎవరు బాగా ఆడితే వారే గెలవాలి. అంటే బాగా ఆడే ఆటగాళ్లే టీమే గెలవాలి. కానీ అంపైర్ ఎదురుగా నిలబడి తప్పుడు నిర్ణయాలతో బాగా ఆడే టీమ్ పై నియంత్రణ విధించి ఆటగాళ్లను బయటకు పంపి ఆడించే ఆటతో ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచినా గెలిపించేది మాత్రం అంపైర్. అలా జరగడం ఆట స్ఫూర్తి చచ్చిపోతుంది. ఆటపై ఆసక్తి కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితే ఎన్నికలకూ వర్తిస్తుంది. ఎన్నికలు ఎంత పారదర్శకంగా ప్రజలు ఎంత గొప్పగా నమ్మేలా జరుగితే అంత గొప్పగా డెమెక్రసీ బలోపోతం అవుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఇటీవలి కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎన్నికల సంఘానికే ఇస్తున్నారు కొంత మంది. అది ప్రమాదకరణ ధోరణి. అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈసీ నియామక తీరులో మార్పులు చేస్తూ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఈసీ నియామకంలో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు సీజే కూడా ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ప్రజాస్వామ్య వాదుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

“శేషన్” లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు అని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆయన స్థాయిలో మళ్లీ ఎన్నికల సంఘాన్ని నడిపించిన వారు లేరు. ఎన్నికల సంఘం అంటే ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడటమే కాకుండా నిరంతరం నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఎన్నికల సంఘం తీరు పూర్తిగా వివాదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినట్లుగా ఈసీ చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. వారు కేవలం కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అమలు చేస్తున్నారు కానీ రాజ్యాంగపరంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయకపోగా మరింత బలహీనం చేస్తున్నారన్న ఆందోలన అంతటా పెరిగిపోయింది.

ఎన్నికలు జరిగే తీరు శేషన్‌కు తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో హుకూం జారీ చేసి పోటీల్లో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝులిపించారు. ప్రస్తుతం వీటన్నింటికి కళ్లెం వేసి అభ్యర్థుల హంగామాకు ఎన్నికల ఖర్చుకు ముకుతాడు వేశారు. శేషన్ తన పదవీకాలంలో ప్రధాన మంత్రి నరసింహారావు నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అహ్మద్, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ ఎవరినీ వదల్లేదు. ఆయన బిహార్‌లో మొదటిసారి నాలుగు దశల్లో ఎన్నికలు జరిగేలా చేశారు. ఆ నాలుగుసార్లూ ఎన్నికల తేదీలు మార్చారు. బిహార్ చరిత్రలోనే అవి సుదీర్ఘ ఎన్నికలుగా నిలిచాయి. ఎన్నికల కమిషన్‌ను సెంటర్ స్టేజ్ పైకి తీసుకురావడంలో శేషన్ చాలా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. కానీ శేషన్ ఆ పదవి పవర్‌ను బయటకు తీసుకు వచ్చారు. ఒక్క సారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దేశ వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఆ పదవిలో అంత పవర్ ఉందని శేషన్ చూపించారు. కానీ ఇతరులు మాత్రం చూపించలేకపోతున్నారు.

ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా విశ్వసనీయతతో నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రూపొందించినా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా ఓటర్ల జాబితా రూపొందించినా ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల కమిషన్ కూడా అంతే. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్చగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ప్రతీ సందర్భంలోనూ మనం చెప్పుకుంటున్న పవర్ ఫుల్ రాజ్యాంగ వ్యవస్థకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్నదే అక్కడ కీలకం. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించి దేశానికి తనదైన సేవ చేయాలనుకునే శేషన్ లాంటి అధికారుల వల్ల ఆ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజల ముందు సాక్షాత్కరిస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమను నియమించిందని వారికి అనుకూలంగా వ్యవహరించడం తమ ధర్మమని అనుకునేవారితోనే ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడుతోంది

సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లను నియమించే ప్రక్రియను పక్కాగా మార్పు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు అవకాశం ఏర్పడింది. అది పెద్ద సంస్కరణ అవుతుంది. శేషన్ లాంటి ఫియర్ లెస్ నిస్వార్థమైన అధికారులు ఎన్నికల సంఘాన్ని లీడ్ చేస్తే దేశ ప్రజాస్వామ్యాన్ని అంత కంటే మరి ఏ శక్తి బలోపేతం చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రాణం. దాన్ని రక్షించాల్సిన డాక్టర్ లాంటి సీఈసీ. మరి ఇప్పుడైనా పరిస్థితి మారుతుందా.