నిరుద్యోగం 80లలో దేశానికి ఇదో పెద్ద సమస్య. అప్పట్లో ఉద్యోగం అంటే ప్రభుత్వ కంపెనీలు లేకపోతే చిట్ ఫండ్ కంపెనీలు. ఇంకా ఉంటే ఫ్యాక్టరీల్లో కార్మికుల ఉద్యోగాలు. సంస్కరణలు తెచ్చిన తర్వాత మెల్లగా పరిస్థితి మారింది. ఐటీ రంగం విస్తరించిన తర్వాత అనేక రంగాలు మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు అదే ఐటీ రంగం మొత్తం ప్రపంచ ఉద్యోగ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. అయితే అది సంక్షోభం వల్ల కాదు. అడ్వాన్స్డ్ ఐటీ సొల్యూషన్స్ సృష్టించడం వల్ల లక్ష మంది చేసే పనిని ఒకరే చేయగలిగే పరిస్థితికి తెస్తున్నారు. ఓ వైపు చాట్ జీపీటీ, మరో వైపు ఆటోమేషన్, ఇంకో వైపు రోబోలు మొత్తంగా కమ్మేస్తున్నాయి. ఫలితంగా రాబోయే కాలంలో యువత అసాధారణమైన ఒత్తిడి ఎదర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
చాట్ జీపీటీ వాస్తవ ప్రపంచానికి దూరంగా ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించింది. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో పనిచేస్తుంది. దీనివలన భవిష్యత్ లో మానవాళికి అనేక రకాలైన ఇబ్బందులు తలెట్టవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే దీని దుష్ఫలితాలు కనిపించడం ప్రారంభం అయిందని నిపుణులు అంటున్నారు. గతేడాది వరకూ 2% మెసేజ్ లు మాత్రమే ఆటో మెటిక్ గా పంపించడం జరిగేది. ఇప్పుడు చాట్ జీపీటీ ప్రవేశంతో 2025 నాటికి 30 శాతానికి ఇది పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2030లో 90 శాతం సినిమాలు ఏఐ సాయంతో రూపొందుతాయని భావిస్తున్నారు. ఇంతే కాకుండా కోడింగ్ నేర్చుకోవడం వంటి సాంకేతిక పనులను కూడా దీని ద్వారా సులభంగా నిర్వహించవచ్చు. ఇక సాఫ్ట్ వేర్ ఐటీ రంగాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రమాద ఘంటికలు మొగిస్తోంది. దీనికి చాట్ జీపీటీ ముఖ్యకారణం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్ట్స్ ప్రకారం 2030 నాటికి మనిషి, యంత్రాల మధ్య ఈ పోరాటం 8.5 కోట్ల మంది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. విపరీతంగా ప్రభావితమయ్యే ఉద్యోగాలలో డేటా ప్లస్, ట్రాన్స్క్రిప్షన్, కాపీ రైటర్, రీసెర్చ్ ఎనలిస్ట్, న్యూస్ రిపోర్టర్, ట్రావెల్ ఏజెంట్, యాంకర్, వాయిస్ ఓవర్ లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్స్ వంటివి అనేకం ఉన్నాయి. ఇక వ్యక్తిగత సమాచార భద్రత కూడా దీనితో ప్రశ్నార్ధకం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటలీ ఇప్పటికే చాట్ జీపీటీ పై నిషధం విధించి ప్రపంచంలో ఆ పని చేసిన ప్రధమ దేశంగా నిలిచింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశాల రక్షణ పరిస్థితి కూడా చాట్ జీపీటీ వలన ఇబ్బందిలో పడుతుంది అని అంటున్నారు. ఈ టెక్నాలజీతో డ్రోన్స్ ఏఐ రోబోలు తయారు చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరంగా మారతాయని రక్షణ రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే చాట్ జీపీటీ వలన ఉద్యోగాలు పోవడమే కాదు మొత్తం ప్రపంచంలోని వ్యవస్థలూ గందరగోళంగా మారే పరిస్థితి ఏర్పడింది.
ఆటోమేష ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయడం ప్రారంభించి చాలా కాలం అయింది. పెరుగుతున్న యువ జనాభాకు అనుగుణంగా అదనపు ఉపాధి అవకాశాల అవసరం ఏర్పడగా మరోవైపు యాంత్రీకరణ కారణంగా ఎన్నో రంగాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్, తయారీ, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లోకి ఇప్పటికే ఆటోమేషన్ అడుగు పెట్టేసింది. ఈ ఆటోమేషన్ పరిమాణం పెరుగుతున్న కొద్దీ దిగువ స్థాయి ఉద్యోగాలపై వేటు పడుతుందని నిపుణుల విశ్లేషణ. కంపెనీల దృష్టి నైపుణ్యాలపై శిక్షణ నుంచి ఆటోమేషన్ వైపు మళ్లింది. మనుషులతో పనే లేకుండా యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడం. ప్రస్తుతం పరిశ్రమలన్నింటిలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. మనుషుల్లా ఆలోచించి మనుషుల కన్నా వేగంగా చురుకుగా పనిచేసే రోబోలను సృష్టించే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతు. ఈ గణాంకాలను బట్టి చూస్తే సగటు ఉద్యోగిపై ఆటోమేషన్ ఎంత తీవ్ర ప్రభావం చూపనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆటోమేషన్ కారణంగా లోకోపైలట్లు అవసరం లేదు. టీచర్లు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వ్యవస్థ మొత్తం చేయాల్సిన పనిని ఒకరిద్దరితో చేయించేస్తారు. అంటే మిగతా ఉద్యోగాలన్నీ రిస్క్ లో పడిపోయినట్లే.
గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పరిసరాల్ని శుభ్రపర్చే 150మంది కార్మికుల్ని ఇటవల తొలగించారు. వారి స్థానంలో పని చేసేందుకు యంత్రాల్ని వినియోగించే ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. గుజరాత్‌లోని సనంద్ పట్టణంలో గల ఫోర్డ్ మోటార్స్‌లో ఇటీవల 453 రోబోల్ని ప్రవేశపెట్టారు. దీంతో 2700 మందికి పైగా కార్మికులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. ఈ కర్మాగారంలో 90శాతం పనుల్ని ఇప్పుడు రోబోలే నిర్వహిస్తున్నాయి. తాజాగా చెన్నైలోని హుందయ్ కార్ల పరిశ్రమ కూడా 400 రోబోల్ని పనిలో పెట్టుకుంది. పుణలోని ఓక్స్ వేగన్ కూడా 120రోబోల్ని బరిలో దింపింది. దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశంలోని అన్నిరంగాల్లో ఇప్పుడు యంత్రాలు ప్రవేశిస్తున్నాయి. దీంతో పనిలో వేగం, స్పష్టత పెరుగుతున్నాయి. అదే సమయంలో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. భారత్‌లో ఇప్పటికీ 69శాతం మంది రోజువారి కార్మికులు, కూలీలుగానే జీవిస్తున్నారు. వీరికి ఉపాధి లభించడం గగనం అవుతోంది. ఇప్పుడు రిటైల్ దుకాణాల నిర్వహణ నుంచి బిల్లుల వసూళ్ళ వరకు యంత్రాలు ప్రవేశిస్తున్నాయి. ఆస్పత్రులు, బహుళ అంతస్తుల కార్యాలయాలను శుభ్రం చేసేందుకు తగిన యంత్రాల్ని అందుబాటులోకి తెచ్చేశారు. అలాగే పలు రెస్టారెంట్లు కూడా సర్వర్స్ స్థానంలో యంత్రాల్ని వినియోగిస్తున్నాయి. ఇది రానురాను పెరిగేదే కానీ తగ్గేది కాదు.
కారణం ఏదైనా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఓ ఆర్థిక సంక్షోభం ముంగిట ఉంది. దానికి కారణం ఏమిటనేది లోతైన సుదీర్ఘ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం లక్షల మంది చేయాల్సిన పనులు వందల మంది చేస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోతున్నారు. ఇటీవల దిగ్గజ కంపెనీలన్నీ వరుసగా లేఆఫ్‌లు ప్రకటించాడనికి కారణం ఇలాంటి ఆటోమేషన్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ పరిస్థితి ప్రాథమిక దశలోనే ఉంది. చాట్ జీపీటీ, ఆటోమేషన్, రోబోలు విశ్వరూపం ప్రదర్శిస్తే ఇక యువతకు గడ్డు కాలం ఎదురవుతుంది. ఇది ప్రపంచాన్ని ముప్పులోకి నెడుతుందనడంతోనే సందేహం ఉండదు.