ఎండా కాలం ఊళ్లు మునిగిపోయే వరదలు రావడం వైపరీత్యమే. మరి దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా మనమే ఆ పాపం మనదే మనుషులు చేస్తున్న తప్పులే కారణం. మనుషులు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. అదికాస్తా గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడాన్ని పెంచుతోంది. దాంతో వాతావరణంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచమంతా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ పంటల దిగుబడులు తగ్గడానికి కారణం అవుతున్నాయి. అసలు సమస్య అంతా గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తోంది.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓ చోట వరదలు మరో చోట ఎండలు ఇవన్నీ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణం మారేందుకు ఎక్కువ కారణమయ్యేవి శిలాజ ఇంధనాలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడొంతులకు పైగా ఎమిషన్స్ ఉద్గారాలు వీటి నుంచే వస్తున్నాయి. పెట్రోలియం, బొగ్గు, గ్యాస్‌ని మండించడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇవి భూ వాతావరణంలో చేరి ఉపరితలానికి దగ్గరగా ఉండి వేడిని పెంచుతాయి. సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే వేడిలో కొంత భూమిపైనే ఉండిపోతుంది. మిగతాది పైకి వెళ్లిపోతుంది. కానీ అలా వెళ్లాల్సిన వేడిని వాతావరణంలో ఉన్న గ్రీన్ హౌజ్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి పంపుతున్నాయి. దాంతో వాతావరణం, భూ ఉపరితలం వేడెక్కుతున్నాయి. ఇలా గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎంతో మంది రైతులు తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది.
గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కి ధృవాల్లో ఉన్న మంచు కరుగుతోంది. దాంతో ఆ నీళ్లు సముద్రాల్లో కలిసి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దాంతో చాలావరకు వ్యవసాయ భూమి కోల్పోవలసి వస్తోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా లాంటి ప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరగడం వల్ల కోత, తీరప్రాంతాలు మునిగిపోతున్నాయి. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే కొన్ని చదరపు కిలోమీటర్ల మేర వరి పండించే భూమి సముద్రం పాలవుతుంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఈ శతాబ్దం చివరినాటికి దాదాపు 20 కోట్ల మంది శరణార్థులు అవుతారనేది ఒక అంచనా. ముఖ్యంగా ఆసియా ఖండ ప్రజల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దాంతో పర్యావరణ వలసలు మొదలవుతాయి. విశాఖ కూడా మునిగిపోతుందని అప్పుడప్పుడు రిపోర్టులు వెలువడుతూండటం ఈ వైపరీత్యమే. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్ కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఒక రకంగా గ్లోబల్ వార్మింగే కారణం.
గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తుతున్న సమస్యల్లో అకాల వర్షం కూడా ఒకటి. పంటలకు నీళ్లు పెద్దగా అవసరం లేని టైంలో పంటలు నీట మునిగేంత వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మన దగ్గరే కాదు ప్రపంచమంతటా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ వ్యవసాయం మీద పడుతోంది. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు అంటే సగటు ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, అధిక లేదా అల్ప వర్షపాతం, వేడి, చలిగాలుల్లాంటివి. ఇవన్నీ కలిసి పంటల దిగుబడులను తగ్గిస్తున్నాయి. వీటివల్ల కొత్త తెగుళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న తెగుళ్ల శక్తి పెరుగుతుంది. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ కూడా పంట దిగుబడుల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. పంటల దిగుబడితోపాటు పోషకాల నాణ్యత కూడా తగ్గుతోంది.
వాతావరణంలో మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ గడిచిన ఈ కొన్నేండ్లుగా ఆ మార్పులు మరీ ఎక్కువయ్యాయి. ఈ మార్పుల వల్ల భూమ్మీద ప్రతి జీవి మీద పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా ఆదాయాలు తక్కువగా ఉండే దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులకి, వ్యవసాయానికి మధ్య సంబంధం విడదీయలేనిది. ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లోని మార్పులే పంటల దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. రెండు దశాబ్దాలుగా అంటే 1800ల సంవత్సరం నుంచే టెంపరేచర్లు బాగా పెరిగిపోతున్నాయి. అయితే దీనికి ముఖ్యకారణం పరిశ్రమలు, మోటార్ వెహికల్స్ పెరగడమే. పరిశ్రమలు ఏర్పాటు చేయకముందు ఉన్న టెంపరేచర్‌తో పోలిస్తే భూమి ఉష్ణోగ్రత1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పరిశ్రమల నుంచి వెలువడే గ్రీన్హౌస్ వాయువులే టెంపరేచర్లు పెరగడానికి కారణం.1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ లెవల్స్ 30 శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏండ్లలో వాతావరణంలో ఇప్పుడున్నంత కార్బన్ డై ఆక్సైడ్ ఎప్పుడూ లేదు.
మన దేశంలో ప్రతిసారి మార్చిలో వేడిగాలులు వచ్చి, ఏప్రిల్, మే నెలల్లో బాగా పెరుగుతాయి. కానీ ఈ సారి వేడి గాలులు ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. మేలో వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణం వల్ల పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణంలో మార్పులు వేగంగా పెరిగితే పంట దిగుబడి తగ్గి2030 నాటికి ఆఫ్రికాలో 43 మిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారతారని అనేక నివేదికలు చెప్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం మీద పడే ఎఫెక్ట్ వల్ల అందరికీ నష్టమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతాయి. దాంతో ధాన్యం ధరలు పెరుగుతాయి. అలా ఈ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ముఖ్యంగా పేదల కొనుగోలు శక్తి తగ్గుతుంది. 2050 నాటికి తిండి ఖర్చు దాదాపు 80 శాతం పెరుగుతుందనేది ఒక అంచనా. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుస్థితిని మానవుడు తనకు తాను తెచ్చి పెట్టుకుంటున్నాడు.