పులిని చూసి నక్క వాత పెట్టుకుందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పటిదాకా నెట్ సెర్చింగ్‌లో పులిలా బతికిన గూగుల్ కొత్త కాంపిటీటర్ని అనుకరించబోయింది. మొదట్లోనే ఏదో చేయబోతే ఇంకేదో అయిపోయింది. సెర్చింగ్‌లో చాట్ జీపీటీ ఇప్పుడో సంచలనం. రెండ్నెల్లలోనే రికార్డులు తిరగరాసిన చాట్ జీపీటీకి కైంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో పడ్డాయి ఇప్పటిదాకా తిరుగులేదనుకున్న సంస్థలు. మాకు తెలీని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్నా అంటూ గూగుల్ బార్డ్ పేరుతో చాట్‌బాట్ తీసుకొచ్చినా స్టార్టింగ్ ట్రబుల్ దెబ్బకొట్టింది. ప్రమోషనల్ వీడియోలో చిన్నపాటి పొరపాటు కంపెనీ షేర్లను కుదిపేసింది.
గూగుల్‌కి పెద్ద సవాలే విసిరింది చాట్ జీపీటీ. పాతొక రోత కొత్తొక వింతలా అంతా దానివైపు చూడటంతో గూగుల్ అప్రమత్తమైంది. అయితే చిన్న తప్పిదంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు హారతి కర్పూరంలా కరిగిపోయింది. బార్డ్ పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ తీసుకొస్తున్నట్లు గూగుల్ సీఈవో ముందే ప్రకటించారు. అయితే అన్ని ప్రయోగాలు అయ్యాకే జనంలోకి తెద్దామనుకున్నా ఓ ప్రమోషనల్ వీడియో కొంపముంచింది.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ ఇచ్చిన సమాధానాల్లో ఒకటి తేడాకొట్టింది. బుర్రపెట్టి ఆలోచించే మనిషే తప్పులు చేస్తుంటాడు. ఇక కృత్రిమమేథస్సు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందనుకోవడం అత్యాశే. అయితే ఈ ఒక్క పొరపాటుతో గూగుల్ చాట్‌బాట్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవయ్యాయి. అల్ఫాబెట్ షేర్లు 8 శాతం క్షీణించి దాదాపు 100 బిలియన్ డాలర్ట మార్కెట్ వాల్యూ దెబ్బతింది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ బార్డ్ యాడ్‌లోని తప్పును మొదట గుర్తించింది. ప్యారిస్‌లో బార్డ్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఇది బయటపడటంతో తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు చాట్ జీపీటీ జోష్‌లో ఉన్న టెక్కీలు బార్డ్వైపు చూడలేదన్న ప్రచారం కూడా ప్రభావం చూపించింది. ఈ పరిణామాలతో కృత్రిమ మేథ రేసులో గూగుల్ వెనుకబడిపోయేలా ఉంది.